Thursday, May 2, 2024

ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు.?

- Advertisement -
- Advertisement -

Open Tenth and Inter examination cancel in Telangana

జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలను రద్దు చేసిన ఎన్‌ఐఒఎస్, రెండు రోజుల్లో అధికారిక ప్రటకన

హైదరాబాద్ : రాష్ట్రంలో ఒపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు కానున్నాయి. జాతీయ స్థాయిలో జాతీయ సార్వత్రిక పాఠశాల సంస్థ (ఎన్‌ఐఒఎస్) నిర్వహించే సెకండరీ, సీనియర్ సెకండరీ కోర్సుల పరీక్షలన్నింటిని రద్దు చేస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకోగా, రాష్ట్రంలో తెలంగాణ ఒపెన్ స్కూల్ సొసైటీ(టిఒఎస్‌ఎస్) నిర్వహించే ఒపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చిలో ఎన్‌ఐఒఎస్ పరీక్షలు ప్రారంభం జరగాల్సి ఉండగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాటిని జులై 17కి వాయిదా వేశారు. ఇప్పట్లో మహమ్మారి అదుపులోకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఎన్‌ఐఒఎస్‌ను పరీక్షలను అనుసరిస్తూ ఏప్రిల్ నెలాఖరులో జరగాల్సిన టిఒఎస్‌ఎస్ ఒపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలను వాయిదా వేశారు. కరోనా కేసులు తగ్గి సాధారణ పరిస్థితులు తలెత్తిన తర్వాత పరీక్షలు నిర్వహించాలని ఇప్పటివరకు అధికారులు ఆలోచించారు. అయితే రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో తాజాగా ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా వేశారు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఎన్‌ఐఒఎస్ పరీక్షలు రద్దు కావడంతో పాటు రాష్ట్రంలో జరగాల్సిన ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల రద్దు నేపథ్యంలో ఒపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలను కూడా రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి.

రెండు రోజుల్లో నిర్ణయం

ఒపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల రద్దుపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఎన్‌ఐఒఎస్ పరీక్షల రద్దు నేపథ్యంలో సోమవారం టిఒఎస్‌ఎస్ అధికారులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ స్పెషల్ సిఎస్ చిత్రా రామచంద్రన్ తదితరులతో చర్చించి అనంతరం ప్రభుత్వానికి నివేదించనున్నారు. ప్రభుత్వం నిర్ణయం మేరకు పరీక్షలపై అధికారిక ప్రకటన వెలువడనుంది. పరీక్షలు రద్దు చేసి ఎన్‌ఐఒఎస్ అనుసరించిన విధానంలో విద్యార్థులను పాస్ చేయనున్నట్లు తెలిసింది. గతంలో ఆయా అభ్యర్థులు రాసిన పరీక్షల్లోని మార్కులను ఆధారంగా చేసుకొని వారిని ఉన్నత తరగతులకు ఎన్‌ఐఒఎస్ నిర్ణయించింది.

నాలుగు సబ్జెక్టులు రాసిన వారికి మెరుగైన మార్కులు వచ్చిన మూడు సబ్జెక్టుల మార్కులను, మూడు సబ్జెక్టులు రాసిన వారికి రెండింటిని, రెండు, ఒకటి సబ్జెక్టుల పరీక్షలు రాసిన అభ్యర్థుల విషయంలో థియరీలో వారు చూపిన ప్రతిభ ఆధారంగా మార్కులు కేటాయించనున్నట్లు వెల్లడించారు. పరీక్షలు రాయని వారు, మొదటి సారి కోర్సుల్లో ప్రవేశించిన వారి విషయంలో ట్యూటర్ల మార్కులు, ఏవైనా ప్రాక్టికల్స్‌కు హాజరైతే వాటి మార్కులను పరిగణలోకి తీసుకుని మార్కులు కేటాయించాలని నిర్ణయించారు. ఇదే విధానాన్ని రాష్ట్రంలోని ఒపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల విషయంలో అనుసరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

75 వేల మందికి ప్రయోజనం

ఒపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ఏడాదిలో రెండు సార్లు నిర్వహిస్తారు.ఈ ఏడాది ఏప్రిల్‌లో జరగాల్సిన పరీక్షలకు ఒపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలకు కలిపి సుమా రు 75 వేల మంది విద్యార్థులు ఫీజులు చెల్లించారు. ఒపెన్ టెన్త్ పరీక్షలకు సుమారు 40 వేల మంది విద్యార్థులు ఫీజులు చెల్లించగా, ఒపెన్ ఇంటర్‌కు సుమారు 35 వేల మంది ఫీజులు చెల్లించారు. ప్రభుత్వం ఒపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తే ఈ విద్యార్థులందరికీ ప్రయోజనం చేకూరనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News