Sunday, April 28, 2024

నిఖత్, నీతులకు స్వర్ణాలు

- Advertisement -
- Advertisement -

Women boxers Nikhat Zareen and Neetu won gold

పసిడిలతో అదరగొట్టిన భారత బాక్సర్లు

సోఫియా (బల్గేరియా): ప్రతిష్టాత్మకమైన స్ట్రాంజా స్మారక బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన మహిళా బాక్సర్లు నిఖత్ జరీన్, నీతు స్వర్ణాలు సాధించారు. మరోవైపు భారత్‌కే చెందిన నందినికి కాంస్యం లభించింది. ఆదివారం జరిగిన మహిళల 52 కిలోల విభాగం ఫైనల్లో తెలుగుతేజం నిఖత్ జరీన్ జయకేతనం ఎగుర వేసింది. ఇక 48 కిలోల విభాగంలో నీతు పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఇటలీ బాక్సర్ ఎరికా ప్రిసియాండ్రోతో జరిగిన ఫైనల్ సమరంలో నీతు అలవోక విజయాన్ని అందుకుంది. ఆరంభం నుంచే తనదైన పంచ్‌లతో ప్రత్యర్థిపై విరుచుకు పడిన నీతు 50 తేడాతో ఎరికాను చిత్తు చేసింది. నీతు ధాటికి ఎరికా ఎదురు నిలువలేక పోయింది. అసాధారణ పంచ్‌లతో చెలరేగిన నీతు అలవోక విజయాన్ని అందుకుంది. నీతు జోరుకు మాజీ ప్రపంచ యూత్ చాంపియన్ ఎరికా కనీస పోటీ కూడా ఇవ్వకుండానే చేతులెత్తేసింది. ఇక ఏమాత్రం అంచనాలు లేకుండానే పోటీల్లో బరిలోకి దిగిన నీతు ఏకంగా స్వర్ణం సాధించి పెను ప్రకంపనలు సృష్టించింది.

నిఖత్ పసిడి పంత్..

మరోవైపు తెలంగాణకు చెందిన యువ సంచలనం నిఖత్ జరీన్ కూడా పసిడి పతకంతో మెరిసింది. ఆదివారం జరిగిన ఫైనల్లో నిఖత్ 41 తేడాతో ఉక్రెయిన్‌కు చెందిన టెటియానా కొబ్‌ను చిత్తు చేసింది. మూడు సార్లు యూరోపియన్ చాంపియన్‌గా ఉన్న టెటియానాతో జరిగిన పోరులో నిఖత్ సునాయాస విజయాన్ని అందుకుంది. ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించిన తన మార్క్ పంచ్‌లతో ప్రత్యర్థిని హడలెత్తించింది. చివరి వరకు ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్న తెలుగుతేజం మ్యాచ్‌ను గెలిచి తన ఖాతాలో పసిడి పతకాన్ని వేసుకుంది.

ప్రశంసల వర్షం..

ఇక పసిడి పతకం సాధించి దేశ, రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింప చేసిన నిఖత్ జరీన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి నిఖత్‌ను అభినందించారు. నిఖత్ చారిత్రక విజయంతో రాష్ట్ర పేరును నిలబెట్టిందని ప్రశంసించారు. మరోవైపు నిఖత్ ఫైనల్ మ్యాచ్‌ను పురస్కరించుకుని శాట్స్ చైర్మన్ తన ఛాంబర్ ప్రత్యేక ఎల్‌సిబి ఏర్పాటు చేసి పోటీని తిలకించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News