Tuesday, May 21, 2024

రాహుల్ గాంధీ ఎన్నికపై పిటిషన్ కొట్టివేత

- Advertisement -
- Advertisement -

Petition on election of Rahul Gandhi dismissed

 

సరితా నాయర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నిర్ణయం

న్యూఢిల్లీ: కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. రాహుల్ గాంధీ ఎన్నికను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన సరితా ఎస్ నాయర్ తరఫున కోర్టులో ఎవరూ హాజరుకాకపోవడంతో తొలుత ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ ఎస్‌ఎ బాబ్డే, జస్టిస్ ఎఎస్ బోపన్న, జస్టిస్ వి రామసుబ్రమణిన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. అయితే, ఆ తర్వాత వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారణ జరిపిన ధర్మాసనం కేరళ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.

వయానాడ్, ఎర్నాకుళంలో లోక్‌సభ ఎన్నికలను సవాలు చేస్తూ సరితా నాయర్ దాఖలు చేసిన పిటిషన్లను 2019 అక్టోబర్ 31న కేరళ హైకోర్టు కొట్టివేయగా ఈ తీర్పును సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేరళలో జరిగిన సోలార్ పవర్ కుంభకోణానికి సంబంధించి రెండు క్రిమినల్ కేసులలో దోషిగా శిక్ష పడిన కారణంగా వయనాడ్, ఎర్నాకుళం లోక్‌సభ స్థానాలలో పోటీచేసేందుకు ఆమె వేసిన నామినేషన్ పత్రాలను 2019లో రిటర్నింగ్ అధికారులు తోసిపుచ్చారు. ఈ రెండు క్రిమినల్ కేసులలో ఆమెకు విధించిన శిక్షను నిలిపివేయని కారణంగా ఆమె నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులు తిరస్కరించడం సబబేనని పేర్కొంటూ హైకోర్టు ఆమె పిటిషన్లను కొట్టివేసింది. తీర్పుల అమలును మాత్రమే సుప్రీంకోర్టు నిలిపివేసింది తప్ప శిక్షను రద్దు చేయలేదని హైకోర్టు అప్పట్లో స్పష్టం చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News