Wednesday, May 8, 2024

జంట హత్యల నిందితుడు గ్రామస్తుడే..

- Advertisement -
- Advertisement -

సత్తుపల్లిః తల్లి కొడుకులను గొంతు కోసి అమానుషంగా హత్య చేసింది అదే గ్రామానికి చెందిన యువకుడని పోలీసుల విచారణలో తేలింది. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏ.సీ.పీ రామాంజనేయులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి హత్య జరిగిన తీరును వివరించారు. మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో ఆటో నడుపుతూ, అక్రమ సంపాదనకు అలవాటు పడిన దర్శనపు సునీల్ అలియాస్ మహేష్ 2021 లో కుడా అదే గ్రామంలో ఓ దొంగతనం కేసులో నిందితుడు. జూదాం, చెడు వ్యసనాలకు బానిసై అక్రమ సంపాదన మార్గాలను అన్వేషిస్తూ దొగతనం చేస్తూ హత్యలు చేశాడన్నారు. గత నెల 31వ తేదీన గ్రామానికి చెందిన రాయల తులశమ్మ పెన్షన్ డబ్బులు కోసం సత్తుపల్లి బ్యాంక్ కు వెళ్ళి తిరిగి నారాయణపురం ఇంటికి వెళ్లేందుకు ఆటో ఆపి రూ.100 కి నారాయణపురం వెళ్లేందుకు కిరాయి మాట్లాడుకుంది. పాత సెంటర్ లోని లక్ష్మీనారాయణ జనరల్ స్టోర్ వద్ద ఆటో ఆపి కిరాణా సరుకులు, బియ్యం మూట తీసుకుని ఆటోలో బయలుదేరింది.

కిరాణా షాప్ లో డబ్బులు ఇచ్చేందుకు తులశమ్మ పర్సులో నుంచి డబ్బులు తీస్తుండగా రూ.500 నోట్ల కట్టను డ్రైవర్ సునీల్ గమనించాడు. ఆ నగదు రాత్రికి దొంగతనం చేయాలని పన్నాగం పన్ని, తులిశమ్మను ఆటోలో గ్రామంలోకి తీసుకువెళ్తే దొంగతనం చేశాక తనను గుర్తుపట్టే అవకాశం ఉందని భావించి, కాకర్లపల్లి క్రాస్ రోడ్ వద్ద ఆటో ఆపి తనకు కిరాయి గిట్టుబాటు కాదని, వేరే ఆటో చూసుకొని వెళ్ళమని నమ్మ బలికాడు. ఆమె అదే విధంగా మరో ఆటోలో ఇంటికి చేరింది. సునీల్ ప్లాన్ మేరకు అర్ధ రాత్రి దొంగతనానికి బయలుదేరాడు. ఎవరైనా అడ్డువస్తే చంపేయాలని నిర్ణయించుకుని గడ్డి కోసే కొడవలి వెంట తీసుకువెళ్ళాడు. తులిశమ్మ ఇంటి తలుపులు గడివేయకుండా మూసి ఉండడంతో తేలిగ్గా ఇంటిలోకి ప్రవేశించాడు. ముందు గదిలో మంచం పై తులసమ్మ నిద్రిస్తుండగా, వెనక గదిలో మతిస్థిమితం లేని ఆమె కొడుకు రాయల సత్యనారాయణ మరో మంచంపై నిద్రిస్తున్నాడు.

పక్కనే ఉన్న ట్రంకు పెట్టె తెరిచి అందులో ఉన్న డబ్బు తీస్తుండగా శబ్దం రావడంతో తులిశమ్మ పెద్దగా అరవడంతో ఆమెను బలవంతంగా పైకి లేపి విసిరివేశాడు. కొడుకును కుడా నెట్టివేయడంతో ఆ భయాందోళనకు గురైన ఆ వృద్దురాలు తమని ఏమి చేయవద్దని, కావాలంటే డబ్బు తీసుకుపోమని ప్రాధేయపడినప్పటికి, దొంగతనం చేసిన విషయం బయటకు తెలుస్తుందని భావించి సునీల్ తన వెంట తెచ్చుకున్న కొడవలితో తులిశమ్మను వెనక్కి తిప్పి తన కాళ్లతో చేతులను గట్టిగా నొక్కి పట్టి కొడవలితో పీక కోసి చంపాడు. ఆమె కొడుకు సత్యనారాయణ ను కూడా అదే విధంగా గొంతు కోసి, వారు చనిపోయారని ధ్రువీకరించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అప్పటికే రూ.3500కి బేతుపల్లిలో తాకట్టులో ఉన్న తన సెల్ ఫోన్ ను విడిపించుకొని మిగిలిన నగదును సత్తుపల్లిలోనే తన రెండు బ్యాంకు ఖాతాలో జమ చేశాడు.

పోలీసులు విచారణ వేగవంతం చేయడంతో హత్యకు వినియోగించిన కొడవలి రక్తమార్గం అంటిన తన బట్టలను బేతుపల్లి చెరువులో పడి వేసేందుకు వెళ్తుండగా వాహన తనఖీలో చేస్తున్న పోలీసులను చూసి పారిపోతుండగా సునీల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. పోలీసుల విచారణలో హత్య జరిగిన తీరు అందుకు దారి తీసిన కారణాలను సునీల్ వివరించినట్లు సీ.ఐ మోహన్ బాబు పేర్కొన్నారు. నిందితులపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. త్వరితగతిన హత్య కేసును చేదించిన సిబ్బందిని ఏ.సి.పి అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News