భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాను సందర్శించినప్పుడు ఆయనతో తాను వచ్చే వారం భేటీ కాగలనని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ప్రకటించారు. క్వాడ్ శిఖరాగ్ర సదస్సు కోసం ఆస్ట్రేలియా, జపాన్ అధినేతలతో పాటు ప్రధాని మోడీ ఈ వారాంతంలో యుఎస్‌కు రానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన స్వస్థలం డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో క్వాడ్ సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నారు. ‘క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్’ అని లాంఛనంగా పేర్కొనే క్వాడ్ 2004లో హిందు మహాసముద్రంలో సునామీ విధ్వంసం దరిమిలా ఒక భాగస్వామ్య బృందంగా ప్రారంభమైంది.
జనాదరణ అధికంగా ఉన్న భారత ప్రధాని మోడీ దశాబ్దికి పైగా సాగుతున్న తన కెరీర్‌లో హిందు జాతీయవాదాన్ని ప్రోత్సహించారు. కాగా, ట్రంప్‌తో మోడీ సమావేశం గురించి ఇంతకుముందు సమాచారం లేదు. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ మిషిగన్ ఫ్లింట్‌లో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మొదటిసారిగా మోడీతో భేటీ గురించి ప్రస్తావించారు. అయితే, వాషింగ్టన్‌లో భారత రాయబార కార్యాలయం ఈ విషయమై ఇంకా స్పందించలేదు.