Wednesday, August 6, 2025

దేవాభూమిపై జలఖడ్గం

- Advertisement -
- Advertisement -

గ్రామాలను ముంచెత్తిన రాకాసి వరద 
కనీసం ఐదుగురు మృతి, 50 మందికి పైగా గల్లంతు
సైనిక శిబిరంలో 10 మంది గల్లంతు
కొండచరియలు విరిగిపడి పలువురి మృతి
కొట్టుకుపోయిన హోటళ్లు, రెస్టారెంట్లు, వాహనాలు 
జనం హాహాకారాలు.. పరుగులు పెట్టినా దక్కని ప్రాణాలు 
ఇళ్లలో బురదలో చిక్కుకుపోయిన జనం, రంగంలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు
‘ధరాలి’లో దయనీయ పరిస్థితి

ఉత్తరకాశీ (ఉత్తరాఖండ్): ప్రకృతి ప్రకోపానికి ఉత్తరాఖండ్ గజగజ వణికింది. సెకెన్ల వ్యవధిలో గ్రామాలనే కబళించింది. ఉత్తరకాశీలోని ధరాలి, సుఖీ అనే గ్రామాలు జలప్రళయానికి చిగురుటాకులా వణికాయి. వీటికి నాలుగు కిలో మీటర్ల దూరంలోని సైనిక శిబిరం కూడా పూర్తిగా కొట్టుకుపోయింది. భారీ వర్షం కారణంగా మెరుపు వరద ధరాలి గ్రామాన్ని సగం తుడిచిపెట్టేసిసిం ది. కళ్లముందే ఇళ్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రాణాలు రక్షించుకునేందుకు పరుగెత్తుతు న్న వారిని వరద రాకాసిలా ముంచెత్తింది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు ఐదుగురు మృత్యువాత పడ్డారు. సుమారు 50 మందికిపైగా గల్లంతయ్యారు. పదుల సంఖ్యలో బురదలో కూరుకుపోయారు. ఆవావాసాలు, హోటళ్లను బురద ముంచెత్తింది. 20 నుంచి 25 హోటళ్లు కొట్టుకుపోయాయని ప్రత్యక్ష సాక్షలు చెబుతున్నారు. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వాటి కింద పదుల సంఖ్యలో తలదాచుకున్నవారు కూడా ప్రాణాలతో బయటపడే అవకాశాలు లేవని చెబుతున్నారు. తద్వారా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

ఒక్క ఆర్మీ క్యాంప్‌లోనే 10 మంది సైనికులు గల్లంతయ్యారు. ధరాలి గ్రామం వైపు కొండపై నుంచి పెద్దఎత్తున బలమైన నీటి ప్రవాహం ఉదృతంగా వచ్చి ముంచెత్తడంతో భారీ విధ్వంసం జరిగింది. ఖీర్ గంగా నది పరీవాహక ప్రాంతంలో మేఘావృతం తర్వాత ఇళ్లను భారీ నీటి ప్రవాహం ముంచెత్తింది. నివాసితులు భయంతో కేకలు పెడుతూ పరుగులు తీసే ప్రయత్నం చేశారు. బురదలో నుంచి చాలా మంది బయటకు రావడానికి ప్రయత్నించిన దృశ్యాలు, పలువురు ఇబ్బందులు పడిన దృశ్యాలు కలవరపెడుతున్నాయి. గంగోత్రికి వెళ్లే దారిలో ధరాలి గ్రామం అత్యంత కీలకమైనది. మార్గమధ్యలో ఉన్న ఈ గ్రామంలోనే హోటళ్లు, రెస్టారెంట్లు, టూరిస్టుల కోసం అద్దె నివాసాలు అధికంగా ఉంటాయి.

సహాయక చర్యలు ముమ్మరం..
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను సహాయక చర్చలు ప్రారంభించేందుకు హుటాహుటిన ఆ ప్రాంతానికి తరలించారు. శిథిలాలలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు బృందాలు కృషి చేస్తున్నాయి. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ, సీఎంతో మాట్లాడి ప్రజలకు సహాయం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఉత్తరకాశీ జిల్లా యంత్రాంగం, సైన్యం, ఎన్ డిఆర్ ఎఫ్, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, బాధితుల తరలింపులో మగ్నమై ఉన్నాయని ముఖ్యమంత్రి ధామి తెలిపారు.

పాలనా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉందని, బాధితులకు అన్ని విధాలా సహాయం అందించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. రుతుపవనాల ప్రభావంతో ఉత్తరాఖండ్ లో కొద్దిరోజులుగా భారీవర్షాలు కురుస్తున్నాయి. హరిద్వార్ లోని గంగా నదితో సహా ప్రధాన నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. రుద్రప్రయాగ్ లో కొండ చరియలు విరిగి పడి రెండు దుకాణాలు నేలమట్టమయ్యాయి. ఇద్దరు చనిపోయారు. ప్రజలంతా నదులకు దూరంగా సురక్షితంగా ఉండాలని, పశువులను కూడా సురక్షితంగా ఉంచుకోవాలని ప్రజలకు ముఖ్యమంత్రి సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News