Wednesday, May 1, 2024

అనధికారిక చిట్టీలకు చెక్

- Advertisement -
- Advertisement -

New app called T chits in telangana

 ప్రజలకు మేలు చేసే విధానం అందుబాటులోకి…
చిట్టీల పేరిట ప్రజలు మోసపోకుండా రిజిస్ట్రేషన్ల శాఖ చర్యలు
టి చిట్స్ పేరుతో నయా యాప్

మనతెలంగాణ/హైదరాబాద్ : చిట్టీల పేరుతో ప్రజలు మోసపోకుండా రిజిస్ట్రేషన్ల శాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా దేశంలో ఎక్కడాలేని విధంగా పకడ్భందీ చర్యలకు శ్రీకారం చుడుతోంది. టి చిట్స్ పేరుతో నయా యాప్‌ను స్టాంపులు- రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు రూపొందించి పక్కాగా అమలు చేస్తున్నారు. ప్రజల సంక్షేమం, పౌరుల సొమ్ముకు రక్షణ కల్పించేలా దేశంలోనే తొలిసారిగా బ్లాక్‌చైన్ విధానంలో సరికొత్త సాంకేతికతతో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. చాలా చిట్‌ఫండ్ సంస్థలు మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో కొత్తగా ఈ శాఖ కఠిన నిబంధనలను రూపొందించింది. అంతేకాకుండా సకాలంలో సొమ్ములు చెల్లించేలా కీలక సిఫార్సులను ఇందులో చేర్చింది. గతంలో ఉన్న విధి, విధానాల్లో లోపాల కారణంగా అక్రమాలతో యథేచ్చగా ప్రజలకు కుచ్చుటోపీ పెడుతున్న చిట్‌ఫండ్ కంపెనీల మోసాలకు చెక్ పెట్టేలా ఈ వ్యవస్థను తీర్చిదిద్దింది.

అయితే కొత్తగా తీసుకొచ్చిన యాప్‌లో నమోదు కాగానే ఎన్ని చిట్లు నిర్వహిస్తున్నారు. ఇందులో ఎవరెవరు సభ్యులు, వారెంత చెల్లించారు, ఏఏ తేదీల్లో చెల్లించారు, చిట్టిని పాడిన వారెవరు, వారికి చెల్లించింది ఎంత, ఎప్పుడు కంపెనీ రిజిస్ట్రేషన్ జరిగింది, వారి ఖాతా, బ్యాంకు నిల్వ, ఆర్థిక వనరులు, ఎంత చిట్టీ నిర్వహిస్తే అంత మొత్తానికి ప్రభుత్వం వద్ద ఫిక్సిడ్ డిపాజిట్ చేసేలా అనేక వివరాలను ఇందులో పొందుపరిచేలా యాప్‌కు రూపకల్పన చేసింది. ఇప్పటికే ఈ యాప్‌లో (703 కంపెనీలు రిజిస్ట్రేషన్లు చేసుకోగా వాటికి చెందిన 1,422 బ్రాంచీలు రిజిస్టర్ అయ్యాయి. ఇంకా మరో 5 వేల కంపెనీలు కూడా త్వరలో రిజిస్ట్రేషన్ కానున్నట్టు ఆ శాఖ అధికారులు తెలిపారు. ఈ 703 కంపెనీలు 18,239 గ్రూపులతో చిట్టీలను నిర్వహిస్తున్నాయి. నెలకు దాదాపుగా వీరి టర్నోవర్ రూ.1,283కోట్లుగా నమోదయ్యింది. అయితే 18,205 గ్రూపులు ఆన్‌లైన్‌లో నమోదు కావడంతో క్షణాల్లో వాటి వివరాలు తెలుసుకునేలా ఈ యాప్‌ను రూపొందించడం విశేషం.

30 రకాల డాక్యుమెంట్లను ఇందులో

ఇన్నాళ్లూ చిట్టీల వ్యవహారంపై అధికారం లేకుండా పోయిన రిజిస్ట్రేషన్ల శాఖకు. ఇప్పుడు కొత్తగా రూపొందించిన యాప్‌తో ప్రజలకు మేలు చేసే అవకాశం విస్తృతమైంది. ఆడిటర్లు ఎవరు, సభ్యుల జాబితా, బిడ్ అథరైజేషన్ చెల్లింపుల వంటి సుమారు 30 రకాల డాక్యుమెంట్లను ఇందులో పొందుపరుస్తారు. అయితే చిట్‌ఫండ్ల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం నామమాత్రపు రుసుములనే స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ వసూలు చేస్తోంది. అయినప్పటికీ కొన్ని చిట్‌ఫండ్ సంస్థల నుంచి స్పందన కరువవుతోంది. మొదటగా ఈ పథకాన్ని పైలట్ రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో అమలు చేశారు. అనంతరం అక్కడి ఫలితాలను చూసి క్రమంగా రాష్ట్రమంతటా అమల్లోకి తీసుకొచ్చారు.

రాష్ట్రంలో అనధికారికంగా చిట్టీల పేరుతో భారీ వ్యాపారమే నడుస్తోంది. మారుమూల గ్రామాల్లో మొదలుకొని నగరాలు, పట్టణాల్లో కూడా ఈ వ్యాపారం చెందుతోంది. అనేక మంది వీటిని ఎటువంటి రిజిస్ట్రేషన్లు లేకుండా నిర్వహిస్తున్నారు. అనధికారికంగా రోజుకు రూ. 40కోట్లకుపైగా టర్నోవర్ జరుగుతుందని ఒక అంచనా. ఇటువంటి వ్యాపారాల్లో మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎటువంటి యంత్రాంగం లేకపోగా, పోలీస్ స్టేషన్లలో కేసులు సుధీర్ఘంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు మేలు జరగడంలో తీవ్ర జాప్యం, ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయని గుర్తించిన రిజిస్ట్రేషన్ల శాఖ ఈ యాప్‌ను రూపొందించి ప్రజలకు మేలు చేసిందని పలువురు పేర్కొంటున్నారు.

New app called T chits in telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News