Tuesday, May 7, 2024

త్వరలో తప్పుకుంటా

- Advertisement -
- Advertisement -

Uttamkumar

 

పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటన

హైదరాబాద్ : రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. పిసిసి అధ్యక్ష పదవి నుంచి త్వరలో తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ ప్రకటనతో పార్టీ వర్గాలు ఒక్కసారిగా విస్మయానికి లోనయ్యాయి. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సమరోత్సహాంతో సమాయత్తం అవుతున్న సమయంలో ఉత్తమ్ చేసిన ప్రకటన ఆ పార్టీలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.

మంగళవారం హుజూర్‌నగర్‌లో మున్సిపల్ ఎన్నికలకు సమాయత్త పరిచే సమావేశానికి హాజరైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ శ్రేణులు ఆశ్చర్య పడే ప్రకటన చేసి అందరికి షాక్ నిచ్చారు. రాష్ట్రంలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలుకుని నిన్నటి హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నిక వరకు కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలు కావడంతో ఉత్తమ్ ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి రెండు నెలల క్రితం హుజూర్‌నగర్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన తన భార్య ఉత్తమ్ పద్మావతిని బరిలోకి దించినప్పటికీ విజయాన్ని మాత్రం అందుకోలేక పోయారు. అప్పుడే ఉత్తమ్ పిసిసి అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటారని రాజకీవర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. అలాగే పార్టీలోని పలువురు సీనియర్ నేతలు సైతం ఉత్తమ్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ కూడా చేశారు.

కానీ ఎఐసిసి నాయకత్వం మాత్రం పిసిసి అధ్యక్షునిగా ఉత్తమ్‌నే కొనసాగించింది. మరోవైపు ఈ నెల 22న రాష్ట్రంలోని 10 కార్పొరేషన్లకు, 120 మున్సిపాలిటీలకు ఎన్నికలకు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకుని కాంగ్రెస్‌కు తిరిగి పూర్వవైభవం తీసుకరావాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఉత్తమ్‌కుమార్ చేసిన ప్రకటన ఒక్కసారిగా పార్టీ వర్గాలను తీవ్ర గందరగోళానికి దారీతీస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పటికిప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతల నుంచి తప్పుకోవడం వల్ల కొత్త సమస్యలు వస్తాయని భావించిన కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యేంతవరకు పదవిలో కొనసాగిస్తుందా? లేక మరో నాయకుడికి బాధ్యతలు అప్పగిస్తారా? అన్నది ప్రస్తుతం ఆ పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది.

ఇదిలా ఉండగా కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు, నాయకుల పనితీరుపై ఉత్తమ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ నిబంధనలను విరుద్దంగా ఉందని, దీనిపై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు ఉత్తమ్ పేర్కొన్నారు. ఈ ప్రకటనపై టిఆర్‌ఎస్ నాయకులు, మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు ఉత్తమ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. ఎన్నికలకు భయపడే ఉత్తమ్ కోర్టును ఆశ్రయిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. అయితే టిఆర్‌ఎస్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ పక్షాన ఎవరూ స్పందించకపోవడం కూడా ఉత్తమ్‌ను తీవ్రంగా కలిచివేసింది. ఇదే అంశాన్ని ఇటీవల జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ, తన ఆవేదనను వ్యక్తం చేశారు. తనపై ఆరోపణలు వస్తే పిసిసి పక్షాన ఎవరూ ఖండించరా? అని నిలదీసిన విషయం తెలిసిందే.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు దిగజారుతుండడం, ఎంఎల్‌ఎ, ఎంపి ఎన్నికల నుంచి స్థానిక సంస్థల ఎన్నికల వరకు పార్టీ ఘోర పరాజయం పాలు అవుతుండడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకునే ఉత్తమ్ పిసిసి అధ్యక్ష పదవి నుంచి సాధ్యమైనంత త్వరగా తప్పుకోభాలని భావుస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా పిసిసి అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్‌లో ఎప్పుడే నేతల ప్రయత్నాలు సైతం మొదలయ్యాయని తెలుస్తోంది. ఈ జాబితాలో రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జానారెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు వంటి నేతలు ముందు వరసలో ఉన్నారని కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది.

Uttamkumar said Will quit the PCC presidency
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News