Thursday, May 2, 2024

అదనపు రుణం తీసుకునేందుకు తెలంగాణకు కేంద్రం అనుమతి

- Advertisement -
- Advertisement -

అదనపు రుణం తీసుకునేందుకు రాష్ట్రానికి కేంద్రం అనుమతి
సులభతన వాణిజ్యంలో సంస్కరణలు అమలు చేసినందుకుగానూ ఈ వెసలుబాటు
తెలంగాణ రూ.2,508 కోట్ల రుణం పొందడానికి లభించిన సౌకర్యం

Center Allows additional borrow to Telangana

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి అదనపు రుణం పొందేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. సులభతర వాణిజ్యానికి సంబంధించిన సంస్కరణలను అమలు చేసిన రాష్ట్రాలకుగానూ అదనపు రుణం తీసుకునేందుకు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో సహా మొత్తం 5 రాష్ట్రాలకు అదనపు రుణాలు పొందడానికి అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు కలిపి మొత్తంగా రూ. 16,728 కోట్ల మేర అదనపు రుణం పొందనున్నాయి.
ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాలు ఉన్నాయి. కేంద్రం ఇచ్చిన వెసలుబాటుతో బహిరంగ మార్కెట్‌లో అదనపు రుణాలు తీసుకోనున్నాయి. కేంద్రం అనుతించిన మొత్తంలో తెలంగాణ రాష్ట్రం రూ. 2508 కోట్ల రుణం పొందనుండగా, ఆంధ్రప్రదేశ్ రూ. 2,525 కోట్లు తీసుకోనుంది. మిగిలిన మొత్తాన్ని మూడు రాష్ట్రాలు రుణంగా పొందనున్నాయి. సులభతర వాణిజ్య సంస్కరణల్లో భాగంగా జిల్లాస్థాయి వాణిజ్య సంస్కరణ కార్యాచరణ ప్రణాళిక మొదటి మదింపు పూర్తి చేసినందుకు కేంద్రం ఈ సౌకర్యం కల్పించింది. ఈ ఏడాది మే నెలలో సులభతర వాణిజ్యానికి సంబంధించిన సంస్కరణలను, అదనపు రుణ సేకరణతో అనుసంధానం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో ప్రధానంగా ఒకే దేశం..ఒకే రేషన్, పట్టణ స్థానిక సంస్థలు, విద్యుత్ రంగ సంస్కరణలు ఉన్నాయి. కేంద్రం పేర్కొన్న సంస్కరణల్లో భాగంగా జిల్లా స్థాయిలో వాణిజ్య సంస్కరణ కార్యాచరణ ప్రణాళిక తొలి అంచనాను పూర్తి చేయడం, వివిధ కార్యకలాపాల కోసం వ్యాపారులు పొందిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, అప్రూవల్స్, లైసెన్సుల పునరుద్ధరణ అవసరాల తొలగింపు వంటి అంశాలు ఉన్నాయి.
ఈ సంస్కరణలను ఈ ఐదు రాష్ట్రాలు పూర్తి చేయడంతో బహిరంగ మార్కెట్ల ద్వారా రూ.16,728 అదనపు ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో కోవిడ్ మహమ్మారి కారణంగా రాష్ట్రాలకు రాబడి పూర్తిగా మందగించింది. ఈ నేపథ్యంలో అదనపు నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరగా, ఫిజికల్ రెస్పాన్సిబులిటీ, బడ్జెట్ మేనేజ్‌మెంట్ (ఎఫ్‌ఆర్‌బిఎం) చట్టం ప్రకారం నిర్ధేశించిన 3 శాతం పరిమితికి మించి, రాష్ట్రాల రుణ పరిమితిని స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జిఎస్‌డిపి)లో 2 శాతం పెంచాలని కేంద్రం మేలో నిర్ణయించింది. ఈ ప్రయోజనాలను పొందడానికి 2020 ఫిబ్రవరి 15 నాటికి వన్ నేషన్, వన్‌రేషన్ కార్డ్ వ్యవస్థ అమలు, వ్యాపార సంస్కరణలు చేపట్డడం, పట్టణ స్థానిక సంస్థ, వినియోగ సంస్కరణలు, విద్యుత్ రంగ సంస్కరణలు వంటి నాలుగు నిర్ధిష్ట సంస్కరణలను రాష్ట్రాలు విధిగా పూర్తి చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను ఐదు రాష్ట్రాలు విజయవంతంగా పూర్తి చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ వెసలుబాటు కల్పించింది. అలాగే జిఎస్‌డిపిలో ఇప్పుడున్న రుణ పరిమితి 3 శాతాన్ని 5 శాతానికి పెంచింది. ప్రభుత్వ పాలన, ఖర్చులు, ఉద్యోగుల వేతనాలు, ఫించన్లకు కేంద్రం నుంచి ఎటువంటి సాయం అందకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు తప్పని పరిస్థితి ఎదురవుతోంది. గత ఆర్ధిక సంవత్సరం ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం మూడు శాతం కంటే అదనంగా రూ.1435 కోట్ల అప్పును ప్రభుత్వం తీసుకుంది. ఈ సారి కూడా కరోనా కారణంగా దాదాపు ఐదు నెలలు తీవ్ర మాంద్యం కారణం ఆర్ధిక రాబడి పూర్తిగా తగ్గిపోయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌లో మూడు శాతానికి అదనంగా మరో రెండు శాతం అదనపు వనరులను సమీకరించుకునేందుకు ఆమోదముద్రవేసింది. దీనికి అసెంబ్లీలో కూడా ఆమోదం తెలిపి బిల్లుగా మార్చుకున్న విషయం తెలిసిందే.
ప్రస్తుత సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నుంచి ఆ ఆర్డినెన్స్ అమలులోకి రావడంతో రెండు శాతం అదనపు అప్పులకు మార్గం సుగమం అయింది. కాగా ఈ రెండు శాతం అప్పులకు కేంద్రం విధించిన కఠిన షరతులకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ప్రస్తుతానికి రాష్ట్ర జిడిపిలో 3.25శాతం మేర రుణాలు తీసుకోవడానికి ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితి ఉండగా, తాజాగా ఐదు శాతానికి పెరిగింది. ఇందులో గత ఏడాది రాష్ట్ర జిడిపి రూ. 9.69 కోట్లలో కేంద్రం అంగీకారం మేకు రూ.48వేల కోట్లు రుణంగా పొందే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా కేంద్రం అనుమతించిన అదనపు 2 శాతం రుణ సేకరణకు పలు షరతులను విధించింది. ఇందులో 0.50 శాతానికి ఎటువంటి షరతులు లేకుండా మినహాయింపు ఇచ్చింది. ఆ తరువాత 1.5 శాతానికి ఏడు రకాల షరతులు విధించింది. ఇందులో ఒకటి ఎక్కువ జిఎస్‌డిపి సాధిస్తూ తక్కువ లోటును కలిగి ఉండడం, వలస కార్మికుల సంశ్రేమానికి చర్యలు తీసుకుంటూనే ఆహార పంపిణీలో లొసుగులు నివారించడం, పెట్టుబడుల ద్వారా అదనపు ఉపాధి అవకాశాల కల్పన, రైతుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ, విద్యుత్ రంగంలో స్వాలంబన, పట్టణాభివృద్ధి, ఆరోగ్యం, పారిశుద్ధం తదితర రంగాలను ప్రొత్సహించడం వంటి సంస్కరణలను అమలు చేస్తో ఒక్కో అంశానికి 0.25 శాతం చొప్పున 1 శాతం రుణం సేకరించేందుకు కేంద్రం ఆమోదించిన విషయం తెలిసిందే.

Center Allows additional borrow to Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News