Sunday, April 28, 2024

తెలంగాణలో ఎక్కడా లేని విధంగా నర్సంపేటలో రూ. 75 కోట్లతో పైలట్ ప్రాజెక్టు

- Advertisement -
- Advertisement -
  • 50 శాతం సబ్సిడీతో రూ. 37.50 కోట్ల నిధుల విడుదల
  • వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెక్కుల పంపిణీ
  • హాజరైన ఎమ్మెల్యే పెద్ది, ఎంపీ మాలోతు కవిత, కలెక్టర్ ప్రావీణ్య

నర్సంపేట: తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నర్సంపేటలో రూ. 75 కోట్లతో వ్యవసాయ యాంత్రీకరణ పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం నర్సంపేటలో వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ.. ఎన్నో రోజులుగా రైతులకు ఉపయోగపడే ఈ యంత్రాల సబ్సిడీ కోసం జిల్లా అధికారులతో చేసిన కృషి ఫలితమే నేటి యంత్రాల ప్రదర్శన అన్నారు.

51 వేల మంది రైతాంగానికి రూ. 75 కోట్ల సబ్సిడీ అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 161 రకాల గుర్తింపు పొందిన ఫామ్ మెకానైజేషన్ యంత్రాలు ఎంఎన్‌సీ కంపనీలు అందుబాటులోకి వచ్చాయన్నారు. నియోజకవర్గానికి వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు ఏదో ఒకటి చేయాలనే తలంపుతో వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి చేసిన పైలట్ ప్రాజెక్టు వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్ల, యంత్రాల సబ్సిడీ పథకం. ప్రతిపక్షాలది మొద్దు నిద్ర, వారి పాత్ర మనమే పోషిస్తున్నామన్నారు. ఎందుకంటే వారికి అవకాశం లేదన్నారు.

దుగ్గొండి మండలంలో వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటల పరిశీలనకు 100 డిగ్రీల జ్వరంతో వచ్చి వగడళ్లతో అక్కడి పంట చేనులో పీవీసీ పైపుకు ఉన్న రంధ్రాలను పరిశీలించిన సీఎం పరిస్థితి అర్థం చేసుకొని ఎకరాకు రూ. 10 వేల నష్టపరిహారం ప్రకటించడం జరిగింది. ఒక్క రైతుకు రూ. 50 వేల సబ్సిడీ మాత్రమే వర్తిస్తుంది. ఆసక్తి కల్గిన రైతులు సెప్టెంబరు 15 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. 39,500 మంది రైతులకు నష్టపరిహారం చెక్కులు పంపిణీ చేస్తున్నాం. నెల రోజుల్లో రైతులకు చెక్కులు అందేవిధంగా వ్యవసాయ శాఖాధికారులు చర్యలు తీసుకోవాలి.

నియోజకవర్గంలోని అన్ని రైతు వేదికల వద్ద నష్టపోయిన ప్రతీ రైతుకు నేను స్వయంగా వెళ్లి చెక్కులు అందచేస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. రైతులకు ఉపయోగపడే యంత్ర పరికరాల ఎగ్జిబీషన్ ఏర్పాటుచేయడం అభినందనీయం. నర్సంపేట నియోజకవర్గంలో మోడల్ వ్యవసాయం చేసేందుకు రైతులకు ఉపయోగపడే విధంగా స్టాల్స్‌ను ఏర్పాటుచేయించిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు. గత మార్చి నెలలో జరిగిన పంట నష్టపరిహారం రూ. 35 కోట్లు రైతులకు అందచేస్తున్నాం. ముందుగా చిన్నకారు రైతులకు యంత్రాలకు సబ్సిడీ అందచేసి, భారీ యంత్రాలకు గ్రూపుల వారీగా అందచేస్తామన్నారు.

మహబూబూబాద్ ఎంపీ మాలోతు కవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా పథకాలు తీసుకొచ్చే ఎమ్మెల్యే నర్సంపేట ప్రజలకు దొరకడం అదృష్టమన్నారు. రూ. 75 కోట్ల సబ్సిడీ పథకం కోసం సీఎం కేసీఆర్ వద్ద ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి రాజకీయ చతురత చూపించారు. మంత్రుల నియోజకవర్గాల్లో రాని పథకాలు మీ నర్సంపేట నియోజకవర్గానికి వస్తున్నాయి. జిల్లాలోనే అత్యధికంగా నర్సంపేటకు నష్టపోయిన రైతులకు పరిహారం అందించిన ఘనత ఒక్క ఎమ్మెల్యే పెద్దిదే అన్నారు. రైతులకు, నర్సంపేట ప్రజలకు ఎప్పుడూ ఏదో చేయాలనే తపన ఉన్న పెద్ది సుదర్శన్‌రెడ్డి అభినందనీయుడు.

ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఓడీసీఎంఎస్ ఛైర్మన్ గుగులోతు రామస్వామినాయక్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వ్యవసాయ శాఖ జేడీ, ఏడీ, ఏఓలు, ఏఈఓలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పీఏసీఎస్ ఛైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News