Tuesday, October 15, 2024

తిరుపతి లడ్డు వివాదం తేలుస్తాం:మంత్రి జోషి

- Advertisement -
- Advertisement -

సుప్రసిద్ధ తిరుపతి లడ్డును అపవిత్రం చేశారన్న ఆరోపణను కేంద్రం తీవ్రమైనదిగా పరిగణిస్తున్నదని, ఈ వివాదాన్ని తేలుస్తామని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం చెప్పారు. కర్నాటక పాల సమాఖ్యకు చెందిన నందిని నెయ్యి వాడకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) నిలిపివేసిన తరువాత ఆ ఆరోపణలు తలెత్తాయని కూడా మంత్రి తెలియజేశారు. ‘పవిత్రమైన తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందనే అత్యంత తీవ్రమైన ఆరోపణను విన్నాం. పూర్వపు (ఆంధ్ర ప్రదేశ్) ప్రభుత్వం నందిని నెయ్యిని వాడుతుండేది. వారు నందిని ఉత్పత్తుల వాడకాన్ని నిలిపివేసిన తరువాత వేర్వేరు వనరుల నుంచి నెయ్యి సేకరించసాగారు. అప్పటి నుంచి ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ల్యాబ్ నివేదికను కూడా విడుదల చేశారు’

అని ప్రభుత్వ పంపిణీ శాఖను కూడా నిర్వహిస్తున్న ప్రహ్లాద్ జోషి హుబ్బళ్లిలో విలేకరులతో చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి దేశంలో ముఖ్యమైన ఒక నేత, పరిపాలన దక్షుడు కూడా. ఆయన అలా అన్నప్పుడు నిజాలు ఉండే ఉండాలి అని జోషి అన్నారు. ‘ఇప్పుడు ల్యాబ్ నివేదిక వెలువడింది, సమగ్ర దర్యాప్తు జరగవలసి ఉంది. తప్పు ఎవరు చేసినా శిక్షకు గురి కావలసిందే. మేము దీనిని తీవ్రంగా పరిగణించి, ఈ కేసు అంతు తేలుస్తాం’ అని కేంద్ర మంత్రి చెప్పారు. ‘ఇది సంస్కృతికి, విశ్వాసానికి సంబంధించిన అంశం. ఇటువంటి నయవంచన మంచిది కాదు’ అని ఆయన అన్నారు. కర్నాటకలోని ఆలయ పాలకవర్గాలు ఎప్పటికప్పుడు ఆలయాల్లో భక్తులకు పంచే ప్రసాదాన్ని కూడా పరీక్షించాలని జోషి కోరారు. ఇది ఇలా ఉండగా, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు విదేశీ క్రైస్తవ మిషనరీల పాత్ర ఉండి ఉండవచ్చునని కర్నాటక మాజీ ఉప ముఖ్యమంత్రి కెఎస్ ఈశ్వరప్ప ఆరోపించారు.

కర్నాటక ఆలయాల్లో నందిని నెయ్యే వాడాలని ఉత్తర్వు
ఇది ఇలా ఉండగా. తిరుపతి ఆలయంలో నెయ్యిలో జంతువుల కొవ్వు వినియోగించారన్న వివాదం నేపథ్యంలో కర్నాటకలో దేవాదాయ శాఖ పరిధిలోని మొత్తం 34 వేల ఆలయాల్లో నందిని బ్రాండ్ నెయ్యిని వాడడం తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేసింది. కర్నాటక ప్రభుత్వ కొత్త ఉత్తర్వు ప్రకారం, ప్రభుత్వ పరిధిలోని అన్ని ఆలయాలూ జ్యోతి ప్రజ్వలనకు, ప్రసాదం తయారీకి, ‘దశోహ భవన్‌లు’ (అన్నదాన కేంద్రాలు)లో కర్నాటక పాల సమాఖ్య (కెఎంఎఫ్) ఉత్పత్తి చేసే నందిని నెయ్యిని మాత్రమే ఉపయోగించవలసి ఉంటుంది. ప్రసాదం నాణ్యతపై ఎన్నడూ రాజీ పడకుండా ఆలయ సిబ్బంది చూడాలని అధికారిక ఉత్తర్వు స్పష్టం చేసింది.

అయోధ్య రామ మందిర్‌లో ప్రసాదంగా తిరుపతి లడ్డులు : ప్రధాన పూజారి
జనవరిలో అయోధ్యలోని రామ మందిరంలో ప్రతిష్ఠాపన ఉత్సవం సమయంలో 300 కిలోల తిరుపతి ఆలయ ప్రసాదం లడ్డులను భక్తులకు పంచినట్లు ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ ధ్రువీకరించారు. తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డుల తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కల్తీ జరిగిందనే వివాదం నేపథ్యంలో ఆచార్య సత్యేంద్ర దాస్ ఈ విషయం తెలియజేశారు. ‘ప్రసాదంలో జంతువుల కొవ్వును కలిపితే అది క్షమార్హం కాదు. అందుకు బాధ్యులపై కఠిన చర్య తీసుకోవాలి’ అని దాస్ అన్నట్లు ‘పిటిఐ’ తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News