Tuesday, May 21, 2024

సైకిల్‌పై దంపతులు వేయి కి.మీల ప్రయాణం

- Advertisement -
- Advertisement -

Couple

 

మనతెలంగాణ/హైదరాబాద్‌ : కూలీ పనుల కోసం ఒడిశా నుంచి తెలంగాణకు వలస వచ్చిన దంపతులు తిరిగి వారి స్వస్థలానికి చేరుకోవడానికి సైకిల్‌పై 1000 కిలోమీటర్లు ప్రయాణించారు. తొమ్మిది రోజుల కిందట సైకిల్‌పై బయలుదేరిన ఈ దంపతులు పోలీసుల చెక్‌పోస్టులు, సరిహద్దులు దాటుకుంటూ ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా లోని వారి ఇంటికి చేరుకునే క్రమంలో పోలీసులు వారిని పట్టుకొని క్వారంటైన్‌కు తరలించారు. మల్కాన్‌గిరి జిల్లా ఖైరాపుట్ మండలం సింధిగుడా గ్రామానికి చెందిన దంపతులు కొన్ని నెలల కిందట తెలంగాణలోని కరీంనగర్‌కు వలస వచ్చారు. లాక్‌డౌన్ కారణంగా అక్కడ పనులు నిలిచిపోవడం, చేయడానికి పనులేవీ లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఎలాగైనా ఇంటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. వారు పనిచేసే కాంట్రాక్టర్ దగ్గర రూ.7 వేలు తీసుకొని అందులోని రూ.5 వేలతో కొత్త సైకిల్ కొనుగోలు చేసి స్వగ్రామానికి బయలుదేరారు.

ఈ క్రమంలో 9 రోజుల పాటు సుమారు 1000 కిలోమీటర్లు ప్రయాణించిన దంపతులు శనివారం రాత్రి మల్కాన్‌గిరి జిల్లా గోవిందపల్లి చేరుకున్నారు. అక్కడ పోలీసులు వారిని అడ్డుకొని క్వారంటైన్‌కు తరలించారు. అన్ని కిలోమీటర్ల పాటు పోలీసులను దాటుకుంటూ వాళ్లు ఎలా వెళ్లగలిగారనేది ప్రశ్నార్థకంగా మారింది. లాక్‌డౌన్‌లో ఉపాధి లేక వలస కూలీలు స్వగ్రామాలకు చేరుకునే యత్నంలో పిల్లపాపలతో కాలినడకన వేల కి.మీ. దూరంలోని స్వస్థలాలకు బయలుదేరుతున్నారు. కాగా హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర బయల్దేరిన కొంత మంది వలస కార్మికులు ఆదివారం కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం బారినపడ్డారు. కాలినడకన బయల్దేరిన వీరిని మేడ్చల్ వద్ద ఓ డిసిఎం డ్రైవర్ వాహనంలోకి ఎక్కించుకోగా కామారెడ్డి చేరుకోగానే డిసిఎం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది వలస కార్మికులు గాయపడ్డారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమైయ్యారు. ఎక్కడికక్కడ వలస కూలీలకు భరోసా కల్పిస్తూ వారికి ఆశ్రయం కల్పిస్తున్నారు.

Couple traveling thousand km on Bicycle
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News