Sunday, April 28, 2024

రాష్ట్రంలో 5వేల మెగావాట్ల సోలార్ ఉత్పత్తి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: తెలంగాణ రాష్ట్రంలో 5 వేల మెగావాట్ల సోలార్ ఉత్పత్తి జరుగుతోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం స్థానిక పద్మనాయక కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన 30 కెవి సోలార్ పవర్ సిస్టమ్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం చదువులో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులకు వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో అందిస్తున్న ఉపకార వేతనాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సిఎం కెసిఆర్ ముందు చూపుతో రాష్ట్రంలో 24 గంటల కరెంట్ సరఫరా అవుతోందని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సాగు, తాగు నీటి సమస్యలు పరిష్కారం కావడంతో పాటు భూగర్భ జలాలు పెరిగాయన్నారు. రైతాంగానికి 24 గంటల విద్యుత్, సాగు నీరు అందుబాటులో ఉండటంతో పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని, తద్వారా పంట దిగుబడి గణనీయంగా పెరిగిందన్నారు.

రాష్ట్రంలో కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉందని, తెలంగాణ ధాన్య బంఢాగారంగా మారిందన్నారు. ఒక్క జగిత్యాల నియోజకవర్గంలోనే పంటకు ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తోందన్నారు. రాష్ట్రంలో 24 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించడంతో పాటు పౌష్టికరమైన భోజనం, అన్ని రకాల వసతి సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. ఒకే పాఠ్యపుస్తకంలో తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో పాఠాలు ముద్రించి బోధన అందిస్తున్నామన్నారు.

కెజి టు పిజి ఉచిత విద్య దిశగా తెలంగాణ ముందుకు సాగుతోందన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజు రిఎంబర్స్‌మెంట్ ఇస్తున్నామని, ఇప్పటి వరకు రూ.18 వేల కోట్లు అందించడం జరిగిందన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో 9 జూనియర్ కళాశాలలు, ఎస్సీ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చామన్నారు. ధనం వస్తుంది… పోతుందని, విద్య మాత్రమే ఎప్పటికీ ఉంటుందని, ఎవరూ దోచుకెళ్లేది కాదన్నారు.

విద్యార్థుల్లో మరింత ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ ఉన్నతంగా ఎదగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వెలమ సంక్షేమ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రావు, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌రావు, మాజీ అధ్యక్షుడు రాజేశ్వర్‌రావు, సుధాకర్‌రావు, దామోదర్‌రావు, ఆనందరావు, శరత్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News