ఇటీవల మతపరమైన క్రతువుల్లో, పరిశ్రమల్లో ప్రమాదాలు సంభవించి పలువురు అకాల మరణాలు చెందుతుండంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఆయా కుటుంబాలు తీవ్ర దుఃఖంతో కుమిలిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో జరిగిన తొక్కిసలాటలో, సింహాచలంలో చందనోత్సవం సందర్భంగా గోడకూలిన ఘటనలో, గత వారంలో పూరీ జగన్నాథ్ రథయాత్ర సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో పలువురు అకాల మరణం పొందడం అందరికీ తీవ్ర దుఃఖం కలిగించింది. దీనికి ప్రధాన కారణం ఆయా దేవాలయాల బోర్డులు, ప్రభుత్వాలు, భక్తుల తొందరపాటు.
ఇక గత పరిశ్రమల్లో జరిగిన ప్రమాద సంఘటనలు పక్కన పెడితే, ఇప్పుడు పటాన్‌చెరు పాశమైలారం రసాయన పరిశ్రమలో సంభవించిన ప్రమాదంలో పలువురి అకాల మరణాలకు కారణం యాజమాన్యాలు, ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా కనపడుతున్నది. నిబంధనలు పాటించకపోవడం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, లేబర్ డిపార్ట్‌మెంట్, ప్రభుత్వ అధికారులు, ఫైర్ డిపార్ట్‌మెంట్ ఏమి చేస్తున్నారు అనే ప్రశ్న అందరి మెదళ్లను తొలిచి వేస్తుంది.
మరోపక్క ఇటీవల కాలంలో ‘విమాన ప్రమాదాలు’ దేశప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీనికి విమానయాన సంస్థలు అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. ఇక రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ప్రతీ సంవత్సరం సగటున ఒక లక్షా యాభై వేల మంది అకాల మరణాలు చెందుతున్నారు. దీనికి ప్రధాన కారణం ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడం, వాహనాల ఫిట్నెస్ లోపం, అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్ తదితర కారణాలతోపాటు సంబంధించిన డిపార్ట్‌మెంట్స్ అలసత్వం.
ఇక వీరాభిమానంతో సినిమా హాల్స్ వద్ద, క్రికెట్ స్టేడియాల వద్ద అకాల మరణాలు చెందుతున్నారు. దీనికి కూడా వ్యక్తిగత కారణాలతోపాటు యాజమాన్యం, పోలీసు, ఫైర్ డిపార్ట్‌మెంట్స్ కారణం కనపడుతుంది. ఇటీవల బెంగళూరు క్రికెట్ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో కొందరు అకాల మరణాలు చెందడం మనం అందరం ప్రత్యక్షంగా చూసినాం. ఇలా పలు సందర్భాల్లో, పలు కార్యక్రమాల్లో ప్రజలు అకాల మరణాలు చెందడం చాలా బాధాకరం. దీనికి ప్రధాన కారణం కొంతమేరకు భక్తులు, ప్రజలు తొందరపాటు కారణం అయితే, ఎక్కువ శాతం యాజమాన్యాలు ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యమే కారణమని నిపుణులు చెబుతున్నారు.
ఇక అనుకోకుండా ఇటువంటి ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రభుత్వాలు తరచూ ‘చాలా దురదృష్టకరమైన సంఘటన అని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం అని, పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రశక్తి లేదు అనే డైలాగులు సర్వసాధారణంగా వినిపిస్తారు. పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అని, అందరూ కోరేది ‘భారీ నష్టపరిహారం’ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తారు. ‘అంతే అక్కడితో అటువంటి సమస్యలకు స్వస్తి పలకడం సర్వసాధారణం అయిపోయింది. దోషులుపై చర్యలు తీసుకునే వరకూ ఎంతమంది నిలబడుతున్నారు అనేది అసలు ప్రశ్న? కానీ జరిగిన ప్రమాదాల్లో త్వరితగతిన విచారణ జరిపి, ఎంత మందిపై చర్యలు చేపట్టారు అని విశ్లేషిస్తే కనుచూపు మేరలో ఎక్కడా కనపడవు అంటే అతిశయోక్తికాదు.
ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎలా చూడగలం! అనే విషయాన్ని అందరూ సీరియస్‌గా ఆలోచన చేయాలి. ముఖ్యంగా ప్రజలు తమ వ్యక్తిగత భద్రతపై అవగాహన కలిగి ఉండాలి. ప్రభుత్వ సూచనలు, సలహాలు, మార్గదర్శకాలు పాటించాలి. ఏ విషయములోనైన ‘అతి’ అనేది ప్రమాదకరం అని గ్రహించాలి. ఇక ప్రభుత్వాలు జనసమీకరణ ప్రాంతాల్లో, ప్రదేశాల్లో పటిష్టమైన చర్యలు చేపట్టాలి. అధికారులు, సంబంధించిన డిపార్ట్‌మెంటల ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేపట్టాలి. నియమ నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. తరచూ తనిఖీలు నిర్వహించాలి. ముఖ్యంగా పరిశ్రమల్లో అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించాలి.
కార్మికుల భద్రతపై దృష్టి సారించాలి. నైపుణ్యం కలిగిన వారిని సంబంధించిన పనుల్లో బాధ్యత అప్పగించాలి. ప్రభుత్వ యంత్రాంగం పారదర్శకంగా పరిపాలన అందించాలి. అవినీతి అధికారుల వలనే లోపాలు బయటపడటం లేదు. అందువలన ఇటువంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. సమన్వయలోపం, సిబ్బంది కొరత, సాంకేతికత, విజ్ఞానం అందిపుచ్చుకోలేకపోవడం. ఇటువంటి కారణాలు వలనే పలు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కార్మిక సంఘాల సూచనలు, సలహాలు తీసుకోవాలి. ప్రజలు కూడా సంయమనంతో వ్యవహరించాలి. జీవితం విలువైనది అని గ్రహించాలి. మనతోపాటు మన పొరుగువారు ప్రశాంతంగా, ఆరోగ్యంగా జీవించడానికి అందరూ సహకరించుకోవాలి. ప్రభుత్వ యంత్రాంగానికి దేవాలయాల సిబ్బందికి సహకరించాలి. పరిశ్రమలు, సినిమా హాల్స్, స్టేడియంల తదితర ప్రజా కేంద్రీక స్థలాల యాజమాన్యం అక్కడ ప్రజల ప్రాణాలకు భద్రత ఏర్పాటుకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం ద్వారానే ప్రమాదాలు జరగకుండా, నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు పోకుండా కాపాడగలుగుతాం.
ఐ.పి.రావు
63056 82733