Thursday, May 2, 2024

ఎవరినీ వదిలిపెట్టం

- Advertisement -
- Advertisement -

మేడిగడ్డలో నాసిరకం పనులు ఎలా చేశారు?

లేఖ ఇచ్చి బాధ్యతల నుంచి తప్పించుకోవాలని చూస్తే సహించేది లేదు
ఎల్‌అండ్‌టి ప్రతినిధులపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫైర్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర నీటిపారుదల రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మేడిగడ్డ బ్యారేజి కుంగిపోయిన ఘటనలో నిర్మాణ పనుల సందర్భంగా నాణ్యతకు సంబంధించి కారకులను ఎవరినీ వదిలిపేట్టబోమని నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్ కుమారెడ్డి హెచ్చరించారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో నాణ్యత లేకుండా ఎలా పనిచేశారని బ్యారేజిని నిర్మించిన ఎల్‌అండ్‌టి కంపెనీ ప్రతినిధులపై మంత్రి ఆగ్రహం వెలిబుచ్చారు. సోమవారం సచివాలయంలో మంత్రి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఎల్‌అండ్‌టి కంపెనీ డైరెక్టర్ ఎస్.వి.దేశాయ్‌తోపాటు పలువురు ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాసిరకం పనులతో ప్రాజెక్టు కుంగిపోవడానికి కారకులై ప్రజాదనాన్ని వృథా చేసిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. మేడిగడ్డ పిల్లర్లు భూమిలోకి కుంగిపోయన ఘటనలో ఎల్‌అండ్‌టి కంపెనీ తిరిగి పునరుద్దరణ పనులకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పునరుద్దరణ పనులు తమకు సంబంధం లేదని, ఈ పనుల్లో తమ ప్రమేయం ఉండదని ఏదో ఒక లేఖ ఇచ్చి తప్పించుకోవాలని చూస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి ఆగ్రహం వెలిబుచ్చారు. కాళేశ్వరం సాగునీటి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగంగా గోదావరి నదిపై నిర్మించిన మేడిగడ్డతోపాటుగా అన్నారం, సుందిళ్ల బ్యారేజిల నిర్మాణంలో పాలుపంచుకున్న కాంటాక్టు సంస్థలను కూడా పిలిచి మాట్లాడుతామని, తప్పు చేసిన వారు ఎవరైనా, ఎంతటి వారైనా తప్పించుకోవాలని చూస్తే చట్టపరంగా, న్యాయపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.

మేడిగడ్డ బ్యారేజినిర్మాణం మొదలుకుని పిల్లర్ల కుంగుబాటు ,తిరిగి పునరుద్ధరణ ప్రతిపాదనలు తదితర అంశాలపై సమగ్ర వివారాలతో నివేదిక అందజేయాలని మంత్రి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజిలకు సంబంధించి ఈఎన్సీ మురళీధర్ ద్వారా వివరాలు ఆరా తీశారు. కాంటాక్టు సంస్థలతో ఒప్పందాలు , ఇప్పటివరకూ పూర్తయిన పనుల వివరాలు, ఇంకా మిగిలిపోయన పనులు ,వాటిని పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలు, పునరుద్ధరణకు పట్టే సమయం తదితర అంశాలపైన ఈఎన్సీ మురళీధర్‌తో చర్చించారు. మేడిగడ్డ పిల్లర్లు భూమిలోకి కుంగిపోయిన ఘటనలో ఈ బ్యారేజి నిర్మించిన కాంట్రాక్టు సంస్థ ఎల్‌అండ్‌టిదే బాద్యత అని, ఆ సంస్థ ద్వారానే పునరుద్ధరణ జరగాల్సి వుందని ఈఎన్సీ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News