Friday, May 3, 2024

రక్త రస్తాలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది దుర్మరణం

వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండల పరిధిలో పొగమంచులో దూసుకుపోయిన లారీ కింద ఐదుగురు పత్తి కూలీలు దుర్మరణం
కూలీలు కూర్చుని ఉన్న ఆటోను, ఆర్‌టిసి బస్సును ఢికొని ఒక ఇంటిని తాకి పల్టీకొట్టిన లారీ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మరొకరు ఆసుపత్రిలో మృతి
వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలంలో దాటి వెళుతున్న బైక్‌ను ఢికొన్న ఆర్‌టిసి బస్సు, తండ్రి కొడుకు మృతి
సిద్దిపేట జిల్లా రవీంద్రనగర్ శివారులో రాజీవ్హ్రదారిపై ప్రమాదంలో డివైడర్‌ను డీకొన్న మోటర్ సైకిల్
బావబావమరిది దుర్మరణం

రాష్ట్రంలో రహదారులు రక్తమోడాయి. శనివారం వేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 9 మంది మృత్యువాత పడ్డారు. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలం ఇజ్రాచిట్టంపల్లి వద్ద శనివారం ఉదయం లారీ, ఆటో ఢీకొన్న సంఘటనలో ఐదుగురు మృతి చెందగా.. . వరంగల్ అర్బన్ జిల్లా ఎల్లతుర్కి మండలం దామెర గ్రామానికి పక్క గ్రామమైన దేవునూర్‌లో బైక్‌పై వెళ్తూ ఆర్టీసి బస్సును క్రాస్ చేస్తున్న సమయంలో బండిమీంచి పడి తండ్రి, కొడుకులిద్దరూ దుర్మరణం పాలవ్వగా.. సిద్ధిపేట జిల్లా కొండపాక మండల పరిధిలోని రాజీవ్ రహదారిపై జరిగిన ప్రమాదంలో బావ, బావమరదులు నేలకొరిగారు.

మన తెలంగాణ/మోమిన్‌పేట్ : వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలం ఇజ్రాచిట్టంపల్లి వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడ్డ నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, మరో ముగ్గురికి చికిత్స అందిస్తున్నట్లు వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్టీసీ బస్సు, లారీ, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందిన ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు. ఎస్‌ఐ రవికుమార్ తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.మోమిన్‌పేట మండలం ఇజ్రాచిట్టెంపల్లి తండా సర్పంచ్ చెందర్ నాయక్ ఇంటి ముందు కోటపల్లి-మోమిన్‌పేట ప్రధాన రోడ్డుపైన ఒకే కుటుంబానికి చెందినవారు ఆటోలో ఉన్న క్రమంలో తాండూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వచ్చి ఆటో ముందు ఆగింది. కాగా వెనుక నుంచి ఓ లారీ వేగంగా వస్తుండగా, అది గమనించని ఆటో డ్రైవర్ తన వాహనాన్ని ముందుకు తీశాడు. దీంతో లారీ ఆటోను ఢీ కొట్టి రోడ్డు పక్కకు దూపుకెళ్లి మూడు పల్టీలు కొట్టింది. లారీ తాకిడికీ బస్సు కూడా కొద్దిగా ధ్వంసమైంది. ఆటోలో ఎక్కి కూర్చున్న కుటుంబ సభ్యుల్లో 5 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా లారీలో ఉన్న వారికి సైతం తీవ్రగాయాలు కావడంతో వైద్య సేవల నిమిత్తిం ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం జరిగిందిలా:
మోమిన్‌పేట్ మండల పరిధిలోని ఇజ్రా చిట్టంపల్లి గ్రామానికి చెందిన సెనిభాయి(45), నితిన్(18), సోనీభాయి(15), సం(20), రేణు(35)లు కూలీ పనికి శంకర్‌పల్లిలోని పత్తి పొలానికి వెళ్లేందుకు తమ ఇంటి ముందు రోడ్డుకు కుడివైపున నిలిపిన ఆటో(టీఎస్07యూఏ1929)లో కూర్చున్నారు. ఆటో డ్రైవర్ టిఫిన్ తెచ్చుకుంటానని ఆటోలో కూర్చున్న వారికి చెప్పి వెళ్లాడు. ఆటోను రోడ్డుకు కుడివైపు పెట్టి వెళ్లాడు. మోమిన్‌పేట్ నుంచి తాండూర్ వైపు వెళుతున్న లారీ(ఏపీ28వై 9596) ఉదయం 7 గంటలకు పూట పొగ మంచు ఉండటంతో రోడ్డుపై నిలిచి ఉన్న ఆటో కనిపించకపోవడం వల్ల ఆటోను ఢీకొట్టి అదే సమయంలో తాండూర్ నుండి సంగారెడ్డి వైపు వెళుతున్న బస్సు(టీఎస్34టీఏ 6125)ను కూడా ఢీకొట్టి లారీ అక్కడే ఉన్న ఇంటిపై పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా రేణుక పరిస్థితి విషమంగా ఉండటంతో సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఇంటిపై పల్టీ కొట్టిన లారీ, ప్రమాదానికి గురైన బస్సు, ఆటోలను పోలీసులు క్రేన్‌ల సహాయంతో తీసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ వెంకటేశం తెలిపారు.
గ్రామంలో విషాదఛాయలు:
ఒకే గ్రామానికి చెందిన ఐదు మంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామస్తులంతా తండోపతండాలుగా రోడ్డుపైకి వచ్చారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు, బంధువుల రోధనలతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
ఆటోను, బస్సు లారీ ఢీకొట్టిన ప్రమాద ఘటన సమాచారం తెలుసుకున్న వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన వారిని వెంటనే సంగారెడ్డి ఆసుపత్రికి ట్రాక్టర్‌లో తరలించే ఏర్పాట్లు చేశారు. అలాగే మృతదేహాలను మర్పల్లి ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుండి ఆర్థ్ధిక సహాయం అందేలా కృషి చేస్తానని హామి ఇచ్చారు. రోడ్డు వెడల్పు చేయాలని ఆర్‌ఆండ్‌బీ అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశించారు. రోడ్లు చిన్నగా ఉన్నందున రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎంఎల్‌ఎ వివరించారు.

5 dead in Road Accident at Vikarabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News