Monday, May 6, 2024

టిఎస్‌ఆర్‌టిసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ ఉదారత..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: టిఎస్‌ఆర్‌టిసిపై ఆ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ ఉదారతను చాటుకున్నారు. ఆర్‌టిసి చైర్మన్‌గా సంస్థ నుంచి తాను ఎలాంటి జీతభత్యాలు తీసుకోనని సంస్థ ఎండి సజ్జనార్‌కు లేఖ రాశారు. శాసనసభ సభ్యునిగా వస్తున్న జీతభత్యాలు తనకు చాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఆర్‌టిసి నష్టాల్లో ఉన్నందున భారం మోపడం ఇష్టం లేనందునే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా బాజిరెడ్డి గోవర్దన్ స్పష్టం చేశారు. బాజిరెడ్డి గోవర్దన్ తీసుకున్న నిర్ణయం పట్ల టిఎస్‌ఆర్‌టిసి ఎండి సజ్జనార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బాజిరెడ్డి నిర్ణయం పట్ల ఆర్‌టిసి అధికారులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ప్రస్తుతం బాజిరెడ్డి గోవర్దన్ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి టిఆర్‌ఎస్ పార్టీ శాసనసభ్యునిగా ఉన్నారు. ఆయనను ఈ ఏడాది సెప్టెంబర్‌లో టిఎస్‌ఆర్‌టిసి చైర్మన్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే.

నిజామాబాద్ సిరికొండ మండలం రావుట్లలో జన్మించిన గోవర్దన్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కీలక నేతగా ఎదిగారు. 1973లో పోలీస్ పటేల్‌గా పనిచేశారు. ఆయన మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చాక చిమన్‌పల్లి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం సిరికొండ ఎంపిపిగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 1994లో ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 1999లో ఆర్మూర్ నుంచి, 2004లో బాన్సువాడ నియోజకవర్గం నుంచి బాజిరెడ్డి గోవర్దన్ గెలుపొందారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ తరపున నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.

TSRTC Chairman Govardhan Refuses to take Salary

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News