Monday, June 17, 2024

ఆరో దశలో అంతంతే

- Advertisement -
- Advertisement -

ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలోని 58 నియోజకవర్గాలలో కొన్ని చెదురు మదురు ఘటనలు మినహా శనివారం ఆరవ దశ లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5 గంటల వరకు 58 నియోజకవర్గాలలో కలిపి 57.7 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 77.99 శాతం ఓటింగ్ నమోదు కాగా జార్ఖండ్‌లో 61.41 శాతం, ఉత్తర్ ప్రదేశ్‌లో 52.07 శాతం, ఒడిశాలో 59.60 శాతం, జమ్మూ కశ్మీరులో 51.35 శాతం, బీహార్‌లో 52.34 శాతం, హర్యానాలో 55.93 శాతం, ఢిల్లీలో 53.73 శాతం నమోదైనట్లు ఇసి తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికలు జరిగిన 8 నియోజకవర్గాలకు చెందిన కొన్ని ప్రాంతాలలో కొన్ని హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇవిఎంల మొరాయించడం, పోలింగ్ ఏజెంట్లు బూత్‌లలోకి వెళ్లకుండా అడ్డుకోవడం వంటి ఆరోపణలతో వివిధ రాజకీయ పార్టీల నుంచి 954 ఫిర్యాదులు ఉదయం 11 గంటల వరకు అందాయని ఇసి తెలిపింది. అయితే మొత్తమ్మీద ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు తెలిపింది.

తన పార్టీ కార్యకర్తలను, పోలింగ్ ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారని ఆరోపిస్తూ అనంత్‌నాగ్-రాజౌరీ నియోజకవర్గ పిడిపి అభ్యర్థి మొహబూబా ముఫ్తి అనంత్‌నాగ్ జిల్లాలోని శ్రీనగర్–జమ్మూ జాతీయ రహదారిపైన ఉన్న బిజ్‌బెహర పోలీసు స్టేషన్ వెలుపల ధర్నా చేశారు. తన మొబైల్ నంబర్ నుంచి ఔట్‌గోయింగ్ కాల్స్‌ను నిలిపివేశారని కూడా ఆమె ఆరోపించారు. అనంత్‌నాగ్-రాజౌరీ నియోజకవర్గంలోని ఒక పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా నెమ్మదించారని మెహబూబా ముఫ్తి కుమార్తె ఇల్తిజా ముఫ్తి ఆరోపించగా ఈ ఆరోపణను ఎన్నికల అధికారులు ఖండించారు. కాగా..దేశ రాజధానిలో రాష్ట్ర ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రులు ఎస్ జైశంకర్, హర్దీప్ సింగ్ పురి, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ మంత్రి అతిషి, కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తూర్పు ఢిల్లీ ఎంపి గౌతమ్ గంభీర్ తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీలోని 7 నియోజకవర్గాలతోపాటు ఉత్తర్ ప్రదేశ్‌లోని 14 స్థానాలు, హర్యానాలోని 10 స్థానాలు, బీహార్‌లోని 8 స్థానాలు, పశ్చిమ బెంగాల్‌లోని 8 స్థానాలు, ఒడిశాలోని 6 స్థానాలు, జార్ఖండ్‌లోని 4 స్థానాలు, జమ్మూ కశ్మీరులోని ఒక స్థానానికి శనివారం పోలింగ్ జరిగింది.

ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలతోపాటు హర్యానాలోని కర్నల్ అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక జరిగింది. ఉదయం 7 గంటలకే ఓటింగ్ ప్రారంభం కాగా ప్రజలు అప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి నిలబడడం కనిపించింది. హర్యానాలోని కర్నాల్ లోక్‌సభ స్థాన బిజెపి అభ్యర్థి మనోహర్ లాల్ ఖట్టర్, కర్నల్ అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీచేస్తున్న బిజెపి అభ్యర్థి, ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ఆయా పోలింగ్ కేంద్రాలలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంబాలా జిల్లాలోని తన స్వగ్రామం మీర్జాపూర్ మజ్రాలో తన కుటుంబ సభ్యులతో కలసి సైనీ ఓటు వేశారు. కర్నల్‌లోని ప్రేమ్ నగర్‌లోని పోలింగ్ బూత్‌లో ఖట్టర్ ఓటు వేశారు. కాగా..ఆరవ దశ పోలింగ్ కోసం సుమారు 1.4 లక్షల పోలింగ్ అధికారులను, 1.14 లక్షల పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News