Wednesday, May 1, 2024

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కసాయి చేతిలో పెడదామా?

- Advertisement -
- Advertisement -

తొమ్మిదిన్నరేండ్లలో రాష్ట్రం బాగుపడింది అసాధారణ విజయం సాధించాం
సుస్థిర ప్రభుత్వం… సమర్థ నాయకత్వం వల్లనే అభివృద్ధి సాధ్యమైంది
బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ఆర్థిక ఛోదక శక్తి హైదరాబాద్ అని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు అన్నారు. రాష్ట్ర జిడిపిలో 45 నుంచి 50 శాతం ఇక్కడి నుంచే వస్తున్నదని చెప్పారు. హైదరాబాద్‌ను నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రం కుంటుపడుతుందని వ్యాఖ్యానించారు. స్థిరమైన ప్రభుత్వం, దృఢమైన నాయకత్వంతోనే అభివృద్ధి సాధ్యమని మంత్రి అభిప్రాయపడ్డారు. తాజ్ డెక్కన్‌లో జరిగిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సమావేశంలో మంత్రి కెటిఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ వస్తే భూముల రేట్లు పడిపోతాయని ఆనాడు ప్రచారం చేశారని, కానీ హైదరాబాద్‌లో రేట్లు 10 నుంచి 20 రెట్లు పెరిగాయని చెప్పారు. హైదరాబాద్ సహా రాష్ట్రమంతా భూముల రేట్లు అధికమయ్యాయని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇదే విషయం చెప్పారని గుర్తు చేశారు. 2014కు ముందు వ్యవసాయానికి ఆధారం లేదని, పెట్టుబడి, నీళ్లు, కరెంటు ఉండేది కాదని గుర్తు చేశారు. నాడు రైతులు ఆస్తులు అమ్ముకున్నా అప్పులు కట్టలేని దుస్థితి ఉండేదని, నేడు వారికి భూములే భరోసాగా ఉన్నాయని వ్యాఖ్యానించారు, భూముల విలువ పెరగడంతో రాష్ట్రంలోని వ్యక్తుల్లో ధీమా వచ్చిందని చెప్పారు.
దేశానికే తెలంగాణ ఒక దిక్సూచి
దేశానికే తెలంగాణ ఒక దిక్సూచి అని కెటిఆర్ వ్యాఖ్యానించారు. తొమ్మిదిన్నరేండ్లలో రాష్ట్రం బాగుపడిందని, అసాధారణ విజయం సాధించామని చెప్పారు. గత పాలకులు తమకేమీ అద్భుత దీపం ఇచ్చిపోలేదని, సుస్థిర ప్రభుత్వం… సమర్ధ నాయకత్వం వల్లే అభివృద్ధి సాధ్యమైందని పేర్కొన్నారు. కరోనా వల్ల రెండేండ్లు వృథా అయిందని, సరిగ్గా ఆరున్నరేండ్లు మాత్రమే పనిచేయగలిగామని వెల్లడించారు. అమెరికాలో కూడా సమస్యలు ఉన్నాయని చెప్పారు. ప్రాధాన్యతక్రమంలో సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. గత 65 ఏండ్ల పాలకులు ఏం చేశారు..? ఈ ఆరున్నరేండ్లలో తాము ఏం చేశామో చూడాలని కోరారు. గత పాలకులు సరిగ్గా పనిచేస్తే నేడు ఇన్ని సమస్యలు ఉండేవా అని ప్రశ్నించారు. ఆనాడు కరెంటు ఉంటే వార్త.. కానీ ఇప్పుడు కరెంటు పోతే వార్త అని పేర్కొన్నారు. పదేండ్ల కిందట పరిస్థితి ఎలా ఉండేదో ప్రజలు గుర్తుచేసుకోవాలని కోరారు. రెండు సార్లు అవకాశం ఇచ్చాంకదా అని కొందలు అంటున్నారని, బాగా పనిచేసినప్పుడు మార్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. 11 సార్లు అవకాశం ఇస్తే కాంగ్రెస్ చేసిందేంటని నిలదీశారు. కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కసాయి చేతుల్లో పెడదామా అన్నారు.
హైదరాబాద్ బెంగళూరును దాటిపోయింది
కర్ణాటక పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారిందని కెటిఆర్ పేర్కొన్నారు. 40 శాతం కమిషన్ అని అక్కడి బిజెపి ప్రభుత్వాన్ని పంపారని, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాళ్లు చదరపు అడుగుకు రూ.500 వరకు బిల్డర్స్ నుంచి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ గొప్పదనం, తెలంగాణ గొప్పతనం ఇక్కడున్న వారికి అర్థం కాదని అన్నారు. తెలంగాణలో మౌలిక సదుపాయాలను చూసి మహారాష్ట్ర బిల్డర్స్ ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. పెట్టుబడుల వల్ల అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాయని వెల్లడించారు. ధాన్యం ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నామని తెలిపారు. ఐటీ రంగం వృద్ధి 2022 – 23లో రూ.57 వేల కోట్లు అని, ఈ ఏడాది దేశంలో వచ్చిన ఐటీ ఉద్యోగాల్లో 44 శాతం తెలంగాణ వారేనని అన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందని చెప్పారు. ఉద్యోగ కల్పన, టెక్నాలజీ రంగంలో బెంగళూరును హైదరాబాద్ దాటిపోయిందన్నారు.
అభివృద్ధే మా కులం.. సంక్షేమమే మా మతం
అభివృద్ధి, ప్రగతి కొనసాగాలంటే మళ్లీ బిఆర్‌ఎస్ ప్రభుత్వమే రావాలని కెటిఆర్ చెప్పారు. స్థిరమైన ప్రభుత్వం, దృఢమైన నాయకత్వం లేకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందన్నారు. ఇవాళ తెలంగాణకు ఓ బ్రాండ్ ఇమేజ్ ఉందని చెప్పారు. ప్రపంచంలోనే తెలంగాణ అంటే ప్రోగ్రెసివ్ స్టేట్ అని తెలిపారు. అభివృద్ధే తమ కులం అని, సంక్షేమమే మతం అనే పద్ధతిలో ముందుకుపోతున్నామని చెప్పారు. అందుకే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని, సంపద సృష్టించబడుతున్నదని స్పష్టం చేశారు. నాడు ఆర్థిక అసమానతలు, సామాజిక రుగ్మతల వల్లే నక్సలిజం వచ్చిందని చెప్పారు. తెలంగాణలో నేడు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో 25 ఏళ్లు వెనక్కి చూస్తే ముగ్గురు ముఖ్యమంత్రులే గుర్తుకు వస్తారని పేర్కొన్నారు. ప్రో బిజినెస్, ప్రో అర్బన్ అనేవి చంద్రబాబు మోడల్ అని.. ప్రో రూరల్, ప్రో అగ్రికల్చర్, ప్రో పూర్ అనేవి రాజశేఖర్ రెడ్డి విధానమని, అన్ని రంగాల అభివృద్ధే సిఎం కెసిఆర్ మోడల్ అని మంత్రి చెప్పారు.
నామినేషన్ రిజెక్ట్ అయిన జానారెడ్డి కూడా సిఎం అభ్యర్థే
కాంగ్రెస్‌లో ప్రతిఒక్కరు ముఖ్యమంత్రి అభ్యర్థేనని కెటిఆర్ ఎద్దేవా చేశారు. నామినేషన్ రిజెక్ట్ అయిన జానారెడ్డి కూడా సిఎం అభ్యర్థేనని విమర్శించారు. ఆ పార్టీలో 11 మంది సిఎం అభ్యర్థులు ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిని దించడానికి ఆ పార్టీ నేతలే మతకలహాలు పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఏమోకానీ.. ఆరు నెలలకో సిఎం గ్యారెంటీ అని ఎద్దేవా చేశారు. డిసెంబర్ 3 తర్వాత సింగిల్ విండో అమలు చేస్తామని అన్నారు. చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా సవరిస్తామని చెప్పారు. ఇప్పటివరకు చూసింది ట్రైలర్ మాత్రమేనని.. అసలు సినిమా ముందుందని వెల్లడించారు. మొదటి రెండు టర్మ్‌ల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై దృష్టిసారించామని, తెలంగాణను సస్యశ్యామలం చేసుకున్నామన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించామని తెలిపారు. త్వరలో 300 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోండ్డు రాబోతున్నదని, ఓఆర్‌ఆర్‌కు ఆర్‌ఆర్‌కు మాధ్య కొత్త హైదరాబాద్ ఆవిషృతం అవుతుందని చెప్పారు. వచ్చే టర్మ్‌లో ప్రతి రోజు ఇంటింటికి నల్లా నీళ్లు ఇస్తామని వెలడించారు. ఆ తర్వాత 24 గంటల తాగు నీరు సరఫరా చేస్తామన్నారు. ఇది తమ కమిట్‌మెంట్ అని తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌కు ఇంకా సోషల్ ఇన్‌ఫ్రా యాడ్ చేయాల్సి ఉందని కెటిఆర్ స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News