Saturday, April 27, 2024

ట్రంప్ మెడకు రహస్య పత్రాల ఉచ్చు

- Advertisement -
- Advertisement -

మియామి: వచ్చే ఏడాది జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేసుల సుడిగుండంతో చిక్కుకొంటున్నారు. ఇప్పటికే ఓ శృంగార నటికి డబ్బుల చెల్లింపు విషయంలో ఆయనపై నేరాభియోగాలు నమోదయిన విషయం తెలిసిందే. తాజాగా రహస్య పత్రాల కేసులోనై ఆయనపై ఫెడరల్ అభియోగాలు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. వచ్చే మంగళవారం(ఈ నెల 13న) మియామీ ఫెడరల్ కోర్టు హౌస్‌లో హాజరు కావాలనిసమన్లు ఇచ్చినట్లు ఆయన చెప్పారు.

2021 జనవరిలో అధ్యక్ష పదవినుంచి దిగిపోయిన తర్వాత ట్రంప్ .. ప్రభుత్వానికి చెందిన పలు కీలక పత్రాలను ఫ్లోరిడాలోని తన మార్ ఎ లాగో ఎస్టేట్‌కు తరలించినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే శ్వేత సౌధాన్ని ఖాళీ చేసేందుకు తక్కువ సమయం ఇవ్వడంతో ఆ హడావుడిలో పత్రాలు వచ్చి ఉంటాయని అప్పట్లో ట్రంప్ కార్యాలయం ప్రకటించింది. అయితే ఆ పత్రాలను తిరిగి తీసుకునేందుకు నేషనల్ ఆర్కైవ్స్ అండ్ రికార్డ్ అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నించగా .. వాటిని ట్రంప్ అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది జనవరిలో ఎఫ్‌బిఐ అధికారులు ట్రంప్ ఎస్టేట్‌లో సోదాలు చేపట్టగా.. 15 బాక్సుల్లో 184 పత్రాలు లభించాయి.

ఇందులో 67 విశ్వసనీయ, 92 రహస్య, 25 అత్యంత రహస్య పత్రాలు ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ పత్రాలను ట్రంప్ తన ఇంట్లో ఇతర పత్రాలతో కలిపి ఉంచినట్లు తెలిసింది. ఒక్కో బాక్సులో రహస్య పత్రాలతో పాటుగా వార్తా పత్రికలు,మ్యాగజైన్లు, ఫొటోలు, వివిధ రకాల ప్రింట్‌అవుట్‌లు, వ్యక్తిగత పత్రాలు కలిపి ఉంచినట్లు తేలింది. ఆ తర్వాత గత ఆగస్టులోనూ అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఎఫ్‌బిఐ మరోసారి ఆ ఎస్టేట్‌పై దాడి చేసి 20 బాక్సులనిండా పత్రాలను తరలించింది.
తొలి అధ్యక్షుడు ఈయనే..
రహస్య పత్రాలకు సంబంధించి అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై మొత్తం ఏడు ఆరోపణలు నమోదయ్యాయి. ఆరోపణలకు సంబంధించిన సమాచారాన్ని ఫెడరల్ జ్యూరీ ట్రంప్ లీగల్ టీమ్‌కు తెలియజేసింది. అయితే ఆరోపణలకు సంబంధించిన వివరాలను ట్రంప్ లీగల్ టీమ్‌కు పంపిన నోటీసుల్లోను ఫెడరల్ జ్యూరీ తెలియజేయలేదని తెలుస్తోంది. అమెరికా చరిత్రలోనే ఓ సిట్టింగ్ లేదా మాజీ అధ్యక్షుడిపై ఇలా ఫెడరల్ అభియోగాలు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఇందులో ట్రంప్ దోషిగా తేలితే సుదీర్ఘ కాలం శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వ పోటీలో ముందున్న ట్రంప్ ఈ కేసు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే ఇది ఎన్నికలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది ఇంకా తెలియరాలేదు.
నేను అమాయకుడ్ని: ట్రంప్
కాగా ఈ అభియోగాల గురించి తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో స్వయంగా వెల్లడించిన ట్రంప్ తాను అమాయకుడినని, కుట్రపూరితంగానే తనపై అభియోగాలు మోపినట్లు ఆరోపించారు. ఎన్నికల్లో పోటీచేయకుండా తనను అడ్డుకునేందుకు డెమోక్రాట్లు చేస్తున్న కుట్రగా ట్రంప్ అభివర్ణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News