Thursday, August 7, 2025

బనకచర్ల కోసమే కాళేశ్వరంను పండపెట్టిండ్రు: జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ఆత్మకూర్ ఎస్: బనకచర్ల కోసమే కాళేశ్వరంను పండబెట్టినారని, ఇది ముమ్మాటికి చంద్రబాబు కుట్రే అని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. బుధవారం ఆత్మకూర్ ఎస్ మండలంలో రేషన్ కార్డులు, ఇండ్ల నిర్మాణాలకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాళేశ్వరం రిపోర్ట్ కాదని అది కాంగ్రెస్ రిపోర్ట్ అని, బిజేపి, కాంగ్రెస్ చంద్రబాబు ప్రోద్భలంతో తయారు చేసిన రిపోర్టు మాత్రమే అన్నారు. రెండేళ్లుగా చెప్పిందే చెప్పి,కేసీఆర్ పై ఏడుపు తప్ప ఒరగబెట్టిందేమీ లేదని, మెడీ, చంద్రబాబు డైరెక్షన్లో కేసీఆర్‌ను బదనాం చేయాలని కుట్రలు చేస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు చేసినా కేసీఆర్ ను ఏం చేయలేరన్నారు. కేసీఆర్ ముందు చూపు పాలనే నేడు తెలంగాణ అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయని, కాళేశ్వరమే ఎప్పటికైనా తెలంగాణకు జీవధార అన్నారు.

కేసీఆర్ కు మరింత పేరొస్తదనే కాంగ్రెస్ విషం కక్కుతుందని, కాళేశ్వరం పై తప్పుడు ప్రచారాలతో ఇంకా కాలం వెళ్లబుచ్చుతుందని, నేనే స్వయంగా వెళ్లొచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చానని, మొన్నటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో హరీష్ రావు నిజాలన్నీ చెప్పాడని అన్నారు. అయినా కూడా కాళేశ్వరం పై తప్పుడు ప్రచారం చేయడానికి సిగ్గుండాలని, వరుస మోసాలతో కాంగ్రెస్ రికార్డులు సృష్టిస్తోందని, ఇవన్నీ స్థానిక సంస్థల ఎన్నికల స్టంట్లో భాగమే అన్నారు. బీసీ లను వాడుకుని మోసం చేసేందుకే రిజర్వేషన్ డ్రామాలు ఆడుతున్నారని, ప్రజా సంక్షేమంలో కేసీఆర్ ను మించినోడే లేడన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ నాటకం కూడా బీసీలను మోసం చేసేందుకే అని, రేవంత్ ఎప్పటికీ మోడీ, చంద్రబాబు చేతిలో కీలుబొమ్మే అన్నారు.

తెలంగాణ నీళ్లను బనకచర్ల రూపంలో ఆంధ్రకు దోచిపెట్టే కుట్ర చేస్తున్నారని, ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని, హామీల పై ప్రభుత్వాన్ని నిలదీస్తే తట్టుకోలేకపోతున్నారని అన్నారు. ఎప్పటికైనా తెలంగాణ కు కేసీఆరే శ్రీరామ రక్ష అని, ఇకనైనా బిఆర్‌ఎస్ పై ఏడుపు మాని అభివృద్ధి దృష్టి పెడితే మంచిదని హితవు పలికారు. ఆయన వెంట మాజీ జడ్పి వైస్ ఛైర్మన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు తూడి నరసింహారావు, గ్రంధాలయ మాజీ జిల్లా ఛైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ కొనతం సత్యనారాయణ రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News