Saturday, April 27, 2024

హుందాగా.. సౌకర్యవంతంగా

- Advertisement -
- Advertisement -

CM KCR Review Meeting on New Secretariat building

నూతన సెక్రటేరియట్ భవనం హుందాగా, సౌకర్యవంతంగా ఉండాలి
లోపల అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి,డిజైన్లలో మార్పులు చేయాలి
మంత్రులు, అధికారులకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలి
భవిష్యత్ తరాలకు అద్ధంపట్టేలా నిర్మాణం జరగాలి
అధికారుల సమీక్షలో సిఎం కెసిఆర్ ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్: నూతన సెక్రటేరియట్ భవనాన్ని హుందాగా, సౌకర్యవంతంగా ఉండేలా నిర్మించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. బాహ్యరూపం ఆకర్షణీయంగా, హుందాగా ఉండాలని, లోపల అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు, పనులు చేసుకోవడానికి పూర్తి అనుకూలంగా ఉండేలా నూతన భవనాన్ని తీర్చిదిద్దాలని సిఎం కెసిఆర్ సూచించారు. కొత్త సెక్రటేరియట్ భవనం నిర్మాణంపై ముఖ్యమంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. డిజైన్లను ముఖ్యమంత్రి కెసిఆర్ పరిశీలించి వాటిలో కొన్ని మార్పులను సూచించారు. భవనంలో లోపల నిర్మాణాలకు సంబంధించి పలు సూచనలను ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులకు జారీ చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారులతో పాటు వారి సిబ్బంది పనిచేయడానికి అనుగుణంగా కార్యాలయాలుండాలని, ఎక్కడా రాజీ పడకుండా నిర్మాణాలు జరగాలని, భవిష్యత్ తరాలకు అద్ధంపట్టేలా నిర్మాణం జరగాలని ఆయన అధికారులకు దిశా, నిర్ధేశం చేశారు. ప్రతి అంతస్తులో ఒక డైనింగ్ హాల్, సమావేశ మందిరం ఉండాలని దానికి సంబంధించిన నిర్మాణాలు ఆకట్టుకునేలా ఉండాలని సిఎం సూచించారు. విఐపిలు, డెలిగేట్స్, డిగ్నిటరీస్, ఇతర ప్రముఖులు, అతిథుల కోసం ప్రత్యేక వెయిటింగ్ హాళ్లు నిర్మించాలని సిఎం సూచించారు. సెక్రటేరియట్లో ఏం పని జరుగుతుంది, ఎందరు పనిచేస్తారు, ఎందరు సందర్శకులుంటారు, తదితర విషయాలను పరిగణలోకి తీసుకుని నిర్మాణాలు చేపట్టాలని కెసిఆర్ ఆదేశించారు.

రెండు రోజులుగా అధికారులతో మంత్రి వేముల సమావేశం

డిజైన్‌లతో పాటు నూతన భవనం, పాత సచివాలయం కూల్చివేతలకు సంబంధించి రెండురోజులుగా ఆర్ అండ్ బి అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమావేశమవుతున్నారు. సిఎం కెసిఆర్ మంగళవారం సాయంత్రం సమీక్ష జరపనున్న నేపథ్యంలో కూల్చివేతలతో పాటు నూతన భవన నిర్మాణానికి సంబంధించి ఆర్ అండ్ బి అధికారుల నుంచి సమగ్ర నివేదిక తెప్పించుకున్న మంత్రి వేముల సిఎం కెసిఆర్‌తో సమావేశమయ్యారు. అనంతరం సిఎంతో జరిగిన సమావేశంలో కూల్చివేతలతో పాటు నూతన నిర్మాణానికి పట్టే సమయం తదితర విషయాలపై మంత్రి వేములతో కెసిఆర్ చర్చించినట్టుగా సమాచారం. అందులో భాగంగా నూతన నిర్మాణం భావితరాలు గర్వించదగేలా జరగాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి వేముల ప్రశాంతరెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు సునీల్ శర్మ, రామకృష్ణ, రజత్ కుమార్, నర్సింగ్ రావు, ఆస్కార్-పొన్ని అర్కిటెక్ట్‌లు హాజరయ్యారు.

CM KCR Review Meeting on New Secretariat building

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News