Tuesday, April 30, 2024

ఇజ్రాయెల్ కొత్తకూటమి

- Advertisement -
- Advertisement -

Eight-party coalition in Israel to form new government

 

బెంజమిన్ నెతన్యాహు పన్నెండేళ్ల సుదీర్ఘ పాలనకు తెర దించే లక్ష్యంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇజ్రాయెల్‌లోని ఎనిమిది పార్టీల మధ్య ఏకీభావం కుదరడం విశేష పరిణామమే. కొత్తగా ఏకమైన ఎనిమిది పార్టీల కూటమి కప్పల తక్కెడను గుర్తుకు తెస్తున్నది. ఏ ఒక్క దానికీ మరొకదానితో పొసగదు. గత మార్చిలో జరిగిన ఎన్నికలలో పరస్పరం పడతిట్టుకొని ఎన్నటికీ కలవబోమని ప్రతిజ్ఞ చేసుకున్న పక్షాలు కూడా ఈ కూటమిలో పాలుపంచుకుంటున్నాయి. ఆ ఎన్నికల్లో మళ్లీ అస్థిర పార్లమెంటు (నెసెట్) అవతరించడంతో నెతన్యాహు పాలనకు ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని నెలకొల్పేందుకు ఇచ్చిన గడువు బుధవారం అర్ధరాత్రితో ముగిసిపోనుండగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఈ ఎనిమిది పార్టీలు చివరి క్షణంలో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో గతంలో నెతన్యాహు ప్రభుత్వం లో పని చేసిన కరడుగట్టిన మితవాద పక్షాలు, సెంట్రిస్టు, లెఫ్ట్ పార్టీలతో పాటు అక్కడి అరబ్బుల కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక గ్రూపు పార్టీ కూడా ఉంది. అరబ్బుల పార్టీ ఇజ్రాయెల్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండబోడం ఇదే మొదటిసారి.

గత రెండేళ్లలో నాలుగు ఎన్నికలను జరుపుకున్న ఇజ్రాయెల్ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీతో కూడిన పార్లమెంటును నెలకొల్పకోడంలో విఫలమైంది. అందుచేతనే 2009 నుంచి వరుసగా రెండు పదవీ కాలాలు పాటు ప్రధానిగా ఉన్న నెతన్యాహు తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ అదనంగా రెండేళ్లుగా అధికారంలో కొనసాగుతున్నాడు. అతడిని ఎలాగైనా గద్దె దించాలన్న దృఢ సంకల్పంతో ఈ పార్టీలు ఏకమయ్యాయి. అదొక్కటే ఈ కూటమిని నిలబెట్టగల అతుకు. మొన్నటి ఎన్నికల్లో నెతన్యాహు పార్టీ లికుడ్ తర్వాత 17 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఏష్ అకిడ్ పార్టీ అధినేత యాయిర్ ల్యాపిడ్ ఈ కూటమిని కూర్చడంలో ముఖ్యపాత్ర వహించారు. దేశాధ్యక్షుడు కూడా కొత్త ప్రభుత్వం ఏర్పాటు బాధ్యతను ఆయనకే అప్పగించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 60 (సగం) కి మించిన స్థానాలను కూడగట్టడం కోసం కేవలం ఏడే సీట్లు గెలుచుకున్న మితవాద యామినా పార్టీ సారథి, నాఫ్తాల్ బెన్నెట్‌ను ప్రధానిని చేయడానికి ల్యాపిడ్ అంగీకరించారు. అన్ని అరిష్టాలను దాటుకొని ఈ ప్రభుత్వం నిలదొక్కుకుంటే బెన్నెట్ మొదటి రెండేళ్ల కాలం ప్రధానిగా ఉంటారు.

అ తర్వాత ల్యాపిడ్ ఆ పదవిని స్వీకరిస్తారు. కొత్త ఐక్య సంఘటనలో ల్యాపిడ్ పార్టీతో పాటు ఆయన పూర్వ సహచరుడు గాంజ్ కు చెందిన బ్ల్లూ అండ్ వైట్ పార్టీ కూడా భాగస్వామిగా ఉంటుంది. గతంలో గాంజ్, ప్రధాని నెతన్యాహు ప్రభుత్వంలో చేరడానికి నిర్ణయించుకోడంతో ల్యాపిడ్ వేరైపోయి సొంత పార్టీ పెట్టుకున్నాడు. ఈ రెండు పార్టీలకు కలిసి ఇప్పటి పార్లమెంటులో 25 స్థానాలున్నాయి. యామినా, న్యూ హోప్, మెరెజ్, లేబర్, ఇజ్రాయెల్ బెల్టీని, అరబ్ ర్యామ్ పార్టీలు ఈ కూటమిలో కలిశాయి. వీటన్నింటి ఉమ్మడి బలమూ 61కి మించలేదు. అందుచేత ఈ కొత్త కూటమి పరిస్థితి గాలిలో దీపాన్నే తలపిస్తున్నది. ఈ కూటమి పార్లమెంటులో బల నిరూపణ చేసుకున్న తర్వాతే దాని ప్రభుత్వానికి పూర్తి స్థాయి ప్రాణం కలుగుతుంది. ఆలోగా ఇందులోని తన పూర్వ సహచరులకు గాలం వేసి ఈ కూటమిని చీల్చడంలో నెతన్యాహు నెగ్గితే మళ్లీ ఎన్నికలు జరిగే వరకు అతడి పాలనే కొనసాగుతుంది. పార్లమెంటు స్పీకర్ యారి లెవిన్ ప్రధాని నెతన్యాహు పార్టీ లికుడ్‌కి చెందిన వారు.

కొత్త కూటమి విశ్వాస పరీక్షను వీలైనంత ఆలస్యం చేసి ఆలోగా దానికి తూట్లు పొడిచే వీలును, అందులో నుంచి కొందరు సభ్యులను తన వైపు ఆకట్టుకునే అవకాశాన్ని నెతన్యాహుకు ఇవ్వగల స్థితిలో స్పీకర్ ఉన్నారు. లెవిన్ అదే కుట్ర పన్నుతున్నట్టు ల్యాపిడ్ ఇప్పటికే ఆరోపించారు. మితవాద పక్షాలైన యామినా, న్యూ చెందిన సభ్యులను బయటకు లాగడానికి నెతన్యాహు చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశాలు లేకపోలేదు. కొత్త ప్రధాని బెన్నెట్‌కు చెందిన యామినా పార్టీ సభ్యుడొకరు ఇప్పటికే తిరుగుబాటు జెండా ఎగురవేశాడు. మరొకరూ ఊగిసలాడుతున్నట్టు సమాచారం.

మితవాద ఓటర్లు ఎన్నుకున్న పార్లమెంటు సభ్యులందరూ ఈ ప్రమాదకరమైన వామపక్ష ప్రభుత్వాన్ని విశ్వాస పరీక్షలో ఓడించాలని నెతన్యాహు ఇప్పటికే ట్వీట్ చేశాడు. నెతన్యాహు పరిపాలన అంతా పాలస్తీనియులపట్ల ముష్కర దాడులతోనే కొనసాగింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ మద్దతుతో విర్రవీగింది. ఇటీవల పది రోజుల పాటు సాగిన దాదాపు యుద్ధాన్ని తలపించిన ఘర్షణలను కూడా నెతన్యాహు తాను నిరవధికంగా అధికారంలో కొనసాగడానికి ఉద్దేశించిన కుట్రలో భాగమేనని విమర్శలు వినవచ్చాయి. అయితే కొత్త ప్రభుత్వం మొదటి ప్రధాని బెన్నెట్ కూడా తీవ్ర మితవాదే. జోర్డాన్ పశ్చిమ తీరాన్ని కూడా ఇజ్రాయెల్ భూభాగంగా మార్చివేసి పాలస్తీనీయులను అక్కడి నుంచి తరిమికొట్టడమో ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చడమో జరగాలన్నది ఆయన ప్రకటిత ఆకాంక్ష. అందుచేత ఇజ్రాయెల్‌లో ఏ ప్రభుత్వం ఏర్పడినా పాలస్తీనా దురాక్రమణకు అంతరాయం కలగబోదని భావించవచ్చు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News