Sunday, April 28, 2024

950 మంది వైద్యుల నియామకం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో 950 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల ఫలితాలు సోమవారం విడులయ్యాయి. తెలంగాణ వైద్యారోరోగ్య శాఖ చరిత్రలో కేవలం ఆరు నెలల్లోనే 950 సివిల్ అసిస్టెంట్ సర్జన్ రెగ్యులర్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ తుది ఫలితాలు వెల్లడించింది. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగాన్ని పటిష్టం చేయడంలో భాగంగా ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకుండా భర్తీ చేసే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది.

రాష్ట్రంలో 90 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటనలో భాగంగా సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్ జారీ చేసి, భర్తీ ప్రక్రియను పూర్తి చేసింది. ఇందులో డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (డిపిహెచ్‌అండ్‌ఎఫ్‌డబ్ల్యు) పరిధిలో 734 పోస్టులు, తెలంగాణ వైద్యవిధాన పరిషత్ (టివివిపి) పరిధిలో 209 పోస్టులు, ఐపిఎం పరిధిలో 7 పోస్టులు ఉన్నాయి.

అత్యంత పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ

రాష్ట్రంలో 950 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు మెడికల్ రిక్రూట్‌మెట్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చిన ఆరు నెలల్లోనే ఎంపిక ప్రక్రియ పూర్తి చేసింది. రాత పరీక్ష లేకుండా, నేరుగా మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం విశేషం. ఎంపిక ప్రక్రియ ప్రతి దశలోనూ అత్యంత పారదర్శకంగా సాగింది. డిసిహెచ్, టివివిపి, ఐపిఎం పరిధిలో 969 పోస్టుల భర్తీకి ఈ ఏడాది జూన్ 15వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,803 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించి గత నెల 9వ తేదీన మెడికల్ రిక్రూట్‌మెంట్ ప్రాథమిక మెరిట్ జాబితాను విడుదల చేసి, అభ్యంతరాలను స్వీకరించింది. అభ్యర్థుల పూర్తి వివరాలతో సమగ్ర జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం గత నెల 20వ తేదీన రెండో మెరిట్ లిస్ట్‌ను విడుదల చేసింది. గత నెల 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి, 950 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తూ సోమవారం ఫలితాలను విడుదల చేసింది.

కొత్త వైద్యులకు స్వాగతం పలికిన మంత్రి- హరీశ్‌రావు

రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందించేందుకు ఎంపికైన వైద్యులకు కొత్తగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్వాగతం పలికారు. మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు 950 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు సెలక్షన్ లిస్ట్ విడుదల చేసిందని పేర్కొంటూ మంత్రి ట్వీట్ చేశారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో ఆరోగ్య తెలంగాణ లక్ష్య సాధనలో ఇది మరో ముందడుగు అని వ్యాఖ్యానించారు. వైద్యుల ఎంపిక ప్రకియ పూర్తి పారదర్శకంగా, సాఫీగా పూర్తి చేసిన మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డును మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా ఎంపికైన కొత్త వైద్యులకు మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News