Sunday, April 28, 2024

పోక్సో చట్టం సాధించిందేమిటి?

- Advertisement -
- Advertisement -

మైనర్ బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు కఠినమైన శిక్షల విస్తృత చట్టం కావాలని 2012 లో పోక్సో రూపకల్పన జరిగింది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ అనేది పోక్సో పూర్తి పేరు. 18 ఏళ్లలోపు వయసున్న ఆడ లేదా మగవారిపై మగ లేదా ఆడవారు లైంగిక వేధింపు, దాడులకు పాల్పడినప్పుడు ఈ చట్టం లింగ భేదం లేకుండా విచారించి శిక్షిస్తుంది. పిల్లలను నగ్న, బూతు చిత్రాల్లో వాడినా, వ్యభిచార గృహాలకు తరలించినా ఇది వర్తిస్తుంది. దీని కోసం దేశ వ్యాప్తంగా ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులున్నాయి. లైంగిక వేధింపులకు 3 నుండి 5 ఏళ్ల శిక్షపడొచ్చు. లైంగిక అత్యాచారానికి ఏడేళ్ల నుంచి జీవిత ఖైదు ఉంటుంది.

బాధిత బాలిక లేదా బాలుడి వాంగ్మూలాన్ని పిల్లలకు అనుకూలమైన స్థలంలో రికార్డ్ చేస్తారు. ఆడ పిలల్ల విషయంలో ఆడ పోలీసు సాధారణ దుస్తుల్లో వారి ఇంటికైనా వచ్చి మాటల్లో దింపి విషయాన్నీ రాబట్టుకుంటారు. వేధింపు విషయంలో చేతులెక్కడ వేశారు అనేది జాగ్రత్తగా పరిశీలించవలసిన విషయం. తల్లి సమక్షంలో ఆడ డాక్టర్ ద్వారా వైద్య పరీక్ష ఉంటుంది. విచారించే కోర్టు రూమ్ కూడా నిజమైన కోర్టులా కాకుండా పిల్లల ఆట వస్తువులతో, బొమ్మలతో అలంకరించి ఉంటుంది. బాధితుల ఆర్థిక అవసరాల నిమిత్తం తక్షణ పరిహారంగా కొంత సొమ్ము ప్రభుత్వం నుండి లభిస్తుంది. నిందితుడికి మూడేళ్లపై శిక్షపడే అవకాశముంటే బెయిల్ దొరకదు. ఈ చట్టంలో ఉన్న శిక్షను తగ్గించే అధికారం న్యాయమూర్తికి ఉండదు. కేసు తీవ్రతను బట్టి నేరస్థుడికి మరణశిక్ష కూడా వేసేలా ఈ చట్టం 2019లో సవరించబడింది.

ఇంత పకడ్బందీగా రూపొందించిన చట్టం పదేళ్ల కాలం లో సాధించిందేమిటి అనే చర్చలో చాలా నివేదికలు వచ్చాయి. ప్రపంచ బ్యాంకు సహకారంతో ఢిల్లీకి చెందిన ‘విధి’ అనే న్యాయ విధానాల వేదిక 2023లో దేశంలోని 486 పోక్సో కోర్టుల పని తీరుపై ఒక రిపోర్టును విడుదల చేసింది. ఈ నివేదిక కోసం ఆ సంస్థ దేశంలోని సుమారు 4 లక్షల కేసుల్లో సగం కేసులను క్షుణ్ణంగా పరిశీలించింది.

ప్రపంచంలోనూ అత్యధికంగా 44 కోట్ల బాలబాలికలున్న మన దేశంలో ఈ చట్టానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే ఈ రిపోర్టు ప్రకారం ప్రతి నలుగురు పోక్సో ముద్దాయిల్లో ఒకరికి శిక్షపడగా ముగ్గురు నిర్దోషులుగా విడుదల అవుతున్నారు.సాక్ష్యాల సేకరణ, వాటిని రుజువు చేయడంలో సమయాభావం వల్ల కేసులు నిలవడం లేదు. సకాలంలో రక్తం, ఇంద్రియం మరకలను ఫోరెన్సిక్ సిబ్బందికి అందజేయడం అతి ముఖ్యం. అయితే తమ పిల్లలపై జరిగిన లైంగిక అత్యాచారాన్ని పోలీసులకు చెప్పాలా వద్దా అనే పెద్దల సందిగ్ధతలోనే అసలు సాక్ష్యాలు కనుమరుగవుతున్నాయి. కొన్ని కేసుల్లో నిందితులుగా దగ్గరి బంధువులు, కుటుంబ సభ్యులే ఉండడం దీనికి మరో కారణం. నిందితుల్లో 96% మంది బాధితులకు తెలిసినవారే కావడం అత్యంత విషాదకరం. ఏడాదిలోగా విచారించి తీర్పు వెలువరించవలసిన చోట కేవలం 45% కేసులు మాత్రమే నియమిత కాలంలో పూర్తవుతున్నాయి. 12% కేసులకు మూడేళ్లపై కాలం పడుతోంది. ఇది పూర్తిగా ఆక్షేపణీయం. ఇప్పటికీ దేశంలోని అన్ని జిల్లాల్లో ఈ స్పెషల్ కోర్టులు ఆరంభించలేదు. ఉన్న ప్రతి చోట ప్రభుత్వ ప్లీడర్ నియామకాలు జరగలేదు.

పోక్సో కేసుల నమోదులో ఢిల్లీ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువ కేసులు పెండింగ్ ఉండగా, తమిళనాడులో 82% కేసులకు సత్వర తీర్పు అందుతోంది. ఇది లింగ భేదంతో సంబంధంలేని చట్టం. మైనర్ బాలుడిపై స్త్రీ లైంగిక వేధింపుకు పాల్పడినా అది పోక్సో చట్టరీత్యా నేరమే.అయితే ఈ చట్టం కింద నమోదవుతున్న వేయి కేసుల్లో కేవలం ఎనిమిదింటిలో మాత్రమే మగవాళ్ళు బాధితులు. అంటే నూటికి 92 కేసుల్లో మైనర్ బాలికలే బాధితులుగా ఉన్నారు. చాలా పోలీస్ స్టేషన్లలో మహిళా సిబ్బంది లేకపోవడం వల్ల బాధిత బాలిక వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడం ఆలస్యమవుతోంది. వాంగ్మూలాన్ని మార్చే అవకాశం లేకుండా దృశ్య శ్రవణ మాధ్యమాల్లో దానిని నిలిపి ఉంచాలి. అయితే చాలా స్టేషన్లలో ఈ వసతి లేదు. పరీక్ష కోసం యోనిలోకి రెండు వేళ్ళు చొప్పించే పద్ధతిని సుప్రీం కోర్టు ఇటీవల నిషేధించినా ఫోరెన్సిక్ ల్యాబ్‌ల్లో ఆధునిక వ్యవస్థ లేనందున పాత పద్ధతినే పాటిస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేశాక రెండు నెలల్లో ప్రాథమిక సమాచారం సేకరించి ఛార్జ్‌షీట్ ఫైల్ చేయాలి. అది ఆలస్యమై 90 రోజులు దాటితే నిందితుడికి బెయిల్ లభించే వీలుంది.

పోక్సో చట్టంలో బాధిత బాలబాలికలపై వయసు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోక్సో చట్టంలో వయసు పరిధిని 18 నుండి 16 ఏళ్లకు తగ్గించాలని న్యాయ నిపుణులు కోరుతున్నారు. మన దేశంలో ఆడపిల్లల పెళ్ళికి 18 ఏళ్లను నిర్ణయించినందున అదే వయసును పోక్సోలో తీసుకున్నారు. అయితే మైనారిటీ తీరని ఆడ పిల్లలు తమ ఇష్టంతో పైవయసు మగాడితో లైంగిక సంపర్కం పొందితే ఆ నేరం మగాడిపై పడుతుంది. 18 ఏళ్లకు ఒక్క రోజు తక్కువున్నా ఆ పిల్ల అంగీకారం చట్టపరంగా చెల్లదు. ఆమె ఇష్టంగా పురుషుడితో రతిలో పాల్గొన్నా ఆ పురుషుడు ఆ క్షణమే పోక్సో బాధితుడైపోతాడు.

మైనర్ బాలికలు లైంగిక సంబంధం కొనసాగిస్తూ ఒక్కోసారి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, సాక్ష్యాలతో పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరిస్తున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ సందర్భాలు తెలిసి కూడా కోర్టులు పోక్సో కింద శిక్ష వేయక తప్పడం లేదని బొంబాయి కోర్టు అభిప్రాయపడింది. పోక్సో చట్టంలో వయసు పరిధి విషయంలో పార్లమెంట్ పునరాలోచించాలని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి కూడా ఓ ప్రసంగంలో పేర్కొన్నారు. 16 ఏళ్ళ పై వయసు పిల్లలు ప్రేమలో పడి లైంగికంగా ఒక్కటవుతున్నారని, వారిపై తెలిసి పోక్సో చట్టం అమలు చేయడం న్యాయబద్ధం కాదని కర్నాటక కోర్టు ధార్వాడ్ బెంచ్ అభిప్రాయపడింది. జర్మనీ, ఇటలీ, హాలెండ్ దేశాల్లో ఈ వయసు 14 ఏళ్లే ఉంది. ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంకల్లో 16, జపాన్‌లో 13 ఏళ్లను పోక్సో లాంటి చట్టాల్లో పరిగణనలోకి తీసుకుంటున్నాయి. అయితే సెప్టెంబర్ 2023లో 22వ లా కమిషన్ ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ, వయసు తగ్గిస్తే చట్టం పలుచబడిపోతుందని అభిప్రాయపడింది. ఏది ఎలా ఉన్నా మైనర్ పిల్లలపై లైంగిక నేరం తీవ్రమైనది, సున్నితమైనది కూడా. ఈ సందర్భంగా పోక్సో చట్ట సవరణ, సత్వర విచారణ, నిష్పాక్షిక న్యాయం చర్చనీయ అంశాలు.

బి.నర్సన్
9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News