Sunday, May 5, 2024

30న పోడు భూములకు పట్టాల పంపిణీ

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: ఈ నెల 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పట్టాల పంపిణీ కార్యక్రమానికి బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం రాత్రి మానుకోటలోని ఐ.డి.ఓ.సిలోని స్టేట్ చాంబర్‌లో పోడు పపట్టాల పంపిణీపై అధికారులతో స్థానిక ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, జడ్పీ చైర్‌పర్సన్ కుమారి అంగోతు బింధు, మున్సిపల్ చైర్మైన్ డాక్టర్ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, వైస్ చైర్మైన్ ఎండి. ఫరీద్‌లతో కలసి మంత్రి సమీక్షించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా రూ. 50 కోట్లతో మానుకోట మున్సిపాలిటీ పరిధిలో చేపట్టనున్న అభివృద్ధ్ది కార్యక్రమాలకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పైలాన్‌ను ఆవిష్కరించనున్నారని మంత్రి వివరించారు. అనంతరం రూ. ఐదు కోట్ల వ్యయంతో పట్టణ నడిబొడ్డున నిర్మించిన మోడల్ మార్కెట్‌ను మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభోత్సవం జరుగనుందని వెల్లడించారు. అనంతరం పట్టణంలోని రామచంద్రాపురంలో నిర్మించిన రెండు వందల డబుల్ బెడ్‌రూం ఇండ్లను లబ్దిదారులకు అందజేయనున్నారని వివరించారు. తదనంతరం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో పదిహేనువేల మందితో ఏర్పాటు చేసే బహిరంగ సభలో మంత్రి పాల్గొననున్నారని వివరించారు.

ఈ సభ వేదికగా పోడు పట్టాలను లబ్ధ్దిదారులకు పంపిణీ చేయనున్నారని మంత్రి వెల్లడించారు. మంత్రి కేటీఆర్ పర్యటన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సత్యవతి సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ కుమారి అంగోతు బిందు, ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, మున్సిపల్ చైర్మైన్ డాక్టర్ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, వైస్ చైర్మైన్ ఎండి. ఫరీద్, జిల్లా కలెక్టర్ కె. శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పవార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News