Sunday, May 5, 2024

భారీ పేలుళ్ల కుట్ర భగ్నం

- Advertisement -
- Advertisement -

9 మంది అల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్టు
పశ్చిమబెంగాల్‌లో ఆరుగురు, కేరళలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఎ

న్యూఢిల్లీ/కోల్‌కతా: జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఎ దేశవ్యాప్తంగా జరిపిన సోదాల్లో తొమ్మిది మంది అల్ ఖైదా ఉగ్రవాదులు పట్టుబడ్డారు. వీరందరినీ పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్, కేరళలోని ఎర్నాకుళంలలో అరెస్టు చేసింది. వీరిలో ఆరుగురు పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌కు చెందిన వారు కాగా, మిగతా ముగ్గురు కేరళలోని ఎర్నాకుళంకు చెందిన వారని ఎన్‌ఐఎ తెలిపింది. వీరంతా దేశవ్యాప్తంగా జనసమ్మర్దంగా ఉన్నప్రదేశాల్లో బాంబుదాడులు జరిపి అమాయక ప్రజల ప్రాణాలు తీసేందుకు కుట్రపన్నుతున్నట్లు ఎన్‌ఐఎ తెలిపింది.

ఉగ్రవాదులనుంచి భారీ ఎత్తున రహస్యపత్రాలను, డిజిటల్ డివైస్‌లను, జిహాదీ సాహిత్యాన్ని, దేశీయంగా తయారైన తుపాకులు, శరీర కవచాలు, ఇంట్లోనే పేలుడు పదార్థాలు తయారు చేయడానికి అవసరమైన పరిజ్ఞానంతో కూడిన మెటీరియల్, పదునైన ఆయుధాలను ఎన్‌ఐఎ స్వాధీనం చేసుకుంది. వీరంతా పాకిస్థాన్ కేంద్రంగా పని చేసే అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ అనుబంధ సభ్యులని ఆ సంస్థ వెల్లడించింది. సామాజిక మాధ్యమాల ద్వారా అల్‌ఖైదాలో చేరి ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా దాడులకు కుట్రపన్నినట్లు పేర్కొనింది. నిధుల సేకరణకు పాల్పడడంతో పాటుగా వీరిలో కొందరు ఢిల్లీ వెళ్లి ఆయుధాలు కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలిపింది.

అంతేకాకుండా ఆయుధాలు అందజేయడం కోసం కశ్మీర్‌కు వెళ్లాలని కూడా ఈ ముఠా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది ‘అల్‌ఖైదాకు చెందిన అంతర్రాష్ట్ర ఉగ్రముఠా పశ్చిమ బెంగాల్, కేరళ సహా వివిధ ప్రాంతాల్లో సామాన్య ప్రజలే లక్షంగా దాడులకు పాల్పడడానికి పన్నుతున్నట్లు సమాచారం అందింది. అంతేకాకుండా మరికొందరిలో ఉగ్రబీజాలు నాటేందుకు వీరు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఈ నెల 1819 తేదీల మధ్య రాత్రి కేరళలోని ఎర్నాకుళం, పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లలో దాడి చేసి వారందరినీ అరెస్టు చేశాం’ అని ఎన్‌ఐఎకు చెందిన సీనియర్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ముర్షీద్ హసన్, యాకుబ్ బిస్వాస్, ముషారఫ్ హుస్సేన్‌లను కేరళలోని ఎర్నాకుళంలో అరెస్టు చేయగా,నజ్మస్ సాకిబ్, అబూ సుఫియాన్, మైనుల్ మోండల్, లియు యీన్ అహ్మద్, అల్ మమున్ కమాల్, అతితుర్ రెహ్మాన్‌లను పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో అరెస్టు చేసినట్లు తెలిపారు. .వీరందరినీ సంబంధిత కోర్టుల్లో హాజరుపరుస్తామని ఆయన చెప్పారు.

9 Al Qaeda Terrorists Arrested by NIA

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News