Wednesday, May 1, 2024

రాజకీయ రణ‘తంత్రం’గా మన ప్రజా ‘గణతంత్రం’!

- Advertisement -
- Advertisement -

72 Republic day celebrations

నేను పుట్టి – పెరిగిందీ, చదువుకున్నదీ అంతా పల్లెటూర్లోనే కావడం వల్ల నాకు చాలాకాలం వరకూ ‘జనవరి 26న రిపబ్లిక్-డే’ అంటే కేవలం ఒకరోజు సెలవు, లేదంటే స్కూల్లో జెండా ఎగరవేసి, చాక్లేట్లు పంచిపెట్టే రోజుగా మాత్రమే గుర్తుండేది. అప్పట్లో వివరంగా, ఆసక్తికరంగా చెప్పే టీచర్లు పల్లెల్లో చాలా అరుదుగా మాత్రమే ఉండేవారు. ‘ఆగష్టు 15వ ఇండిపెండెన్సు-డే‘ మాత్రం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన స్వతంత్ర దినోత్సవం రోజుగా చాలా బాగా గుర్తుండేది. ఒక్క రిపబ్లిక్- డే విషయంలోనే పెద్దయ్యేవరకూ కొంచెం జ్ఞానం తక్కువగా ఉండేది. ఈ సంవత్సరం మనం 72వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. భారతదేశంలో పవిత్ర భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినరోజు ఈ గణతంత్ర దినోత్సవం జనవరి 26నే ఇందుకు ఎంచుకోవడానికి ఒక చారిత్రకమైన ఒక కారణం ఉంది. 1930లో భారత జాతీ య కాంగ్రెస్ ’పూర్ణ స్వరాజ్’్ ని ఆ రోజే ప్రకటించినదట. అందుకు సంపూర్ణ స్వరాజ్యమైన రాజ్యాం గం అమలు ఈ రోజునే చేయాలని మన పెద్దలు నిర్ణయించారు.

రాజ్యాంగం అనేది ప్రభుత్వం యొక్క విధానం. ఈ రాజ్యాంగంలో చట్టాలు, ప్రభుత్వాలు నడుచుకునే విధానాలు, ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగపరమైన విధులు-విధానాలూ పొందుపరచబడి వుంటాయి… ప్రతి దేశానికి ప్రభుత్వమనేది సర్వసాధారణం. ప్రతి ప్రభుత్వానికి రాజ్యాంగం అనేది అతి ముఖ్యమైంది. ప్రభుత్వం శరీరమైతే, రాజ్యాంగం దాని ఆత్మ లాంటిది. ప్రభుత్వాలకు దిశా-నిర్దేశాలు చూపించేదే ఈ రాజ్యాంగం. మన భారతదేశం ప్రపంచం లోనే ఒక అత్యంత అరుదైన ’సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం’ భారతీయులు పవిత్ర రాజ్యాంగం ద్వారా తమకు తాము అందివ్వదలచిన ’స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం’ పట్ల తమ అంకితభావాన్ని, నిబద్ధతను, దీక్షనూ ప్రకటించుకున్నారు.

సూక్ష్మంగా భారతీయలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ; ఆలోచనా స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ, మతావలంబన స్వేచ్ఛ; హోదా లోనూ, అవకాశాలలోనూ ప్రజలందరికీ సమానత్వం; వ్యక్తి గౌరవం పట్ల నిష్ఠ, దేశ సమైక్యత సమగ్రతల పట్ల నిష్ఠ, సౌభ్రాతృత్వం, నిబద్ధత, అంకితభావం మన పవిత్ర రాజ్యాంగ ఉదేశ్యం – ముఖ్య లక్ష్యం, లక్షణం.ఒక మహా యజ్ఞం లాగా సాగిన ప్రపంచం లోనే అతి పెద్దదైన మన రాజ్యాంగ రూపకల్పన లో బ్రిటన్, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, రష్యా, జర్మనీ, జపాన్, సౌత్ ఆఫ్రికా, ఫ్రాన్సు… వంటి ఎన్నో దేశాల రాజ్యాంగాల నుండి ఎన్నోకీలక, ముఖ్యమైన అంశాలు గ్రహించి- పరిగ్రహించి మరీ ఎక్కడా రాజీపడకుండా రూపొందించారు. ప్రపంచంలో ఎందరోచరిత్రకారులు ’బ్యాగ్ ఆఫ్ బారోయింగ్స్’ అని మన రాజ్యాంగాన్ని విమర్శించినా వెఱవక మన పెద్దలు భారతప్రజల ఉజ్జ్వల భవిష్యత్తు కోసం మూడేళ్లు అహోరాత్రమూ ఎంతో శ్రమించి- శ్రమకోర్చి మన చారిత్రక రాజ్యాంగాన్నిగ్రంధస్థం చేశారు.‘వ్రతం చెడ్డా – ఫలితం దక్కిందని‘ సామెత…! కానీ ఎందరో పెద్దలు, మరెందరో మహానుభావులు ఎన్నో కష్టాలకోర్చి సాధించిన మన స్వాతంత్రం, ఎంతో శ్రమకోర్చి, మరెంతో ఉన్నత లక్ష్యాలతో రూపొందించిన మన రాజ్యాంగ నిర్మాణ అసిధారా వ్రతం విజయవంతమయినా కూడా మన భారతీయులకు స్వాతంత్రం- రాజ్యాంగం యొక్క తీపి ఫలాలు – ఫలితాలు అందకుండా పోతున్నాయి. ఇది నిజం గా భారతీయులందరికి అందరికీ ఆవేదన – ఆందోళన కలిగిస్తున్నవిషయం.

‘సమ న్యాయం – సమ ధర్మం‘ అనే పరమ ధర్మం పునాదిగా ఏర్పరిచిన మన పవిత్ర రాజ్యాంగాన్ని కూడా మార్చి, ఏమార్చి, కొంచం-కొంచంగా మార్చి, పరిహసించి, అనుకూలం గా, అన్యాయంగా, అధర్మంగా, వాళ్ళు అనుకున్నట్టు ఎప్పటికప్పుడు మార్చేసి తమ స్వప్రయోజనాల్ని, స్వార్ధ ప్రయోజనాల్ని నెరవేర్చుకొంటున్నారు కొందరు నీచ- నికృష్ట రాజకీయనాయకులు… సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమైన మన పవిత్ర భారత దేశం లో కొంతకాలంగా ప్రాంతీయ, రాష్ట్రీయ, సాంఘిక, ఆర్ధిక, రాజకీయ విభేదాలు పెరిగిపోతున్నాయి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పరమ లక్ష్యాలుగా, భారతదేశ జాతీయ సమైక్యతే పునాదిగా ఏర్పడ్డ మన పవిత్ర భారత రాజ్యాంగం సిద్ధాంతాలకు ఇది ఒక పెద్ద విఘాతం… స్వతంత్ర అత్యున్నత న్యాయ వ్యవస్థ కవచంగా, రాజ్యాంగ బద్ధంగా పనిచేసే శాసన, కార్యనిర్వహణ పాలనా వ్యవస్థలతో ముందుకు సాగవలసిన మన రాజ్యాంగ వ్యవస్థలు రాజకీయాల, రాజకీయనాయకుల చేతుల్లో కీలుబొమ్మలవడం చాలా దురదృష్టకరం, అవమానకరం, ఆందోళనకరం.

చాలాకాలంగా రాజ్యాధికారమే లక్ష్యంగా, అధికారమే పరమావధి గా ఒక రాజకీయ రణ’తంత్రం’గా మారుతున్నది మన భారత ప్రజా ‘గణతంత్రం’.వ్యాపారవేత్తలతో పెనవేసుకున్న అక్రమ ఆర్ధిక అనైతిక సంబంధాలతో అవినీతికి, అక్రమార్జనకు, ఆశ్రీత పక్షపాతానికి అలవాటుపడ్డ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ప్రధాన రాజ్యాంగవిభాగాలైన భారత శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల్నిప్రభావితం చేస్తూండటం గమనార్హం!. కొందరు కుటుంబ పాలనతో, ఇంకొందరు తమ వ్యాపారాలకోసం, మరికొందరు తమ అధికార లాలసతో మొత్తమ్మీద అందరూ కూడా డబ్బు, పదవి, అధికారం కోసం ఎంతవరకైనా దిగజారుతూ భారత రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు. 150 కోట్లకు చేరువవుతున్న భారతీయులు ఏడు దశాబ్దాలకుపైగా ఎదురుచూస్తున్న స్వా తంత్రం- రాజ్యాంగం యొక్క తీపి ఫలాలు – ఫలితాలు ఇప్పటికీ ప్రజలకు అందకపోవడం ఎందరో మహనీయుల త్యాగాలకు, ఎందరో మహానుభావుల బలిదానాలకు తీరని అవమానం.వారికి ఆత్మశాంతి కలగాలని ఈ 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన లౌకిక రాజ్యం లో ఉన్న అందరు లౌకిక – అలౌకిక దేవుళ్లందరికీ అందరికీ పేరు పేరు నా ప్రార్ధిస్తూ… వేడుకొంటూ… నమస్కరిస్తూ…
జై హింద్ … భారత మాతకు జై…

పెన్మెత్స రవి ప్రకాష్ అశోక వర్మ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News