Wednesday, May 22, 2024

29 ఏళ్ల దండోరా ప్రస్థానం

- Advertisement -
- Advertisement -

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిగా, ఎస్‌సి రిజర్వేషన్లలో దళితుల మధ్య సమాన ప్రాతినిధ్యం కోరుతూ 1994 జులై 7 మంద కృష్ణ మాదిగ సారథ్యం లో తెలుగు నేలపై ఆవిర్భవించిన ఆత్మగౌరవ దళిత ఉద్యమం ఇది. ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే చిన్న పల్లెలో 10 మంది యువకులతో ఈ ఉద్యమం పురుడు పోసుకుంది. ఎంఆర్ పిఎస్ లేదా మాదిగ దండోరా ఉద్యమం పేరు తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో లేరంటే అతిశయోక్తి కాదు.

ఆంధ్రప్రదేశ్‌లో పురుడు పోసుకున్న ఈ ఉద్యమం కాలక్రమేణా దినదినాభివృద్ధి చెందుతూ తన పరిధిని విస్తరించుకొంటూ దేశంలోని వివిధ రాష్ట్రాలకు పాకింది. ఎందరినో ఉద్యమం పథంలోకి దింపింది. ప్రపంచ స్థాయి ఉద్యమంగా మారింది. రిజర్వేషన్లలో సమాన వాటా కోసం సమర శంఖం పూరించింది ఈ ఎంఆర్‌పిఎస్ ఉద్యమం. దళితుల మధ్య రిజర్వేషన్ ఫలాల సమ పంపిణీకి సంబంధించిన ఈఅంశం అన్నిరాజకీయ పార్టీల మద్దతు కూడగట్టింది కానీ, దళితుల్లో అప్పటి దాకా ఎక్కువ మొత్తంలో రిజర్వేషన్ల ఫలాలను అనుభవిస్తున్న సోదర వర్గం నుండి మాత్రం ప్రతిఘటన ఎదుర్కొంది. అనేక అధ్యయనాలు, పరిశీలనలు జరిగిన తరువాత వర్గీకరణమే న్యాయం అని నివేదికలు రావడం దండోరా ఉద్యమానికి నైతిక బలాన్ని పెంచింది. ఈ ఉద్యమం లక్షలాదిమంది మాదిగలకు మనుషులుగా గుర్తింపును, గౌరవాన్ని, హుందాతనాన్ని తెచ్చిపెట్టింది. లక్షలాది మంది మాదిగలను సమీకరించి మహాసభలు, నిరాహర దీక్ష లు, ధర్నాలు, రాస్తా రోకోలు, ఘోరావ్‌లు, బ్లాక్ డే లు జరిపి కుంభకర్ణుడి నిద్ర నటిస్తున్న ప్రభుత్వాధిపతులను మాదిగల డిమాండ్‌ను గుర్తించేలా చేయగలిగింది. మాదిగల్లో ఐక్యతను, ఆత్మవిశ్వాసాన్ని, హక్కుల పట్ల గొప్ప చైతన్యాన్ని కలిగించింది.

మేకల్ని బలి ఇస్తారు.. పులుల్ని కాదు. మేకల్లా కాకుండా పులుల్లా బతకండి అన్న అంబేడ్కర్ ఉద్బోధ లోంచి, హక్కుల కోసం బిచ్చమెత్తకండి పోరాడి సాధించుకోండి అన్న బాబూ జగ్జీవన్ రాం పిలుపు లోంచి, పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్లు తప్ప అన్న కార్ల మార్క్ మాట నుండి, హక్కుల కోసమే తప్ప ఎవ్వరి మీదా మాకు ద్వేషం లేదు అన్న అబ్రహం లింకన్ మనోసరస్సు నుండి, బుద్ధుని అష్టాంగమార్గం నుంచి, క్రీస్తు ప్రేమ సందేశం నుంచి అన్నింటికీ మించి నిజ జీవితంలో అనుభవిస్తున్న అంటరానితనం, ఆకలి మంటలలోంచి మనుషులుగా గుర్తింపు కోసం, మానవ హుందాతనం కోసం, కనీస హక్కుల సాధన కోసం, సమాజం అట్టడుగు పొరల్లో విరిగి నలిగిన లక్షలాది మంది మాదిగల కోసం ముఖ్యంగా మాదిగ అస్తిత్వం కోసమే పుట్టింది దండోరా ఉద్యమం.సమాజంలో తన కులం పేరు చెప్పుకోవడానికి భయపడిన మాదిగోడు దండోరా రగిల్చిన ఉద్యమం స్ఫూర్తితో తమ పేరు చివర తన కులం పేరును గర్వంగా ఉంచగలిగాడు. జనాభా దామాషా ప్రకారం హక్కులు, న్యాయం గుర్తింపు ప్రతి సాంఘిక సమూహానికి కావాలని అణగారిన కులాలు జాతులకు మేలుకొలుపు బృంద గీతిక అయింది దండోరా ఉద్యమం.

కేంద్ర సర్వీసులలోను, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులలోను, నియామకాల్లో మాలలకు 80% ఉద్యోగాలిస్తూ ఉంటే మాదిగలకు 20% ఉద్యోగాలు మాత్రమే దక్కడం, రాజకీయ పార్టీలు కూడా తమ ప్రతినిధులుగా మాలలకే ఎక్కువ సీట్లు కేటాయించడం జరిగిన దరిమిలా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎస్‌సి రిజర్వుడు సీట్లు 40కు పైగా ఉంటే 10 సీట్లు మాత్రమే మాదిగ ఎంఎల్‌ఎలు ఉండడం, ఆనాటికి ఉన్న 6 పార్లమెంట్ రిజర్వుడు సీట్లలో 5 మాల ప్రతినిధులు ఉండడం, కేంద్ర రాష్ట్ర మంత్రులలో కూడా అధిక భాగం మాల వారికే దక్కడం ఇలాంటి ఎన్నో ఎన్నో సంఘటనలు ఈ దండోరా ఉద్యమానికి పుట్టుకకు కారణాలుగా చెప్పుకోవచ్చు. ఉద్యోగస్థులలో అయితే మాదిగలు చాలా వెనుకబడి ఉన్నారు. నిరుద్యోగుల సంఖ్య అయితే గణనీయంగా పెరుగుతూ మాదిగ యువకులను అతివాద ఉద్యమాలు తీవ్రంగా ఆకర్షించసాగాయి. ఈ వెనుకబాటు తనమే మాదిగలను సమాజంలో తన స్థానం ఏమిటో అనేది గుర్తించడానికి కారణ భూతమైనది.
కారణాలు అన్నిటి వలన మాదిగలు ఆత్మగౌరవం కోసం పోరాటం మొదలు అయింది.

మానవ హక్కుల కోసం, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం, కొంచెం ఆలస్యంగా అయిన మాదిగలు నడుం బిగించారు. మానవహక్కుల పోరాట పరిరక్షణ దిశలో ఆత్మరక్షణ నుండి, ఆత్మగౌరవం కోసం వచ్చిన చైతన్యమే దండోరా ఉద్యమం. ఈ ఉద్యమం 1994లో అస్తిత్వ గౌరవం సమాన అభివృద్ధి, సమాన అవకాశాలు అనే బాగా వెనుకబడిన షెడ్యూల్డ్ కులాలు నుండి వచ్చిన ఆలోచన. ఈ కారణాల వలన మాదిగ కార్యాచరణ ప్రణాళికగా దండోరా ఉద్యమం ఆవిర్భవించింది. దండోరా ఉద్యమం లేకపోతే ఈ రోజుకీ సమాజంలో మాదిగల స్థాయి దిగజారి ఉండేది. దండోరా పుణ్యమా అని రాజకీయ పార్టీలలో పదవులు పొంది ఉద్యమాన్ని హేళన చేస్తున్నారు కొందరు మాదిగ నాయకులు. ప్రతి ఒక్కరూ దండోరా పూర్వం మాదిగల చరిత్ర, దండోరా తరువాత మాదిగల చరిత్ర తెలుసుకుని విమర్శలు చేయాలా వద్దా అని పునః పరిశీలించుకోవడం ఆవశ్యకం. లేదంటే ఉద్యమ చరిత్రలో హీనులుగా మిగలడం తథ్యం. 2000లో సాధించిన వర్గీకరణ ఫలితంగా ఎస్‌సిలలో అధిక సంఖ్యలో ఉన్న మాదిగలు వర్గీకరణ ఫలితంగా అనేక మేలు పొందారు.

2004 నవంబర్ 5న సుప్రీంకోర్టు ఎస్‌సి వర్గీకరణ చట్టాన్ని కొన్ని సాంకేతిక కారణాలు చూపెడుతూ రద్దు చేసింది. వర్గీకరణ కోల్పోయాక మాదిగ ఉద్యమ ప్రయాణం పొగడ్తలూ సంపాదించింది, విమర్శలకు లోనైంది. ఆరోగ్యశ్రీ, వృద్ధులు, వితంతువుల, వికలాంగుల పెన్షన్ వంటి పథకాల రూపకల్పనకు ఎంఆర్‌పిఎస్ పోరాటమే భూమిక. 2007లో కేంద్ర ప్రభుత్వం ఎస్‌సిల రిజర్వేషన్ వర్గీకరణ అంశంపై ఉషా మెహ్రా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 2008లో ఈ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించి ఎస్‌సి వర్గీకరణ ద్వారా నే సామాజిక న్యాయం జరుగుతుందని తన నివేదికలో వెల్లడించింది. అయిన పాలక పక్షాలు మాదిగలపై తన సవతి ప్రేమను చూపుతూ, ప్రతిపక్షాలు ఈ అంశాన్ని తమ రాజకీయాలకు వాడుకుంటూ పబ్బం గడుపుతున్నాయి. 29 సంవత్సరాల నుండి తమ లక్ష్యం ఎస్‌సి రిజర్వేషన్ వర్గీకరణ సాధించి తీరాలని తమ ఆశయ సాధన కోసం మాదిగ మహాత్ముడు, ఉద్యమ సూర్యుడు మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో ఈ ఉద్యమం నడుస్తూ ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News