Thursday, May 2, 2024

28 వేలు దాటిన కరోనా మరణాలు

- Advertisement -
- Advertisement -

37148 New Corona Cases Reported in India

24 గంటల్లో 37,148 పాజిటివ్ కేసులు, 587 మరణాలు
21 రోజుల్లో రెట్టింపు అయిన కేసులు, 7,24,577 మంది కోలుకున్నారు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వైరస్ కరాళ నృత్యం కొనసాగిస్తోంది. ప్రతిరోజూ దాదాపు 40వేల కేసులు నమోదవుతున్నాయి. తాజాగా, గడచిన 24 గంటల్లో 37,148 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 11,55,191కి చేరుకుంది. అయితే క్రితం రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య కాస్త తగ్గడం గమనార్హం. కాగా గడచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 587 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు ఈ వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 28,084కు చేరుకుంది. కాగా కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 7,24,577 కోలుకుని ఇళ్లకు తిరిగి వెళ్లగా 4,02,529 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 62.72గా ఉంది. కాగా దేశంలో 30 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం వరసగా ఇది ఆరో రోజు. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు రెట్టింపు కావడానికి ప్రస్తుతం 21 రోజుల సమయం పడుతోంది. జులై 1వ తేదీనుంచి ఇప్పటివరకు దాదాపు 5 లక్షల 70 వేల కేసులు నమోదయ్యాయి. దీంతో కేసులు రెట్టింపు అయ్యాయి. ఇంతకు ముందు కేసులు రెట్టింపు కావడానికి 17 రోజులు పట్టగా ఇప్పుడది 21 రోజులకు చేరడం ఊరట కలిగిస్తున్న విషయం.

ప్రపంచంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. కాగా దేశంలో కరోనా మరణాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతి రోజూ దాదాపు 600 మంది ఈ వైరస్ కారణంగా మృత్యువాత పడుతున్నారు. ఇప్పటివరకు దేశంలో మరణాల సంఖ్య 28 వేలను దాటింది. దీంతో ప్రపంచంలో 28,400 మరణాలతో ఏడో స్థానంలో ఉన్న స్పెయిన్‌కు మన దేశం చేరువైంది. ప్రస్తుతం భారత్‌లో కరోనా మరణాల రేటు 2.45గా ఉంది.
కాగా తాజాగా మరణించిన వారిలో మహారాష్ట్రలో176 మంది ఉండగా, కర్నాటకలో 72 మంది, తమిళనాడులో 70 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 54 మంది, యుపిలో 45 మంది, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో చెరి 35 మంది, గుజరాత్‌లో 20 మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు అత్యధికంగా 12,030 మంది ప్రాణాలు కోల్పోగా, ఢిల్లీలో 3,663 మంది, తమిళనాడులో2,551 మంది, గుజరాత్‌లో 2,162 మంది మరణించారు. తమిళనాడు, యుపి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా వెయ్యి మందికి పైగానే ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో అత్యధికంగా 3,18,695 మంది ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడగా, తమిళనాడు 1,75,678, ఢిల్లీ 1,23,747 కేసులతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

2.3 శాతానికి తగ్గిన మరణాల రేటు

కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం తీసుకొంటున్న పటిష్టమైన చర్యల కారణంగా గత జూన్ 17న 3.36 శాతంగా ఉన్న మరణాల రేటు ప్రస్తుతం 2.3 శాతానికి తగ్గిపోయిందని ప్రభుత్వం పేర్కొంది. ప్రపంచంలోని అనేక దేశాలతో పోలిస్తే భారత్ కరోనాను సమర్థవంతంగా కట్టడి చేయగలిగిందని కూడా ప్రభుత్వం చెప్తోంది. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు సగటు 8.07 శాతం ఉండగా 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పాజిటివిటీ రేటు తక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ రాజేశ్ భూషణ్ మంగళవారం విలేఖరుల సమావేశంలో చెప్పారు. ‘19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రతి రోజూ పది లక్షల జనాభాకు140కి పైగా టెస్టులు నిర్వహిస్తున్నాయి. కేవలం పరీక్షలు జరిపితే పరిపోదు. ప్రతి పది లక్షల జనాభాకు 140 టెస్టుల స్థాయిలో అవి జరగాలి. అప్పుడే పాజిటివిటీ రేటు పది శాతానికి తగ్గించగలుగుతాము. ఆ తర్వాత కూడా ఆదే స్థాయిలో టెస్టుల ప్రక్రియనుకొనసాగించాలి. అప్పుడే పాజిటివిటీ రేటు 5 శాతం, అంతకన్నా దిగువకు వస్తుంది’ అని ఆయన అన్నారు. ఆ స్థాయికి చేరుకునే వరకు ఇదే స్థాయిలో టెస్టులను కొనసాగించాలి అని ఆయన చెప్పారు. దేశంలో కోవిడ్19 మరణాలు ప్రస్తుతం పది లక్షల జనాభాకు 20.4గా ఉందని, ప్రపంచంలోనే ఇది అతి తక్కువ అని రాజేశ్ భూషణ్ చెప్పారు. భారత్‌కన్నా 21నుంచి 31 రెట్లు ఎక్కువ మరణాలు చోటు చేసుకుంటున్న దేశాలు చాలా ఉన్నాయని ఆయన చెప్పారు. ఇప్పటివరకు దేశం కోవిడ్19ను చాలా వరకు బాగానే కట్టడి చేయగలిగిందని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పూర్తిగా సహకరిస్తోందని, అన్ని నిరయాలుసైన్స్, ఆధారాలు ఆధారంగా, ఈ రంగంలోని నిపుణులను సంప్రదించిన తర్వాతే తీసుకోవడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

37148 New Corona Cases Reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News