Sunday, April 28, 2024

అకడమిక్ క్యాలెండర్

- Advertisement -
- Advertisement -

TS Education Department announced Academic Calendar

213 పని దినాలతో ప్రకటించిన విద్యాశాఖ, 166 రోజులు ప్రత్యక్ష బోధన, 47 ఆన్‌లైన్ తరగతులు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం 166 రోజులు ప్రత్యక్ష బోధన జరగనుంది. ఈనెల 1వ తేదీ నుంచి ప్రారంభమైన ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కాగా, ఏప్రిల్ 23 వరకు 166 పని దినాలు కొనసాగనున్నాయి. ఇప్పటి వరకు జరిగిన 47 రోజుల ఆన్‌లైన్ తరగతులను పరిగణనలోకి తీసుకుని 213 రోజుల పనిదినాలతో పాఠశాల విద్యాశాఖ 2021- 22 విద్యా సంవత్సరాన్ని ఖరారు చేసింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌ను ప్రకటించింది. ఈ ఏడాది బడులకు సెలవులను తగ్గించలేదు. దసరాకు 12 రోజులు, సంక్రాంతికి 6 రోజులు సెలవులు ప్రకటించింది. పదవ తరగతికి ఫిబ్రవరి నెలాఖరు వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు పూర్తి చేయనున్నట్లు వెల్లడించింది. ఈ నెల, వచ్చే నెలలో ఇన్‌స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్ పోటీలు నిర్వహించనున్నారు.

సెలవులు యాథాతథం

ఈ విద్యా సంవత్సరం సెలవుల సంఖ్యను యథావిధిగా కొనసాగిస్తూ అకడమిక్ క్యాలెండర్‌ను ప్రకటించింది. పాఠశాలలకు అక్టోబరు 6 నుంచి 17 వరకు 12 రోజులు దసరా సెలవులు ఇవ్వనున్నారు. మిషనరీ పాఠశాలలకు డిసెంబర్ 22 నుంచి 28 వరకు ఏడు రోజులు క్రిస్టమస్ సెలవులు ఉంటాయి. జనవరి 11 నుంచి 16 వరకు 6 రోజులు సంక్రాంతి సెలవులు ఉంటాయని విద్యాశాఖ తెలిపింది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. ఇన్‌స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్ పోటీలు ఈ నెలలోనే ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఈనెల 21 నుంచి అక్టోబరు 5 వరకు జిల్లా స్థాయి, అక్టోబరు చివరి వారంలో రాష్ట్ర స్థాయి, డిసెంబరు లేదా జనవరిలో జాతీయ స్థాయి ఇన్‌స్పైర్ పోటీలు ఉంటాయని విద్యాశాఖ వెల్లడించింది.

ప్రత్యేక రోజుల్లో ఉత్సవాలు

వచ్చే నెలలో దివంగత రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఎన్‌సిఇఆర్‌టి మార్గదర్శకాల ప్రకారం అన్ని పాఠశాలల్లో జాతీయ ఆవిష్కరణ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. పాఠశాలల్లో ప్రతీ నెల మొదటి శనివారం బాల సభ, 3వ శనివారం క్విజ్ పోటీలు, 4వ శనివారం స్వచ్ఛ పాఠశాల, హరితహారం, జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం, ఈనెల 9న తెలంగాణ భాష దినోత్సవం, డిసెంబర్ 22న జాతీయ గణిత దినం, డిసెంబరు లేదా జనవరిలో పాఠశాల వార్షికోత్సవం, ఫిబ్రవరి 21న మాతృభాష దినోత్సవం, ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించాలని విద్యా శాఖ ప్రకటించింది. నవంబర్, జనవరి, ఫిబ్రవరిల్లో స్కూల్ కాంప్లెక్సు సమావేశాలు జరపాలని స్పష్టం చేసింది. ప్రతీ విద్యార్థికి ఈ విద్యా సంవత్సరంలో రెండుసార్లు ఆరోగ్య పరీక్షలు జరపాలని తెలిపింది.

మార్చి లేదా ఏప్రిల్‌లో టెన్త్ పరీక్షలు

ఒకటవ తరగతి నుంచి నుంచి 10 తరగతులకు ఫిబ్రవరి 28 నాటికి సిలబస్ పూర్తి చేసి.. మార్చి 1 నుంచి పునశ్ఛరణ తరగతులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. మార్చి, ఏప్రిల్‌లో పదో తరగతి వార్షిక పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సిలబస్ పూర్తి, పరీక్షల వివరాలు

ఒకటి నుంచి 9వ తరగతి వరకు 2022 ఫిబ్రవరి 28 నాటికి సిలబస్ పూర్తి చేయాలి.

పదవ తరగతి విద్యార్థులకు 2022 జనవరి 10 నాటికి సిలబస్ పూర్తి చేయాలి.

ఫార్మేటివ్ అసెస్‌మెంట్ -1 (ఎఫ్‌ఎ) పరీక్షలకు గడువు : అక్టోబర్ 5

ఫార్మేటివ్ అసెస్‌మెంట్ -2 పరీక్షలకు గడువు: జనవరి 31

డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 8 వరకు సమ్మెటివ్ అసెస్‌మెంట్ 1 (ఎస్‌ఎ)1 పరీక్షలు

ఏప్రిల్ 7 నుంచి 18 వరకు సమ్మెటివ్ అసెస్‌మెంట్ -2 పరీక్షలు

ఫిబ్రవరి 28 నాటికి పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు పూర్తి చేయాలి.

ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News