Sunday, April 28, 2024

కొనకపోతే ఇండియా గేటు ముందు పారబోస్తాం

- Advertisement -
- Advertisement -

TS Ministers fires on Central government

వారం రోజులుగా కేంద్రం నుంచి స్పందన లేదు

రెండు రోజులు సమయం అడిగిన కేంద్ర మంత్రి పీయూష్ మళ్లీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు
రాష్ట్రాలు కేంద్రం దయాదాక్షిణ్యాల మీద నడవాలని చూస్తున్నారు
అవమానపరిచినవాళ్లు మూల్యం చెల్లించక తప్పదు
కేంద్రానికి నచ్చిన పార్టీలు, సొంత ప్రభుత్వాలకే ప్రాధాన్యం
గోదాములపై ఏడు లేఖలు రాశాం
ఇంకా సగం బియ్యం రాష్ట్రంలోనే మూలుగుతున్నాయి
తెలంగాణలో ఇంత ధాన్యం ఎక్కడి నుంచి వచ్చిందని ఎగతాళి చేస్తున్నారు
ఢిల్లీలో మీడియాతో మంత్రులు, ఎంపిల బృందం

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో ఇంకా 60 లక్షల టన్నుల ధాన్యం నిల్వ ఉందని, మొత్తం ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయకపోతే ఢిల్లీ తీసుకొచ్చి ఇండియా గేటు వద్ద పారబోస్తామంటూ మంత్రి ప్రశాంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ధాన్యం సేకరణపై మాట్లాడేందుకు వారం రోజుల క్రితం మంత్రులు, ఎంపిల బృందం ఢిల్లీకి వచ్చినా కేంద్రం నుంచి సరైన స్పందన లేదని మండిపడ్డారు. తెలంగాణలో రాబోయే 60 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని కూడా సేకరిస్తామని లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌కు విజ్ఞప్తి చేశామని ప్రశాంతరెడ్డి గుర్తు చేశారు. దీనికి ఆయన రెండ్రోజులు సమయం ఇవ్వాలని అడిగారని.. రెండ్రోజులు గడిచినా ఎలాంటి స్పందన లేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెసిడెంట్ కమిషనర్ ద్వారా పియూష్ గోయల్ అపాయింట్‌మెంట్ అడిగినా ఇంకా ఇవ్వలేదని, ఇది చాలా దురదృష్టకరమని ప్రశాంత్‌రెడ్డి అన్నారు.

కేంద్ర ప్రభుత్వం అనుసరించాల్సిన పద్ధతి ఇది కాదని, తెలంగాణ రైతుల తరపున కేంద్రం వైఖరిని తీవ్రంగా పరిగణిస్తున్నామని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయని, బియ్యం సేకరణపై ఎఫ్‌సిఐ, కేంద్రం గోడౌన్లు పెంచలేదని ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు. వానాకాలంలో రైతులు పండించిన 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి, డబ్బులు చెల్లిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో వానాకాలంలో ఎంత పడితే అంత ధాన్యం తీసుకుంటామని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ పార్లమెంట్‌లో మాట ఇచ్చారని.. మీడియాతో మాట్లాడుతూ కిషన్‌రెడ్డి కూడా హామీ ఇచ్చారని ప్రశాంత్‌రెడ్డి గుర్తు చేశారు. అయినా దానిపై ఇంకా స్పష్టత ఇవ్వట్లేదని మంత్రి దుయ్యబట్టారు. తెలంగాణ రైతులను తీవ్రంగా అవమానించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది అని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. యాసంగిలో ధాన్యం కొనేది లేదని మరోసారి కేంద్రం స్పష్టం చేసింది కనుక.. ఇక రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఉండవని మంత్రులు వెల్లడించారు.

కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌వి అసత్య ఆరోపణలు : మంత్రి గంగుల

కేంద్ర మంత్రి పియూష్ గోయల్ రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేశారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కేంద్రానికి ఇస్తామన్న ధాన్యం ఇవ్వటం లేదన్నారు. ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు ఏడు లేఖలు రాశామని తెలిపారు. రాష్ట్రంలోని గోదాములు నిండిపోయాయి.. తీసుకెళ్లండి అని లేఖలు రాసినా ఒక్కదానికి కూడా స్పందన రాలేదన్నారు. ‘మా గోదాములు నిండిపోయాయి.. పక్క రాష్ట్రాల్లో ఖాళీ గోదాముల్లో నిల్వ చేసుకునేందుకు అనుమతివ్వండి’ అని అడిటినా ఎటువంటి సమాధానం రాలేదని తెలిపారు. ఇప్పుడు కూడా సగం బియ్యమే తీసుకెళ్లారని.. మిగతా సగం గోదాముల్లోనే ఉందని స్పష్టం చేశారు. ఇప్పుడవి ఖాళీ చేస్తేనే.. ఇప్పుడొచ్చే ధాన్యాన్ని నిలువ చేయగల మన్నారు. వారి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి గంగుల మండిపడ్డారు.

రాష్ట్ర రైతులను కేంద్ర పెద్దలు అవమానిస్తున్నారు : ఎంపి నామా

పార్లమెంటులో తొమ్మిది రోజుల పాటు రైతు సమస్యలపై పోరు సల్పామని ఎంపి నామా నాగేశ్వరరావు అన్నారు. పార్లమెంటు లోపల, బయట అనేకానేక ఆందోళనలు వివిధ రూపాల్లో నిర్వహించామని తెలిపారు. రాష్ట్ర రైతులను కేంద్ర పెద్దలు అవమానిస్తున్నారని నామా మండిపడ్డారు. అంతేకాదు.. తెలంగాణలో ఇంత ధాన్యం ఎక్కడ్నించీ వచ్చింది? అని ఎగతాళి చేశారన్నారు. కేంద్రం ప్రభుత్వం చలనం లేకుండా రైతులను ఆవేదనకు గురిచేస్తోందన్నారు. తెలంగాణలో పండిన పంటను కొనాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా? అని ప్రశ్నించారు. ఒకట్రెండు రోజుల్లో సమస్య పరిష్కరించాలని కేంద్రాన్ని కోరుతున్నామని నామా అన్నారు.

ఆరుగాలం కష్టపడ్డ రైతులు మనోవేదనకు గురవుతున్నారు : మంత్రి నిరంజన్‌రెడ్డి

ఆరుగాలం కష్టపడ్డ రైతు మహావేదనకు గురవుతున్నారని మంత్రి నిరంజన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల సమాహారం.. కానీ రాష్ట్రాలను రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైనట్లుగా కేంద్రం చూడటం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం దయా, దాక్షిణ్యాల మీద నడవాలని చూస్తున్నారని.. ఇది దేశానికి మంచిది కాదన్నారు. గతంలో రాష్ట్రాల అభిలాషలను అవమానపరిచిన వారు తగిన మూల్యం చెల్లించారని.. మళ్లీ అలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఆయన స్పష్టం చేశారు. కో ఆపరేటివ్ ఫెడరలిజం తెస్తామని ఆశ పుట్టించారన్నారు. నీతి అయోగ్ సిఫార్సులను పాటించరని తెలిపారు. వారికి నచ్చిన రాష్ట్రాలకు, వారి పార్టీ ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తారన్నారు. అన్ని అంశాలలోనూ ఇలానే చేస్తున్నారని తెలిపారు. గుజరాత్, హైదరాబాద్‌కు వరదలు వచ్చినప్పుడు ఎలా వ్యవరించారో చూసినమని అన్నారు. అఖండ మెజారిటీ వచ్చిన ప్రభుత్వాలు అతిగా చేసినప్పుడు పడిపోయాయని వెల్లడించారు.

రాష్ట్రాలను, ముఖ్యమంత్రుల పట్ల బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారన్నారు. వ్యవసాయ రంగం పరిశోధనలు చేసే అంశం కేంద్రానిది, కనీస మద్దతు ధర నిర్ణయం, ఎగుమతులు, గోడౌన్లు, రైల్వేలు, కేంద్రం చేతిలోనే ఉన్నాయన్నారు. ఇప్పుడు చేతులు ఎత్తేస్తున్నారన్నారు. భారత భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా క్రాప్ కాలనీలు చేస్తే దేశానికి బాగుంటుందని తెలిపారు. రైతుల ఆదాయం రెండింతల రెట్టింపు చేస్తామన్నారు. రైతులు పండించిన పంటను ఇండియాగేట్ వద్ద పోసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కొత్త దారులు వెతకరు.. పరిశోధనలు చేయరన్నారు. 80,90 వేల కోట్ల రూపాయల విదేశీ ధనం వెచ్చించి పంట నూనెలు తెచ్చుకుంటున్నామని చెబుతున్నారన్నారు. కానీ దేశ రైతులకు పంట నూనెలు పండించే దారి చూపడం లేదన్నారు. 140 కోట్ల జనాభా నైపుణ్యాన్ని నీరుగారుస్తున్నారని తెలిపారు.

రైతులు ఉత్పత్తులను చిన్నచూపు చూసి తిరోగమనం దిశగా నడుపుతున్నారన్నారు. దేశంలో పప్పు దినుసుల కొరత ఉందన్నారు. రాబోయే కాలంలో వానాకాలంలో తెలంగాణలో 3.5 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉపన్యాసాలు ఇచ్చి అదే దేశభక్తి అని చెబుతున్నారన్నారు. ప్రజల కడుపు నిండితేనే దేశభక్తి అని తెలిపారు. వ్యవసాయ రంగంపై కేంద్రం చూపు హానికరంగా ప్రమాదకరంగా ఉందన్నారు. ఒక రాష్ట్రం వచ్చి ఢిల్లీలో ఎదురుచూస్తుంటే చిన్నచూపు చూస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విజ్ఞతను చేస్తున్నామన్నారు. ఇది రాజకీయాలతో చూసే అంశం కాదని.. ప్రస్తుతం ‘ధాన్యం కొనుగోళ్లను కొనసాగిస్తాం.. కేంద్ర ప్రభుత్వ లేఖ కోసం వేచి చూస్తాం’ అని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

బిజెపి నేతలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌కు తప్పుడు సంకేతాలు ఇచ్చారన్నారు. బిజెపి నేతల వ్యవహారాన్ని తాము ఆయనకు వివరించామని తెలిపారు. ఇది రాజకీయం కాదు.. రైతాంగం సమస్య అని,దీనికి మద్దతు తెలపాల్సింది పోయి తప్పుడు సమాచారం ఇచ్చారని మండిపడ్డారు. రాష్ట్ర బిజెపి నేతలు లేఖలు ఇవ్వడానికి అడ్డుపడుతున్నట్లు అనిపిస్తోందని తెలిపారు. తమకు తెలియకుండా లేఖలు ఇస్తారా? తాము ఆపుతామని బిజెపి నేతలు మాట్లాడినట్లు తెలిసిందన్నారు. ఎంత సిగ్గుచేటు.. దీన్ని వదిలిపెట్టం..దేశ రైతాంగానికి వ్యతిరేకంగా బిల్లు తెచ్చి వెనక్కి తీసుకున్నారు.. క్షమాపణలు కూడా చెప్పారన్నారు. మళ్లీ రైతుల అంశంలో ఎందుకు రాజకీయాలు అంటూ విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు బిడ్డ.. రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదన్నారు. 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా, సాగునీళ్లు ఇలా అనేక రైతు మద్దతు చర్యలు తీసుకున్నామన్నారు. 60 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా వచ్చిన ధాన్యంతో ఇండియా గేట్ వద్ద కూర్చుంటాం.. దేశ రైతాంగానికి తెలిసేలా నిర్ణయం తీసుకుంటామన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News