దేవభూమిగా పేరు పొందిన ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాలు వైపరీత్య వలయాలుగా మారడం శోచనీయం. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఆకస్మిక వరదల ప్రళయం జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. ఉత్తరాఖండ్‌లో మెరుపు వరదలు, క్లౌడ్ బరస్ట్‌ల విపత్తుతో కేరళకు చెందిన 28 మంది పర్యాటకుల బృందం గల్లంతైంది. వీరిలో 20 మంది మహారాష్ట్రలో స్థిరపడిన వారు కాగా, మిగిలిన 8 మంది కేరళలోని వివిధ జిల్లాలకు చెందిన వారుగా గుర్తించారు. ఉత్తరాఖండ్‌లో నాలుగు జాతీయ రహదారులతో సహా 617 రోడ్లు ధ్వంసమయ్యాయి. 130 మందికి పైగా ప్రజలను సహాయక బృందాలు రక్షించాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. ధరాలీ గ్రామమే వరదలకు కొట్టుకుపోయింది. మరో గ్రామం సుకీ జలమయమైంది.
హిమాచల్‌లో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా కిన్నౌర్ జిల్లాలో భారీ వరదలు సంభవించడంతో కైలాస్ యాత్ర ట్రెక్కింగ్ మార్గంలో వందలాది మంది యాత్రికులు వరదల్లో (Pilgrims floods) చిక్కుకున్నారు. ఐటిబిపి సిబ్బంది స్పందించి 413 మంది యాత్రికులను కాపాడగలిగింది. ఈ విధంగా ఏటా ఈశాన్య భారతంలో జలప్రళయం సంభవించడం, కొండచరియలు విరిగిపడడం, గ్రామాలు నేలమట్టం కావడం తరచుగా జరుగుతోంది. పర్యాటక ప్రాంతాలకు ప్రసిద్ధి చెందిన ఈశాన్య భారతంలో టూరిజం అభివృద్ధి చెంది ఆదాయం బాగా వస్తున్నా పొంచి ఉన్న విపత్తుల నివారణ ప్రణాళికలపై ఆయా ప్రభుత్వాలు శ్రద్ధ చూపించడం లేదు. మూడేళ్ల క్రితం భారీ వర్షాలకు ఈశాన్య రాష్ట్రాల్లో 125 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయే సరికి పాలనా యంత్రాంగాలు కళ్లు తెరిచి లబోదిబోమనడం తప్ప ఈ వైపరీత్యాలను ఎలా నివారించగలమో అన్న ప్రయత్నాలు సరిగ్గా జరగడం లేదు.
2013 లో కేదార్‌నాథ్ విషాద సంఘటన నుంచి దేశం సరైన గుణపాఠం నేర్చుకోవడం లేదనిపిస్తోంది. ఆనాడు వేలాది గ్రామాలు వరదల్లో దెబ్బతిన్నాయి. 5000 మంది గల్లంతయ్యారు. క్రమబద్ధం లేకుండా సాగే రియల్ ఎస్టేట్ నిర్మాణాలు విధ్వంసాన్ని మరింత తీవ్రం చేశాయి. 2021లో హిమనదీయ సరస్సు విస్ఫోటనంతో వరద ప్రళయం సంభవించి చమోలీ ప్రాంతాన్ని నాశనం చేసింది. అలాగే జోషిమఠ్ విధ్వంసం ప్రళయం సృష్టించింది. టూరిస్టులను ఆకర్షించడానికి నదీ తీర ప్రాంతాల్లో విలాసవంతమైన విల్లాల నిర్మాణం యథేచ్ఛగా సాగుతోంది. ప్రకృతిపరంగా కొన్ని వైపరీత్యాలు జరుగుతుండగా, మానవ కల్పిత చర్యల వల్ల అంతకన్నా ఎక్కువగానే నష్టం జరుగుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు మౌలిక సదుపాయాల అభివృద్ధి జరగకపోవడం ప్రధాన లోపం.
సౌకర్యాల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య నెలకొన్న సంక్లిష్టతపై చర్చలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో శాస్త్రీయ విశ్లేషణ అనుసరించి నిర్మాణాలు చేపట్టడం అవసరం. హిమాలయ పర్వత ప్రాంతాల్లో ప్రాజెక్టుల నిర్మాణాలతో అత్యధిక సంఖ్యలో చెట్లను కూల్చి వేస్తున్నారు. 2015 నుంచి 2018 మధ్య కాలంలో 10.76 మిలియన్ చెట్లను కూల్చివేశారు. అరుణాచల్‌లోని భారీ డిబాంగ్ డ్యామ్ నిర్మాణం కోసం 2.7 లక్షల చెట్లను కూల్చివేశారు. డెహ్రాడూన్‌లో ప్రాజెక్టుల కోసం 11,000 చెట్లను కూల్చివేయడానికి ప్రభుత్వ వర్గాలు సిద్ధం కాగా, సుప్రీం కోర్టు అడ్డుచక్రం వేసింది. కొండలను తొలిచి సొరంగాలు నిర్మిస్తున్నారు. రోడ్లు, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాలు ఒక ప్రణాళిక లేకుండా సాగే కొండ క్వారీ పనులు ఇవన్నీ కొండచరియలు విరిగిపడడానికి కారణమవుతున్నాయని జిఎస్‌ఐ అధ్యయనం పేర్కొంది.
గత ఏడాది నైరుతి పవనాల ప్రభావంతో సిక్కిం, అసోం, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర, మిజోరాం, నాగాలాండ్, మేఘాలయాల్లో కుంభవృష్టి సంభవించి ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడ్డాయి. వేలాది మంది నిర్వాసితులయ్యారు. 34 మంది ప్రాణాలు కోల్పోయారు. అసోంలోని 19 జిల్లాల్లో మూడు లక్షల మంది వరకు వరద బాధితులయ్యారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల నివారణకు బడ్జెట్‌లో మూడోవంతు వెచ్చిస్తోంది. అయినా సరైన ప్రణాళికలు ఆచరణలోకి రావడం లేదు. హిమాలయ పర్వత ప్రాంతాల్లో నేల క్షీణించి కోతకు గురికావడం. జోషిమఠ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో విపరీత పరిణామాలు సంభవించడం చర్చనీయాంశం అవుతున్నాయి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్‌ఐ) ఈ కొండచరియల ప్రమాదాలపై 2020లో అధ్యయనం నిర్వహించింది.
దేశంలోని 16 రాష్ట్రాలు, హిమాలయ రీజియన్‌లోని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు, ఈశాన్యంలోని హిమాలయ పర్వత దిగువ భాగాలు, పశ్చిమ కనుమలు ఇవన్నీ కొండచరియలు అకస్మాత్తుగా విరిగిపడడానికి కారణమవుతున్నాయని జిఎస్‌ఐ తన నివేదికలో హెచ్చరించింది. అలాగే కొండచరియలు విరిగిపడడానికి ఉత్తరాఖండ్ 51 శాతం అనువైన ప్రాంతంగా వాడియా ఇన్‌స్టిట్యూట్ అధ్యయనంలో తేలింది. ప్రపంచంలోనే భూకంపాలు సంభవించే ఆరో ప్రాంతంగా ఈశాన్య ప్రాంతం రికార్డుకెక్కింది. ఈ ప్రాంతాల్లో ఆరు నెలలపాటు భారీగా వర్షాలు కురుస్తుంటాయి. కొండచరియల ముప్పు తప్పించడానికి నిర్మాణాత్మక ఇంజినీరింగ్ పనులు చేపట్టడం అవసరమని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సూచిస్తోంది. కొండచరియలు విరిగిపడే ప్రాంతాలను గుర్తించి వాటిని నివారించడానికి, తగిన మౌలిక సౌకర్యాలు కల్పించడానికి ‘నేషనల్ ల్యాండ్ స్లైడ్ ససెప్టిబిలిటీ మేపింగ్’ ప్రక్రియను అమలు చేయవలసి ఉంటుందని జిఎస్‌ఐ సూచిస్తోంది.