Tuesday, October 15, 2024

అన్నంలో రాళ్లు.. టాయిలెట్లలో నీళ్ల కొరత:బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

విద్యార్థులు తినే అన్నంలో రాళ్లు వస్తున్నా, విద్యార్థులు ఉపయోగించే టాయిలెట్లలో నీళ్లు రాకపోయినా సిబ్బంధి ఎందుకు పట్టించుకోవడం లేదని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండలం, మరిమడ్ల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌ను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బంది నిర్లక్షంపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాకు సూచించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడదుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం గిరిజన విద్యార్థులందరికీ కార్పొరేట్‌కు దీటుగా నాణ్యమైన విద్య, వసతి కల్పించేందుకు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేశారని అన్నారు. డబ్బుకు వెనుకాడకుండా కోట్లాది రూపాయలు ఏకలవ్య స్కూళ్ల కోసం భవనాలు నిర్మిస్తూ, వసతుల కోసం వ్యయం చేస్తున్నారని అన్నారు. ఒక్కో విద్యార్థిపై సగటున లక్షా 9 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు.

స్థానిక సిబ్బంది చిన్నచిన్న సమస్యలను పట్టించుకోకపోతే ఎట్లా అని ప్రిన్సిపాల్, సిబ్బందిని నిలదీశారు. అన్నంలో ప్రతిరోజు రాళ్లు వస్తున్నాయని విద్యార్థులు అంటున్నారని, మన పిల్లలకు అలాగే రాళ్ల అన్నం తినిపిస్తామా అని అన్నారు. బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. టాయిలెట్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చి వదిలేశారని, నీళ్లు రావడమే లేదన్నారు. గేమ్స్ పీరియడ్‌లో పిల్లలను ఆడించడమే లేదని, ఆట వస్తువులు కూడా ఇవ్వడం లేదన్నారు. ఇన్ని సమస్యలుంటే సిబ్బంది ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. తాము కొత్తగా వచ్చామని, సమస్యలన్నీ పరిష్కరిస్తామని సిబ్బంది మంత్రికి సమాధానం చెప్పారు. దీంతో సమస్యలకు కారకులైన పాత సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో అలోచించాలన్నారు. ఇది తొలిసారి కాబట్టి పట్టించుకోవడం లేదని, సమస్యలు పునారావృతమైతే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. విద్యార్థులను పాఠశాలలో ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

పాఠశాలలో టాయిలెట్లకు ఆయన శంకుస్థాపన చేశారు. దేశవ్యాప్తంగా 728 ఏకలవ్య పాఠశాలలు మంజూరు చేయగా 410 స్కూళ్లలో విద్యాబోధన జరుగుతోందని అన్నారు. దేశంలో 1,26,626 మంది విద్యార్థులు ఏకలవ్య స్కూళ్లలో ఉన్నారన్నారు. తెలంగాణలో 23 ఏకలవ్య పాఠశాలలున్నాయని, వాటిలో 8309 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్‌పి అఖిల్ మహజన్, డిఇఓ రమేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News