Sunday, April 28, 2024

బిజెపి నేతల ఇళ్లకు కరెంట్ కట్ చేస్తాం

- Advertisement -
- Advertisement -

ఈ బిల్లును పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెడితే
బిజెపి నాయకులు, ఎంపిలకు, కేంద్ర మంత్రులకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తాం
బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడితే నిరవధిక సమ్మెకు దిగుతాం
మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణలో విద్యుత్ ఉద్యోగుల నాయకుల హెచ్చరిక

మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న విద్యుత్ చట్టసవరణ బిల్లుకు నిరసనగా నేడు మహాధర్నా నిర్వహించనున్నట్టు విద్యుత్ శాఖ సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఒకవేళ ఈ బిల్లును పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెడితే బిజెపి నాయకులు, ఎంపిలకు, కేంద్ర మంత్రులకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని వారు హెచ్చరించారు. ఈ సందర్భంగా మహాధర్నా పోస్టర్‌ను పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్, విద్యుత్ జాక్ ప్రతినిధులు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, నేషనల్ కో ఆర్డినేషన్ కమిటీ మెంబర్ రత్నాకర్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 8వ తేదీన పార్లమెంట్‌లో విద్యుత్ చట్టసవరణ బిల్లును ప్రవేశపెట్టాలని చూస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందులో భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు విధులు బహిష్కరిస్తారని, వినియోగదారులు తమకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలు కూడా తమకు మద్ధతు ఇవ్వాలని, ఈ చట్టంతో వినియోగదారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ విద్యుత్ సరఫరాలో అంతరాయం వస్తే పునరుద్ధరణ పనులు చేయకుండా నిరసన తెలుపుతామని ఆయన సూచించారు.

వినియోగదారుల నుంచి అధిక చార్జీలు…

ఈ విద్యుత్ బిల్లును సభలో ప్రవేశపెడితే తమ విధులు బహిష్కరించి నిరవధికంగా సమ్మెకు దిగుతామని ఆయన హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ బిల్లుతో అనేక సమస్యలు వస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖను ప్రైవేటీకరణ చేసేందుకే ఈ బిల్లును కేంద్రం తీసుకొచ్చిందన్న విషయం స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. గతంలో ఉన్న విద్యుత్ లైన్‌ల నుంచే ప్రైవేట్ సంస్థలకు రూపాయి ఖర్చు లేకుండా కరెంట్ సరఫరా చేసేలా ఈ బిల్లు ఉందని ఆయన ఆరోపించారు. ఈ చట్టం అమల్లోకి వస్తే వినియోగదారుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తారని, ఇది విద్యుత్ వినియోదారులకు భారం అవుతుందని ఆయన పేర్కొన్నారు. డిస్కం లను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం దీనిని అమలు చేయాలని భావిస్తోందన్నారు. దీనివల్ల రానున్న రోజుల్లో వినియోగదారులు, డిస్కం లు పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయ్యే అవకాశం ఉందన్నారు.

పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు విద్యుత్ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు ఈ బిల్లును ప్రవేశ పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ 12 రాష్ట్రాల ప్రభుత్వాలు తీర్మానం చేశాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వం కూడా దీనికి వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంకు పంపించిందని, ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఒకవేళ బిల్లు పెడితే టిఆర్‌ఎస్ వ్యతిరేకిస్తూ పార్లమెంట్‌లో నిరసన వ్యక్తం చేయాలని ఆయన సూచించారు. బిల్లు ప్రవేశపెడితే తమ నిరసనలు తీవ్రతరం చేస్తామని, బిజెపి నాయకులను, ఎంపిలను, కేంద్ర మంత్రులను ఎక్కడిక్కడ నిలదీస్తామని ఆయన హెచ్చిరించారు. ఇప్పటికైనా దీనిపై బిజెపి ఎంపిలు ఆలోచన చేయాలని, ప్రజలకు మేలు చేసేలా కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆదివారం అర్ధరాత్రి నుంచి విధులు బహిష్కరించాలి: శివాజీ
ఈ బిల్లుకు వ్యతిరేకంగా టీజాక్ ఆధ్వర్యంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి విద్యుత్ ఉద్యోగులు విధులు బహిష్కరించాలని టీజాక్ చైర్మన్ కోడూరి ప్రకాశ్, కన్వీనర్ శివాజీలు పిలుపునిచ్చారు. అయితే (ఎమర్జెన్సీ సర్వీసులో ఉన్న ఉద్యోగులు, సబ్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు తమ విధులు నిర్వహించాలని) వారు విజ్ఞప్తి చేశారు. సోమవారం జనరేటింగ్ స్టేషన్‌ల ముందు, కంపెనీ కార్యాలయాల ఎదుట, సర్కిల్ కార్యాలయాల ఎదుట, డివిజన్ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగులు నిరసనలు తెలియచేయాలని వారు సూచించారు. నేడు మధ్యాహ్నం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో వివిధ రాజకీయ పక్ష నాయకులతో టీజాక్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశామని, ఈ బిల్లు గురించి చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని వారు పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News