Tuesday, April 30, 2024

సాగు చట్టాలు- కార్పొరేట్ ప్రయోజనాలు

- Advertisement -
- Advertisement -

Farmers strike in delhi on New farm bill

2007 నుండి చిల్లర వర్తకంలోకి ప్రవేశించిన బడా కార్పొరేట్ శక్తులు ఏడెనిమిదేళ్ల తరువాత గ్రహించిన అనుభవం నుండి నిత్యావసర సరుకులు, వ్యవసాయ ఉత్పత్తుల నుండి పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించాలంటే వ్యవసాయ ఉత్పత్తులను తక్కువ ధరకు కొంటే తప్ప సాధ్యం కాదని తెలుసుకున్నాయి. పండించిన పంటలను అతి తక్కువ ధరలకు కొనాలంటే ప్రధాన ఆటంకం ఎపిఎంసిలే అని, అవి సరిగానే గ్రహించాయి. కనీస మద్దతు ధర అంశం అమలు అవుతున్నందునే చిల్లర వర్తకంలో కార్పొరేట్లకు అనుకున్నంత లాభాలు రావటం లేదు. కనుక చేయాల్సింది ఏమిటి?

దేశ వ్యవసాయరంగ సమస్యలపై, రైతు సంక్షేమ సమస్యలను అధ్యయనం చేయటం కోసం ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్. స్వామినాథన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన జాతీయ కమిషన్ 2004 -2006 మధ్య అధ్యయనాన్ని పూర్తి చేసి నివేదిక సమర్పించింది. దానిలోని ముఖ్యమైన సిఫారసులైన కనీస మద్దతు ధర, పెట్టుబడిపై 50 శాతం లాభం వంటి అంశాలే నేడు అనేక రైతు ఉద్యమాలకు లక్ష్యాలు అయ్యాయి. 2014లో అధికారం చేపట్టిన తరువాత రైతులకు పెట్టుబడి పై యాభై శాతం లాభం వంటి విధానాలు అమలు చేస్తామని ఇచ్చిన హామీ నీటి మూటే అయ్యింది. అది పోను 2016 వచ్చే సరికి లాభం సంగతి అటుంచి కనీస మద్దతు ధరను అమలు చేయటం కూడా క్రమంగా నీరు గార్చింది. ప్రస్తుతం రైతుకు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా పథకం ప్రకారం కనీస మద్దతు ధరను అమలు చేయకపోవటం, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను తగ్గించటం, ఉన్న కేంద్రాలలో సైతం కొనుగోళ్లు సరిగా చేయకపోవటం వెనుక గల ప్రయోజనం ఏమిటి? ఇది ఒక ఎత్తైతే కోవిడ్ మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ కాలంలో హడావిడిగా మూడు ఆర్డినెన్సులు చేయటం, వాటి ప్రభావిత వర్గాలతో ఎటువంటి చర్చలు చేయకపోవటం పార్లమెంటులో సైతం చర్చ లేకుండా వాటిని చట్టాలుగా మార్చటం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి?
చిల్లర వర్తకంలో సాధించగలిగే అధిక లాభాలు బడా పెట్టుబడిదారులకు ఎప్పుడూ నోరూరించే విషయమే. 1991 నుండి ప్రారంభమైన ఆర్ధిక సంస్కరణల నేపథ్యంలో వచ్చిన క్రమానుగత మార్పులు 2007 నాటికి బడా కార్పొరేట్ల దృష్టి చిల్లర వర్తకంపై పడేటట్లు చేసింది. అయితే చిల్లర వర్తకంలో అమ్మే వస్తువులను స్థూలంగా రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి పారిశ్రామిక ఉత్పత్తులు, రెండు వ్యవసాయ ఉత్పత్తులు. పారిశ్రామిక ఉత్పత్తులను టోకున చవక ధరకు కొనవచ్చు. అధిక ధరలకు అమ్మవచ్చు. బడా కార్పొరేట్లకు వచ్చిన చిక్కంతా వ్యవసాయ ఉత్పత్తులతోనే. ముందే చెప్పినట్లు 2007 నుండే అంబానీలు, టాటా, బిర్లాలతో పాటు రహేజా గ్రూపు , ఆర్‌పిజి గ్రూపు , ఫ్యూచర్ గ్రూపు కూడా చిల్లర వర్తకం లోకి పెద్ద ఎత్తున ప్రవేశించాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తుల వ్యాపారంలో ఆర్జించినట్టుగానే పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించవచ్చునని వారికి ఆశ కలిగింది. అయితే ఇతర పారిశ్రామిక ఉత్పత్తుల ద్వారా కలిగే లాభాలు కిరాణా సరుకుల నుండి కూడా లభించాలంటే వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద మొత్తంలో చవక ధరకు కొనటం వీలయితే తప్ప సాధ్యం కాదు. అందువల్ల ఆచరణలో చాలా గ్రూపులు చిల్లర వర్తకంలో విఫలం చెందాయి. అందువల్లనే ఇతర పారిశ్రామిక ఉత్పత్తుల నుండి ఆర్జించిన కొద్ది పాటి లాభాలతోనే నెట్టుకొస్తున్నాయి. కొన్ని కంపెనీలు దివాలా తీశాయి కూడా. ఫ్యూచర్ గ్రూపు తన వాటాను మే 2012 లో ఆదిత్య బిర్లా గ్రూపుకు అమ్ముకోవాల్సి వచ్చింది.
2007 నుండి చిల్లర వర్తకంలోకి ప్రవేశించిన బడా కార్పొరేట్ శక్తులు ఏడెనిమిదేళ్ల తరువాత గ్రహించిన అనుభవం నుండి నిత్యావసర సరుకులు, వ్యవసాయ ఉత్పత్తుల నుండి పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించాలంటే వ్యవసాయ ఉత్పత్తులను తక్కువ ధరకు కొంటే తప్ప సాధ్యం కాదని తెలుసుకున్నాయి. పండించిన పంటలను అతి తక్కువ ధరలకు కొనాలంటే ప్రధాన ఆటంకం ఎపిఎంసి లే అని, అవి సరిగానే గ్రహించాయి. కనీస మద్దతు ధర అంశం అమలు అవుతున్నందునే చిల్లర వర్తకంలో కార్పొరేట్లకు అనుకున్నంత లాభాలు రావటం లేదు. కనుక చేయాల్సింది ఏమిటి?
ఎపిఎంసి లను నిర్వీర్యం చేయటమే. అధికారికంగా ప్రభుత్వపరంగా అమలవుతున్న ఎపిఎంసిల ద్వారా కొనుగోళ్లను నిలిపివేయటం, లేదా నిర్వీర్యం చేయటం చేయకుండా చిల్లర వర్తకంలోకి బడా కార్పొరేట్ల ప్రవేశం లాభసాటి కానేరదు. ఇలా కనీస మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలను మూసివేస్తే తక్షణ ఫలితంగా జరిగేదేమిటంటే సాధారణ రైతులకు వ్యవసాయం భారమవుతుంది. భారత దేశంలో సుమారు 80 % రైతులవి చిన్న కమతాలే. ఇలాంటి వారికి ఎంఎస్‌పి అనేదే లేకపోతే వ్యవసాయం ఎంతమాత్రం జరుగుబాటు ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తమ భూమిని సాగు చేసుకోవటం కంటే ఎవరికైనా కౌలుకు ఇవ్వటం మేలనే ఆలోచన రాకమానదు. ఈ పర్యవసానాన్నిగ్రహించి చేసిందే మొదటి వ్యవసాయ చట్టం. ఈ అవసరాన్ని తీర్చటం కోసమే, కార్పొరేట్లు అలాంటి భూములను కాంట్రాక్టు పద్ధతిలో చేజిక్కించుకోవటం కోసం ఉద్దేశించబడిందే ఈ చట్టం. ఇక ఇలా ఎపిఎంసి లను రద్దు చేయటం ద్వారా మిగిలే సొమ్మును వ్యవసాయాన్ని నిర్వహిస్తున్నందుకు కార్పొరేట్లకు రుణంగా ఇవ్వవచ్చు. రెండవ ఫలితంగా రైతులకు చేసే రుణ మాఫీ సొమ్మును కూడా పరిశ్రమలను స్థాపించినందుకు ఇచ్చినట్లుగానే వ్యవసాయానికి కూడా ప్రభుత్వ పూచీకత్తుతో రుణంగా పొందవచ్చు. ఇక కార్పొరేట్లు అన్నాక వారికి సరుకులు అమ్ముకునే అవుట్లెట్లు దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేసుకుంటేనే లాభం. మరి తాము కాంట్రాక్టు సేద్యం ద్వారా పండించిన పంట ఒక చోటి నుండి మరో చోటికి అంటే మరో అవుట్‌లెట్లకు చేరవేయాలంటే రైతులు తమ పంటల్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చనే సౌకర్యం చాలా ముఖ్యమైన అవసరంగా మారుతుంది.
దీని కోసం చేసిందే రెండో వ్యవసాయ చట్టం. ఇలా నేరుగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పటం కోసం చేసినవే మొదటి రెండు కొత్త చట్టాలు. అయితే కేవలం వ్యవసాయదారులు గాక వ్యవసాయ కూలీలు, నిరుపేదలు, దళితులూ ఉద్యమంలో పాల్గొనటానికి కారణం ఏమిటి? నిజానికి గుంత భూమిలేని నిరుపేదలకు కూడా ఈ వ్యవసాయ చట్టాలతో పెద్ద నష్టమే జరగబోతున్నది. మొదటి రెండు చట్టాల వల్ల కార్పొరేట్లకు కలిగే ప్రయోజనం, తాము కాంట్రాక్టు వ్యవసాయం ద్వారా పండించిన పంటలను తమ రిటైల్ అవుట్‌లెట్ల్లలో అమ్ముకోవటంతోనే పరిపూర్ణం అవుతుంది. అంటే వారి రిటైల్ అవుట్‌లెట్లలో అమ్ముకోవటానికి కావాల్సిన సరుకులను ఎంతైనా నిల్వ చేసుకుంటేనే ఇది సాధ్యపడుతుంది. కార్పొరేట్ల దుకాణాలలో సరుకుల కొరత ఉండకూడదంటే వారి గోదాములు ఎప్పుడూ నిండుగా ఉండాలి. సరిగ్గా అందుకోసం రూపొందించిందే మూడవ నిత్యావసర సరుకుల సవరణ చట్టం.
ఈ మూడు చట్టాల పర్యవసానాలు ఇలాగే ఉంటాయని అనుకోవటానికి బలాన్ని చేకూరుస్తూ, ఈ మూడు ఆర్డినెన్సులు చేసిన జూన్ 2020 కి నెల ముందు మే 7వ తేదీ 2020న దేశం మొత్తం లాక్‌డౌన్‌లో మునిగి ఉన్నప్పుడు అదానీ గ్రూపుకి చెందిన అదానీ అగ్రి లాజిస్టిక్స్ లిమిటెడ్ సంస్థకు వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు సుమారు 75000 టన్నుల సామర్థ్యం కలిగిన గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 22 ఎకరాల భూమిని (90015.323 చదరపు మీటర్లు) వాణిజ్యపరంగా వాడుకోవటం కోసం చేంజ్ అఫ్ ల్యాండ్ యూజ్ అనుమతి ఇచ్చింది. హర్యానా రాష్ట్ర డైరెక్టరేట్ అఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ నుండి అనుమతి పొందిందే తడవుగా అదానీ గ్రూపు అక్కడ గోదాముల నిర్మాణం చేపట్టింది. ఈ చట్టాల వల్ల జరగబోయే నష్టం పంజాబ్, హర్యానా రైతులకు తెలిసింది అందువల్లనే. భూములన్నీ, పంటలన్నీ కార్పొరేట్ల పరమైతే ప్రమాదమని, ఆహార భద్రతా కూడా ఉండదని అక్కడి రైతు సంఘాల నాయకత్వం కలిగించిన చైతన్యం వాళ్లవారికి పరిస్థితి తీవ్రత అర్థమైంది. నిజానికి కోవిడ్ లాక్‌డౌన్ కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ఒకే ఒక మంచిపని ఏదైనా ఉన్నదంటే అది ప్రజా పంపిణీ వ్యవస్థల ద్వారా నిరుపేదలకు తిండి గింజలు ఇవ్వటమే. ఎపిఎంసిల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసి నిల్వ చేయటం వల్లనే ఇది సాధ్యం అయింది. మరి ఎపిఎంసి లనేవే లేకపోతే ఆహార భద్రతా ఎలా అమలవుతుంది. ఈ విషయాన్ని తెలియజెప్పటం వల్లనే నిరుపేదలు, రైతుకూలీలు సైతం ఆందోళనలో పెద్ద ఎత్తున పాలు పంచుకుంటున్నారు. అంతేకాదు హర్యానాలోని పానిపట్ జిల్లాలోని ఇస్రానా తాలూకా నాథుల, జోందా గ్రామాల్లో పైన చెప్పిన గోదాముల నిర్మాణం కోసం మూడు సంవత్సరాలకు ముందే 2017లోనే ఎకరాకు ముప్పై లక్షల నుండి రెండు కోట్ల దాకా చెల్లించి ఇరవై రెండు ఎకరాల భూమిని అదానీ గ్రూపు కొనటం ఇప్పుడు వారి కనువిప్పుకు కారణమైంది. అయినా ఈ గోదాములు వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కోసం కాదని నిస్సిగ్గుగా అబద్ధం ఆడుతున్నది అదానీ గ్రూపు.
పంజాబ్ స్టేట్ ఫార్మర్స్ కమిషన్ అనే సంస్థ 2008లో చేపట్టిన అధ్యయనం ప్రకారం 89 % కమతాలు ఎప్పుడూ అప్పుల్లోనే ఉంటాయి. వ్యవసాయ రంగంలో సబ్సిడీలను ఎత్తివేయాలని, ప్రభుత్వం తిండి గింజలు మద్దతు ధర ఇచ్చి కొనకూడదని డబ్లుటిఒ ఒత్తిడికి వ్యతిరేకంగా ఆనాడే పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేపట్టిన అనుభవం పంజాబ్, హర్యానా రైతులకు ఉన్నది. ఆ అనుభవంతో వారు ఇప్పుడు రెండు రాష్ట్రాల రైతులనే కాదు మొత్తం దేశాన్నే మేల్కొలుపుతున్నారు. దేశాన్ని తెగ నమ్ముతున్న ‘దేశభక్త’ పాలకుల అసలు రంగును బయటపెడుతున్నారు. ఇప్పుడు ఢిల్లీ సరిహద్దులలో సమర భేరి మోగిస్తున్న రైతు బిడ్డలే దేశానికి దిక్కు.

టి. హరికృష్ణ 9494037288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News