Friday, April 26, 2024

టోక్యోలో కరోనా విలయ క్రీడ

- Advertisement -
- Advertisement -

3865 new corona cases reported in Tokyo

లక్షమందికి 88 మంది వంతున పెరుగుతున్న కేసులు
జపాన్‌లో మొత్తం కేసుల సంఖ్య 8,92,000 కు చేరిక

టోక్యో: టోక్యోలో ఒలింపిక్ క్రీడల నేపథ్యంలో వరుసగా మూడో రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడంపై జపాన్ ప్రభుత్వ అధికార వర్గాలు ప్రజలను అప్రమత్తం చేశాయి. కొత్తగా కేసులు టోక్యో లోనే కాకుండా దేశం మొత్తం మీద భారీగా పెరుగుతున్నాయని చీఫ్ కేబినెట్ సెక్రటరీ కట్సునొబొ కటో గురువారం పాత్రికేయిలకు తెలియచేశారు. వారం క్రితం కన్నా రెట్టింపు సంఖ్యలో కేసులు పెరిగాయని, బుధవారం 3177 కేసులు నమోదు కాగా, గురువారం 3865 కేసులు నమోదయ్యాయని చెప్పారు. గత ఏడాది కరోనా ప్రారంభం కన్నా ఇది చాలా ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నట్టు తెలిపారు. ఇతర దేశాల కన్నా జపాన్ కరోనా కేసులను, మరణాలను చాలావరకు అదుపులో ఉంచుతోంది. కానీ గత ఏడు రోజులుగా సరాసరి కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.

ఇప్పుడు జాతీయ స్థాయిలో లక్ష మందికి 28 మంది వంతున అదే స్థాయిలో టోక్యోలో 88 మంది వంతున బాధితులు నమోదవుతున్నారని జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అమెరికాతో పోలిస్తే అమెరికాలో లక్ష మందికి 18.5 మంది, బ్రిటన్‌లో48 మంది,భారత్‌లో 2.8 మందికి కరోనా సోకుతోందని జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్శిటీ డేటా వెల్లడించింది. ఇప్పుడు కేసులు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయని, ముఖ్యంగా ఒలింపిక్స్, సమ్మర్ వెకేషన్ ప్రధాన కారణమని ప్రభుత్వ ఉన్నత వైద్య సలహాదారు డాక్టర్ షింగెరు ఒమి పేర్కొన్నారు. ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే జులై 12 నుంచి కరోనా అత్యవసర నాలుగో దశలో టోక్యో ఉంది. ఇళ్ల వద్దనే ప్రజలు ఉండాలని హెచ్చరించినా జనం ఖాతరు చేయడం లేదు. వీధుల్లో బహిరంగంగా సంచరిస్తున్నారు.

ఇద్దరు విదేశీ ఒలింపిక్ క్రీడాకారులు ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని, మరో 38 మంది నగరం లోని హోటళ్లలో స్వయం ఐసొలేషన్‌లో ఉంటున్నారని అధికారులు గురువారం వెల్లడించారు. ఒలింపిక్ క్రీడాకారుల నుంచి ప్రజలకు కరోనా వ్యాపిస్తున్నట్టు దాఖలాలు కనిపించడం లేదని జపాన్ వ్యాక్సిన్ మంత్రి టారో కొనో ఒక ఇంటర్వూలో వివరించారు. బుధవారం నాడు జపాన్ మొత్తం మీద రికార్డు స్థాయిలో 9500 కేసులు నిర్ధారణ కాగా, మొత్తం కేసుల సంఖ్య 8,92,000 కు చేరుకుంది. దాదాపు 15,000 మంది మృతి చెందారు. ఈ కేసుల్లో బాధితులైన వారు 30 ఏళ్ల యువకులే ఎక్కువగా ఉన్నారు. బుధవారం నాటికి జపాన్ జనాభాలో 26.3 శాతం మంది పూర్తిగా టీకా పొందగలిగారు. వయోవృద్ధుల్లో 70 శాతం మంది, లేదా 24.8 మిలియన్ మంది పూర్తిగా వ్యాక్సిన్ పొంద గలిగారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News