Tuesday, January 14, 2025

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

గిన్నెస్ ప్రపంచ రికార్డుల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన జపనీస్ మహిళ టోమికో ఉతోకా కన్ను మూసినట్లు అషియా నగర అధికారి ఒకరు వెల్లడించారు. ఆమె వయస్సు 116 సంవత్సరాలు. మధ్య జపాన్‌లోని హ్యోగో ప్రిఫెక్చర్‌లోని అషియాలో ఒక ఆదరణ గృహంలో ఇతోకా డిసెంబర్ 29న మరణించినట్లు వృద్ధుల విధానాల ఇన్‌చార్జి అధికారి యోషిత్సుగు నగాటా తెలియజేశారు. అరటిపళ్లు అన్నా, జపాన్‌లో దొరికే ‘కాల్పిస్’ అనే యోగర్ట్ రుచిగల పానీయం అన్నా ఇష్టపడే ఇతోకా 1908 మే 23న ఒసాకాలో జన్మించారు. నిరుడు 117 ఏళ్ల స్పెయిన్ మహిళ మరియా బ్రన్యాస్ మరణంతో ఇతోకా అత్యంత వృద్ధురాలుగా పేరు గడించారు. ఇతోకా నిరుడు జన్మదినోత్సవం జరుపుకున్నప్పుదు మేయర్ నుంచి పుష్పగుచ్ఛాలు, ఒక కేకు, ఒక కార్డు అందుకున్నారు.

ఆమె హైస్కూల్‌లో వాలీబాల్ ఆడేవారు. ఆమె 3067 మీటర్ల ఎత్తైన ఆన్‌టేక్ శిఖరాన్నిరెండు సార్లు అధిరోహించారు. గిన్నెస్ ప్రకారం ఆమెకు 20వ ఏట వివాహం అయింది. ఇతోకారెండవ ప్రపంచ యుద్ధ సమయంలో తన భర్త జౌళి ఫ్యాక్టరీ కార్యాలయం నిర్వహణ బాధ్యతలు చూశారు. తన భర్త 1979లో మరణించిన తరువాత ఆమె నారాలో ఒంటరిగా నివసించారు. ఆమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె, ఐదుగురు మనవలు, మనవరాళ్లు ఉన్నారు. ఆమె అంత్యక్రియలను కుటుంబం, మిత్రులు నిర్వహించినట్లు నగాటా తెలిపారు. ఇతోకా మరణంతో ఇప్పుడు బ్రెజిల్‌కు చెందిన 116 ఏళ్ల నన్ ఇనాహ్ కనబర్రో లూకాస్ ప్రపంచంలో అత్యంత వృద్ధ మహిళ అయింది. ఆమె ఇతోకా కన్నా 16 రోజులు చిన్న.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News