Thursday, May 2, 2024

రాజ్యాంగం x మతాచారాలు

- Advertisement -
- Advertisement -

Sabarimala case

 

అత్యంత వివాదాస్పదంగా మారిన కేరళ శబరిమల కేసు పరిధిని విస్తరింప చేసి తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన మరింత విస్తృత ధర్మాసనానికి అప్పగించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) జస్టిస్ బాబ్డే తీసుకున్న నిర్ణయం ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుంది? దేశంలో మత, మితవాద, పునరుద్ధరణ శీల ధోరణులు ఊహించనంతగా పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితులలో ఈ ప్రశ్నకు ఎక్కువ ప్రాధాన్యం కలుగుతున్నది. అయోధ్య కేసులో హిందుత్వ వాదులకు అనుకూల తీర్పు వచ్చిన నేపథ్యమూ ఇక్కడ గమనించదగినది. శబరిమలలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పించాలన్నది ఒక్కటే కాకుండా దేశంలోని అన్ని మతాల్లో స్త్రీలపై గల ఆంక్షలన్నింటినీ పరిశీలనలోకి తీసుకుని మత విశ్వాసాలు, రాజ్యాంగ హక్కుల మధ్య గల వైరుధ్యంపై తీర్పు చెప్పాలని సుప్రీంకోర్టు సంకల్పించింది. దీనితో మసీదుల్లో మహిళలకు ప్రవేశ నిరాకరణ, బయటి వారిని పెళ్లి చేసుకునే పార్శీ స్త్రీలను వారి ఆలయాల్లోకి అడుగు పెట్టనీయకపోడం, దావూదీ బోహ్రాలలో ఆడవారి జననాంగాల సున్తీ వంటి మతాచారాలు సైతం ఈ కేసు పరిధిలోకి వచ్చాయి.

అంటే మొత్తంగా మహిళలకు రాజ్యాంగంలో గల సమానత్వ హక్కు, మత స్వేచ్ఛ అధికరణల వెలుగులో వీటి ఉచితాను చితాలను తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం సమీక్షించి నిర్ణయం ప్రకటించవలసి ఉంటుంది. కశ్మీర్‌కు సంబంధించి 370 అధికరణ రద్దు పైన, పౌరసత్వ సవరణ చట్టంపైన దాఖలయిన కేసుల కంటే ముందుగా ఈ వ్యాజ్యాన్ని పరిష్కరించాలని సుప్రీంకోర్టు సంకల్పించడం విశేషం. కీలకమైన ఆ రెండు కేసులూ పెండింగ్‌లో ఉండగా, దీనిని మరింత విస్తృత ధర్మాసనానికి అప్పగించడంలోని ఔచిత్యాన్ని ఇద్దరు సీనియర్ న్యాయవాదులు ప్రశ్నించినప్పుడు సిజెఐ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అంటే అయోధ్య కేసును రోజువారీ విచారణ ద్వారా 40 రోజుల్లో పరిష్కరించిన విధంగానే దీనిని కూడా తొందరగా తేలుస్తారని ఆశించవచ్చు. దేశంలో రాజ్యాంగం నిర్దేశిస్తున్న ప్రజాస్వామిక సూత్రాలకు ఆచరణలో గల మతపరమైన పలు విశ్వాసాలు, పద్ధతులకు మధ్య గల వైరుధ్యం గురించి వివరించి చెప్పనక్కర లేదు. ముఖ్యంగా మతాచారాల్లో స్త్రీ పురుషుల మధ్య పాటిస్తున్న తేడాలు మహిళల పట్ల ఇప్పటికీ అమలవుతున్న ఆధ్యాత్మిక వెలి విధానం విదితమే.

ఇలా రాజ్యాంగానికి మతాచారాలకు మధ్య నెలకొన్న వైరుధ్యం చెల్లుతుందా, చెల్లదా అనేది స్పష్టపడవలసి ఉంది. మత విధులకు రాజ్యాంగంతో సంబంధం లేని విధంగా స్వేచ్ఛ కల్పించాలా వాటిలో కోర్టులు జోక్యం చేసుకోకుండా చూడాలా, వాటిని కూడా సమానత్వ సూత్రానికి తల వొగ్గేలా చేయాలా అనేది విశదం కావలసి ఉంది. ఆలయాలు, మసీదులు, ఇతర ప్రార్థనా మందిరాలు రోడ్ల విస్తరణ తదితర జనహిత నిర్మాణాలకు అవరోధాలుగా మారడం కళ్లెదుటనున్నదే. కొన్ని సందర్భాలలో ప్రజావసరాల కోసం వాటిని వేరొక చోటికి ఉన్నవి ఉన్నట్టుగా తరలించడమో, మళ్లీ నిర్మించడమో జరుగుతున్నప్పటికీ అభ్యంతరాలు వ్యక్తమయిన సందర్భాల్లో అలాగే కొనసాగించక తప్పడం లేదు. సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చే తీర్పు ఈ అన్నింటిపై అన్ని మతాల వారూ పాటించవలసిన పద్ధతిని నిర్ణయించవలసి ఉంటుంది. తీర్పు విశ్వాసాలకు ప్రాధాన్యమిస్తుందా, మానవాభ్యుదయం దారిలో అవి అడ్డుగా ఉండరాదని స్పష్టం చేస్తుందా అనేది అత్యంత ఆసక్తికరం. శబరిమల అయ్యప్ప ఆలయంలో 800 సంవత్సరాలుగా అమల్లో గల రుతుస్రావ వయసు మహిళల ప్రవేశంపై నిషేధాన్ని ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు బెంచి 41 తేడా మెజారిటీ తీర్పు ద్వారా 2018లో కొట్టి వేసింది.

దీనిపై భారతీయ జనతా పార్టీ నుంచి, మత వ్యవస్థల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమయింది. శబరిమల వద్ద రణ రంగం వంటి పరిస్థితే తలెత్తింది. సుప్రీం తీర్పు అండతో ఆలయంలో ప్రవేశించడానికి ప్రయత్నించిన మహిళా ఉద్యమకారుల పై దాడులు కూడా జరిగాయి. తీర్పును కఠినంగా అమలు పర్చడంలో కేరళ సిపిఎం ప్రభుత్వం విఫలమయిందనే విమర్శలు వచ్చాయి. తీర్పుపై 65కి పైగా అప్పీలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిని విచారించిన ఐదుగురు న్యాయమూర్తుల మరో ధర్మాసనం తీర్పును కొట్టివేయకుండా కేసును ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి నివేదించింది. అన్ని మతాలలోని ఆచారాలు, పద్ధతులను సమీక్షించాలని సూచించింది. ఇప్పుడు సిజెఐ బాబ్డే తన అధ్యక్షతన తొమ్మిది మందితో బెంచిని నెలకొల్పారు. మానవ సమాజం ప్రధానంగా పురోగామి, పరిణామ శీలి, వేగాల తేడాలతోనైనా ముందడుగు వేయడమే ప్రధానంగా కదులుతుంది. మన రాజ్యాంగం కూడా ప్రగతికి ఫ్యూడల్ సమాజ అవశేషాల అవరోధాలను తొలగించుకుంటూ ముందుకు పోవడాన్నే ప్రోత్సహిస్తుంది. ఈ నేపథ్యంలో కొత్త ధర్మాసనం తీర్పుపై అంతటా ఆసక్తి రేకెత్తడం సహజం.

Sabarimala case which has become controversial
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News