Friday, May 3, 2024

సింగరేణి కార్మికులకు దసరా ధమాక

- Advertisement -
- Advertisement -

సింగరేణి కార్మికులకు దసరా ధమాక
ఈ నెల 23వ తేదీన లాభాల బోనస్ 
మార్చి నెలలో మినహాయించిన జీతం చెల్లింపు
ఈ నెల 19వ తేదీన పండుగ అడ్వాన్సు కూడా చెల్లింపు: సిఎండి ఎన్.శ్రీధర్

TS Govt announces Bonus for Singareni Employees

మన తెలంగాణ/హైదరాబాద్: సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వ దసరా ధమాకను ప్రకటింటింది. సంస్థకు వచ్చిన లాభాల బోనస్ (28శాతం)ను ఈ నెల 23వ తేదీన చెల్లించనుంది. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో సింగరేణి సంస్థ సిఎండి ఎన్.శ్రీధర్ వెల్లడించారు. 2019-2020 ఆర్ధిక సంవత్సరంలో సాధించిన నికర లాభాలు రూ.993.86 కోట్లు కాగా సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ఇందులో 28 శాతం అనగా రూ. 278.28 కోట్లను సంస్థలోని ఉద్యోగులకు బోనస్‌గా చెల్లించనున్నామన్నారు. సగటున ఒక్కో కార్మికునికి రూ.60,468లు బోనస్ లభించే అవకాశముందని పేర్కొన్నారు.అలాగే కరోనా నేపథ్యంలో మార్చి 2020 జీతాల్లో మినహాయించిన జీతాన్ని కూడా ఈ లాభాల బోనస్ తో పాటు కలిపి 23వ తేదీనే కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు శ్రీధర్ వెల్లడించారు. అంతేకాకుండా ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా దసరా పండుగ అడ్వాన్సు సొమ్మును ఒక్కొక్కరికి రూ.25 వేలను ఈనెల 19వ తేదీన ఉద్యోగుల ఖాతాల్లో చెల్లిస్తున్నామని వివరించారు.

కోవిడ్-19 నేపథ్యంలో కంపెనీ యొక్క ఆర్ధిక పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని గత ఏడాది మాదిరిగానే 28 శాతం లాభాల బోనస్ ను ఈ ఏడాది (2019-20) కూడా చెల్లించాలని సిఎం కెసిఆర్ ఇప్పటికే ఆదేశించారన్నారు. దీనికి సింగరేణి కార్మికుల తరపున సిఎంకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఎన్. శ్రీధర్ పేర్కొన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడినాక సిఎం కెసిఆర్ సింగరేణి కార్మికులపై గల ప్రత్యేక అభిమానంతో ప్రతి ఏడాది లాభాల బోనస్ శాతాన్ని పెంచుతూ వస్తున్నారని వివరించారు. తెలంగాణ రాక ముందు 2012-13లో లాభాల వాటా 18 శాతం ఉండగా, 2013-14లో సిఎం దానిని 20 శాతానికి (రూ.83.65 కోట్లు) పెంచారన్నారు. అలాగే 2014-15లో 21 శాతం (రూ.103 కోట్లు), 2015-16లో 23 శాతం (రూ.245 కోట్లు), 2016-17లో 25 శాతం (రూ.98.85 కోట్లు), 2017-18లో 27 శాతం ( రూ.326.25 కోట్లు ), 2018-19లో 28 శాతం (రూ.479 కోట్లు) చెల్లించారన్నారు. ఈ ఏడాది కూడా 28 శాతాన్ని కొనసాగించడం పట్ల కార్మికులు తమ సంతోషం ప్రకటిస్తున్నారని ఆయన వెల్లడించారు.

TS Govt announces Bonus for Singareni Employees

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News