Tuesday, April 30, 2024

కేంద్ర మంత్రి నారాయణ రాణె అరెస్ట్

- Advertisement -
- Advertisement -
Union Minister Narayan Rane arrested
మహారాష్ట్ర సిఎంపై అనుచిత వ్యాఖ్యల పర్యవసానం
పలు చోట్ల శివపేన, బిజెపి కార్యకర్తల బాహాబాహీ

ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కేంద్ర మంత్రి నారాయణ రాణేను పోలీసులు అరెస్టు చేశారు. సిఎంకు స్వాతంత్య్రం వచ్చి ఎన్నేళ్లయిదో కూడా తెలియదని, అలాంటివ్యక్తి చెంప పగలగొట్టాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకుగాను ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదయింది. దీంతో రత్నగిరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయనను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత రాణెను సంగమేశ్వర్ పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లినట్లు ఒక పోలీసు అధికారి చెప్పారు. తనకు హై బిపి, సుగర్ లెవల్స్ ఎక్కువ ఉన్నాయని రాణె చెపారని, దీంతో ఆయనను పరీక్షించడానికి డాక్టర్‌ను పిలిపించారని కూడా వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా ఈ వ్యవహారంలో అరెస్టునుంచి రక్షణకోసం రాణె ముంబయి హైకోర్టును ఆశ్రయించారు. రాణెపై నమోదైన కేసులను కొట్టివేయాలంటూ ఆయన తరఫు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని రాణె ఆ పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరారు. అయితే న్యాయస్థానం పిటిషన్‌పై విచారణ చేపట్టడానికి న్యాయస్థానం నిరాకరించింది. అత్యవసర విచారణ కోసం ముందు రిజిస్ట్రీ డిపార్ట్‌మెంట్‌లో నమోదు చేసుకోవాలని, అప్పుడే తాము విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.

అసలేం జరిగింది?

జన ఆశీర్వాద యాత్రలో భాగంగా కేంద్ర మంత్రి నారాయణ రాణె సోమవారం రత్నగిరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సిఎం థాకరేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15న ముఖ్యమంత్రి చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ.. ‘ ముఖ్యమంత్రికి స్వాతంత్య్రం ఎప్పుడు వచ్చిందో కూడా తెలియకపోవడం సిగ్గుచేటు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు రాష్ట్రప్రజలనుద్దేశించి ప్రసంగించిన థాకరే.. మధ్యలో వెనక్కి తిరిగి స్వాతంత్య్రం వచ్చి ఎన్నాళ్లయిందని ఆయన సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆరోజు నేను అక్కడ ఉంటేనా.. ఆయన చెంప పగలగొట్టేవాడిని’ అంటూ రాణే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీశాయి.

సేన, బిజెపి కార్యకర్తల బాహాబాహీ

కాగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై కేంద్ర మంత్రి నారాయణ రాణే వ్యాఖ్యలపై ఇప్పుడు శివసేన, బిజెపి కార్యకర్తల మధ్య మళ్లీ యుద్ధం మొదలైంది. నాసిక్‌లో శివసేన కార్యకర్తలు బిజెపి కార్యాలయంపై రాళ్లు వేయగా, ముంబయిలో రెండు పార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ముంబయిలో రాణె నివాసం వద్దకు మంగళవారం ఉదయం శివసేన యువజన విభాగానికి చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలు చేరుకుని రాణెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే అప్పటికే అక్కడికి పెద్ద సంఖ్యలో చేరిన బిజెపి కార్యకర్తలు కూడా ప్రతి నినాదాలు చేయడం ప్రాంభించారు. ఇరుపక్షాల వాళ్లు ఒకరిపై ఒకరు రాళ్లు కూడా రువ్వుకున్నారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రాణే నివాసం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను కూడా మోహరించారు.

రాజ్యాంగ విలువలకు విరుద్ధం: నడ్డా

కాగా కేంద్రమంత్రి నారాయణ రాణెను మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేయడం రాజ్యాంగ విలువలకు విరుద్ధమని, తమ పార్టీ అలాంటి వాటికి బెదిరిపోదని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా మంగళవారం ఒక ట్వీట్‌లో విమర్శించారు. తమ పార్టీ జన ఆశీర్వాద యాత్రలకు ప్రజలనుంచి భారీస్పందన వస్తోందని, అది చేసి ప్రతిపక్షాల భయపడి పోతున్నాయని ఆయన అన్నారు. తాము ప్రజాస్వామ్య బద్ధంగానే పోరాటం చేస్తామని, జన ఆశీర్వాద యాత్ర కొనసాగుతుందని నడ్డా ఆ ట్వీట్‌లో స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News