Thursday, May 2, 2024

ఉత్తరాఖండ్‌లో దావానలం.. నలుగురు బలి… జంతువులు ఆహుతి

- Advertisement -
- Advertisement -

Uttarakhand Fire: 4 persons, 7 animals dead

 

ఈ ఏడాది 1290 హెక్టార్ల అడవులు బుగ్గి
సిఎం తీరథ్ సమీక్ష…కేంద్రసాయానికి అభ్యర్థన
దెబ్బతింటున్న ప్రకృతి సమతుల్యతతో ముప్పు

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో కార్చిచ్చులు విలయం రేపాయి. గడిచిన 24 గంటలలో 62 హెక్టార్ల అటవీ ప్రాంతంలో కార్చిచ్చు విస్తరించింది. ఈ ఘటనలో కనీసం నలుగురు మంటలకు ప్రాణాలొదిలారు. ఏడు మూగజీవాలు అసువులు బాశాయి. ఇటీవలి కాలంలో ఈ వేసవిలో ఉత్తరాఖండ్‌లో కార్చిచ్చులు వ్యాప్తి చెందుతూ రావడం నష్టం కల్గిస్తోంది. ప్రస్తుత పరిస్థితిపై రాష్ట్ర ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ ఆదివారం అత్యవసర ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితి గురించి, తీసుకోవల్సిన చర్యల గురించి సమీక్షించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తాము కేంద్రసాయం కోరినట్లు ముఖ్యమంత్రి ఆ తరువాత విలేకరులకు తెలిపారు.

రెండు ఛోపర్లను పంపించాలని కోరామని, ఇవి ఇప్పుడే అందుబాటులోకి వచ్చాయని, వీటి ద్వారా తొందరగా మంటలను ఆర్పివేయడానికి వీలవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకూ కార్చిచ్చుతో రూ 37 లక్షల మేర ఆస్తినష్టం జరిగిందని రాష్ట్ర ముఖ్య అటవీ శాఖాధికారి మన్‌సింగ్ తెలిపారు. మంటలను ఆర్పేందుకు 12000 మంది గార్డులను, ఫైర్ వాచర్స్‌ను అటవీశాఖ నుంచి తరలించినట్లు వివరించారు. 24 గంటల వ్యవధిలో 40 చోట్ల మంటలు చెలరేగాయి. నైనిటాల్, అల్మోరా, తెహ్రీ గర్హ్‌వాల్, పౌరిగర్హ్‌వాల్ వంటి ప్రాంతాలలో అడవులు తగులబడ్డాయి. మంటలను ఆర్పేందుకు 1300 మంది అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగిందని ముఖ్యమంత్రి వివరించారు.

పరిస్థితిపై హోం మంత్రి ఆరా

ఉత్తరాఖండ్‌లో పరిస్థితి గురించి కేంద్ర హోం మంత్రి ఆరాతీశారు. ముఖ్యమంత్రి రావత్‌తో ఫోన్‌లో వెంటనే మాట్లాడారు. జాతీయ విపత్తు నిర్వహణ దళాలను రంగంలోకి దింపేందుకు కేంద్రం ఆదేశాలు ఇచ్చిందని, అవసరమైనట్లుగా హెలికాప్టర్లను రాష్ట్ర ప్రభుత్వానికి అందించేందుకు ఏర్పాట్లు చేశామని అమిత్ షా తెలిపారు. గడిచిన ఏడాది ఉత్తరాఖండ్‌లో మొత్తం మీద 172 హెక్టార్ల అటవీ ప్రాంతం తగులబడింది. ఈసారి ఈ ఏడాది ఇప్పటికే మొత్తం 1290 హెక్టార్ల అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగడం అసాధారణ పరిణామం అయింది. అత్యధిక ఉష్ణోగ్రతల దశలో అడవులలో మంటలు చెలరేగుతుంటాయి. ఎప్రిల్ నెలారంభం నాటికే తీవ్రస్థాయిలో కార్చిచ్చులు కమ్ముకోవడంతో రాబోయే రోజులలో పరిస్థితి ఏమిటనే భయాందోళనలు నెలకొన్నాయి. ఈసారి చలికాలంలోనే పలు జిల్లాల్లో అడవులలో మంటలు వ్యాపించాయి. ప్రత్యేకించి కొండ ప్రాంతపు జిల్లాలైన నైనిటాల్, అల్మోరా, తెహ్రీ, పౌరీలలో ఈ పరిణామం నెలకొంది.

అటవీ నాశనంతో వైపరీత్యాలు

పలు చోట్ల అడవులు తగులబడిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం తగు విధంగా వ్యవహరించడం లేదని పర్యావరణ నిపుణులు, ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. మంటలను అప్పటికప్పుడు చల్లార్చడం కాకుండా , శాశ్వత నివారణ చర్యలు చేపట్టాల్సి ఉందని ప్రముఖ సామాజికవేత్త అనూప్ నౌటియాల్ సూచించారు. రాష్ట్రంలో కార్చిచ్చుల ఘటనలపై అనూప్ ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. రాష్ట్రానికి ఇటువంటి పరిణామాలు పెను ఉపద్రవం తెచ్చిపెడుతాయని హెచ్చరించారు. ప్రభుత్వం మంటలను అదుపులో పెట్టడంలో విఫలం అయిందని రాష్ట్ర పిసిసి అధ్యక్షులు ప్రీతం సింగ్ మండిపడ్డారు. రాష్ట్రానికి అటవీ ప్రాంతం అపురూపమైనది. విలువైనది. దీని పరిరక్షణకు ఏం చేస్తున్నారు? రాష్ట్ర అటవీ మంత్రికి సంబంధిత విషయాలపై ఎటువంటి అవగావహనా లేదని విమర్శించారు. ఉత్తరాఖండ్‌లో వరదలతో జలవిలయం సంభవించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. వరదల నివారణకు అడ్డుకట్ట వంటి అటవీ రక్షకవలయం దెబ్బతినడం వల్ల ఆ తరువాతి దశలో జీవ వైవిధ్య క్రమంలో తలెత్తే వైపరీత్యాలతో భవిష్యత్తులో పెను ముప్పు వాటిల్లుతుందని పర్యావరణ, అటవీ సంబంధిత నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News