Saturday, May 18, 2024

టీకా తయారీ సంస్థలను ప్రభుత్వమే రక్షించాలి

- Advertisement -
- Advertisement -

Vaccine manufacturers must be protected from lawsuits: Poonawalla

 

సీరం ఇన్‌స్టిట్యూట్ సిఇఓ పూనావాలా కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: టీకా తయారీదారులకు న్యాయపరమైన రక్షణను ప్రభుత్వాలే కల్పించాలని ప్రముఖ వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సిఇఓ అదర్ పూనావాలా అన్నారు. ముఖ్యంగా మహమ్మారి సమయంలో సంస్థలపై దాఖలయ్యే కేసుల విషయంలో సర్కార్ అండగా నిలవాలని కోరారు. వర్చువల్ విధానంలో శనివారం జరిగిన ‘ కార్నెగీ ఇండియా గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్‌”లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ అభివృద్ధిలో ఎదురయ్యే సవాళ్లపై చర్చ సందర్భంగా పూనావాలా ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆరోపణల కారణంగా ప్రజల్లో అనవసర భయాందోళనలు తలెత్తుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది వ్యాక్సినేషన్.. తద్వారా కరోనా కట్టడికి పెద్ద అవరోధంగా మారే ప్రమాదముందన్నారు. అలాగే తయయారీ సంస్థలు టీకా ఉత్పత్తినుంచి తప్పుకునే పరిస్థితులు ఎదురవుతాయన్నారు. ఇదే జరిగితే ఆయా సంస్థలు దివాలా తీసే ప్రమాదం కూడా ఉందన్నారు.

ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం జోక్యం చేసుకుని టీకా తయారీ సంస్థలకు రక్షణ నివ్వాలని పూనావాలా కోరారు. ఇలాంటి న్యాయపరమైన చిక్కులనుంచి సంస్థలను రక్షించేందుకు ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకు రావలసి ఉందన్నారు. తద్వారా టీకా తయారీ సంస్థలు ఉత్పత్తి, పంపిణీ వంటి కీలక అంశాలపై మాత్రమే దృష్టి పెట్టడానికి వీలవుతుందన్నారు. వాస్తవానికి అమెరికా ఇప్పటికే ఇలాంటి చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా కలిసి రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్ మూడో దశ ట్రయల్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.‘ కోవి షీల్డ్’ పేరిట ఇస్తున్న ఈ టీకాతో తనలో దుష్ప్రభావాలు తలెత్తాయంటూ చెన్నైకి చెందిన ఓ వలంటీర్ సీరం ఇన్‌స్టిట్యూట్‌కు లీగల్ నోటీసు పంపాడు. అయితే అవన్నీ అవాస్తవాలని.. ఆయనలో తలెత్తిన దుష్ప్రభావాలకు , వ్యాక్సిన్‌కు ఎలాంటి సంబంధం లేదని సీరం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పూనావాలా ఈ వ్యాఖ్యలు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News