Friday, August 8, 2025

ట్రంప్ సుంకాల చప్పుళ్లకు భయమేల?

- Advertisement -
- Advertisement -

ఇండియాపై టారిఫ్‌లను 50 శాతానికి పెంచిన ఘనుడు రేపు 100 శాతానికి పెంచబోడన్న హామీ లేదు. ఆ మాట ఇప్పటికే ఒకసారి అన్నాడు కూడా. అందువల్ల మనం చేయవలసింది ఇన్నాళ్ల అమెరికా భక్తిని మానుకుని అన్ని విధాలుగా మన ప్రయోజనాలు మనం చూచుకోవటం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమి చేస్తున్నారో తక్కిన ప్రపంచానికి అర్థం కాకపోతేపోయింది. కనీసం తనకైనా అర్థమవుతుండవచ్చునా? జనవరిలో పదవీ బాధ్యతలు స్వీకరించినపుడు ఆయన ప్రకటించిన లక్షాలు బాగా తోచాయి. అమెరికా వాణిజ్యలోటును, ద్రవ్యలోటును, అప్పుల భారాన్ని తగ్గించటం, రకరకాల అనవసరపు వ్యయాలను తగ్గించటం, ఇతర దేశాలకు తరలిపోయిన అమెరికన్ కంపెనీలను తిరిగి రప్పించటం, తమ పౌరులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచటం, అక్రమ వలసల నిరోధం, ధరల నియంత్రణ, బయటి నుంచి పెట్టుబడులను ఆకర్షించటం, యుద్ధాలను ఆపటంతోపాటు స్వయంగా యుద్ధాలలో పాల్గొనకపోవటం, సైనిక వ్యయం తగ్గుదల, నాటో కూటమి దేశాలు తమ సైనిక వ్యయాన్ని తామే భరించుకునేట్లు చేయటం అన్నవి ప్రధాన లక్షాలు.

ఇవన్నీ ‘మాగా’ పరిధిలోకి వస్తాయి. అయితే ఆ పని సవ్యంగా జరగాలి.అమెరికా ప్రయోజనాల దృష్టా చూసినపుడు ఈ లక్షాలకు యథాతథంగా అభ్యంతర పెట్టలేం. ఆయా చర్యల అమలులో ఇతర దేశాలకు కొన్ని నష్టాలు తప్పక ఉంటాయి. వాటి అమలు తీరులో (manner execution) అసమంజసమైనవి, పరస్పర విరుద్ధమైనవి, అమెరికా తన ప్రయోజనాల కోసం ఇంత కాలం స్వయంగా అమలు పరచి ఇపుడు అకస్మాతుగా కాదంటున్నవి, ఆ క్రమంలో ధ్వంసం చేయజూస్తున్న అంతర్జాతీయ వ్యవస్థలు అనేకం ఉన్న మాట నిజం. ఇదంతా అందరూ చర్చిస్తున్నదే. కాని అంతిమంగా ట్రంప్ ప్రభుత్వానికి వ్రతం చెడ్డా ఫలం దక్కే పరిస్థితి అయినా కనిపిస్తున్నదా? ఆరు నెలల పాలన తర్వాత కలుగుతున్న సందేహం ఇది.

ట్రంప్ చర్యలు అనేకం మౌలికమైనవి, మంచికైనా చెడుకైనా ప్రభావవంతమైనవి, వాటిలో ఎన్నో ఇంకా కొనసాగుతున్నవి అయినందున, ఇప్పుడే తుది అభిప్రాయానికి రాలేము. అదే సమయంలో ఆ చర్యల ప్రభావాలు ఒకవైపు అమెరికాలో అంతర్గతంగా, మరొక వైపు బయటి ప్రపంచంలో కనిపించటమైతే మొదలైంది. కనుక, రెండింటిని కలిపి గమనించినపుడు, ట్రంప్ పేర్కొన్న లక్షాల సాధన కనీసం ఇప్పటికైతే అనుమానాస్పదంగా కనిపిస్తున్నది. నష్టాలు తప్ప లాభాలు ఎవరికీ లేవు. అంతేకాదు. ఇండియా వంటి మిత్రదేశాలు కూడా  వ్యతిరేకమవుతున్నాయి. ఆశ్చర్యం కలిగిస్తున్నది ఒకటున్నది. ఒక పాలకుడు ఒక ఆలోచన చేసినపుడు దాని అమలుకు నిర్దిష్టమైన ప్రణాళిక, అమలు మార్గాలు, ఆ విధంగా సమగ్రమైన వ్యూహం ఉంటాయి. అమెరికా వంటి అగ్రరాజ్యాధిపతికి అది మరింత తప్పనిసరి.

కాని ట్రంప్ ప్రకటనలు, చర్యలను గమనించినపుడు, ఆరు మాసాలు గడిచిన తర్వాత కూడా ఏమీ అర్థం కాకుండా ఉంది. ఇదే స్థితి మునుముందు కూడా కొనసాగే సూచనలు కనిపిస్తున్నందున భవిష్యత్తుఅయోమయవుతున్నది. బయటి ప్రపంచనికే కాదు, అమెరికన్లకు కూడా. తను చేస్తున్నదేమిటో ట్రంప్‌కైనా అర్థమవుతున్నదా అనే ప్రశ్న వేసుకోవలసి రావటం అందువల్లనే. ఆయన ప్రకటించిన లక్షాలలో అన్నింటిని చర్చించటం ఇక్కడ వీలు కాదు గాని, కొన్నింటిని మాత్రం చూద్దాము. ఇండియా తమ మిత్రదేశం అంటూనే 25 శాతం సుంకాలు ఎందుకు వేసినట్లు? ఎందుకు 50 శాతానికి పెంచినట్లు అది కూడా చర్చలు ఇంకా సాగుతుండగానే? తను చెప్పిన కారణాలు ఇండియా సుంకాలు ఎక్కువ, దిగుమతి ఆంక్షలు ఎక్కువ, రష్యా నుంచి చమురును, ఆయుధాలను కొనుగోలు చేస్తున్నారని. రష్యన్ చమురు, గ్యాస్‌ను పాశ్చాత్య దేశాలూ కొంటున్నాయన్నది మరిచిపోదాం.

వీటిలో ఏదైనా ఇండియా వంటి వర్ధమాన దేశపు ప్రయోజనాల కోసం అవసరమన్నది అట్లుంచినా, ఇప్పటికే కొన్ని సుంకాలు, ఆంక్షలు తగ్గించిన భారత ప్రభుత్వం తక్కిన అంశాలపై చర్చలు జరుపుతున్నది గదా? పైగా, అమెరికా నుంచి చమురు, ఆయుధాల దిగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయి.మరొక వైపు అమెరికా దీర్ఘకాలిక భౌగోళిక రాజకీయ వ్యూహాలలో నమ్మకమైన మిత్రదేశంగా గత పాతికేళ్లుగా కొనసాగుతున్నది గదా? ట్రంప్ ఎంతమాత్రం సహించని బ్రిక్స్ కూటమిలో సభ్యదేశం అయినప్పటికీ, అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాత్రం పని చేయబోనని స్పష్టం చేస్తున్నది గదా? అటువంటపుడు ఈ మౌలికమైన, దీర్ఘకాలిమైన విషయాలను విస్మరించి, చర్చలు ఇంకా కొనసాగుతుండగానే, టారిఫ్‌లను చైనాతో సహా అనేక ఇతర దేశాలపై కన్న ఎక్కువగా పెంచటాన్ని బట్టి ఏమనుకోవాలి? అది చాలదన్నట్లు భారత దేశానిది ‘మృత ఆర్థిక వ్యవస్థ’, ‘రష్యాతో కలిసికట్టుగా మునగనివ్వండి’ వంటి భాషతో ఎంత మాత్రం పరిణతిలేని వ్యాఖ్యలు చేయటాన్ని? భారత దేశానిది ‘మృత ఆర్థిక వ్యవస్థ’ ఎంతమాత్రం కాదని చెప్పేందుకు అనేక గణాంకాలు ఉన్నాయి గాని, ట్రంప్ వంటి వ్యక్తి చేసే వ్యాఖ్యలకు విలువ ఉండదు గనుక ఆ వివరాలలోకి వెళ్లనక్కర లేదు.

యుద్ధాలకు, మరణాలకు బద్ధ వ్యతిరేకినని పలుమార్లు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు గత వారంలో ఉన్నట్లుండి ఏకంగా అణ్వస్త్ర ప్రయోగ ప్రస్తావనలు చేసి పెద్ద సంచలనం సృష్టించారు. ఉక్రెయిన్ యుద్ధం ముగించటానికి రష్యా వంటి అగ్రదేశానికి తనంతట తానే 50 రోజుల గడుపుతో హుకుం జారీ చేసి, తిరిగి ఆ గడువును 10 రోజులకు తగ్గించటంతో సమస్య మొదలైంది. ఆ సందర్భంలోనూ చర్చలు ఒకవైపు జరుగుతున్నాయి. అందులో చాలా విషయాలు ఇమిడి ఉన్నాయి. అసలు ఆ యుద్ధం మొదలుకావటానికి కారణం అమెరికన్ కూటమి దేశాలు ‘నాటో’ ను రష్యా వైపు విస్తరిస్తుండటం. శాంతిని కోరుకుంటే ట్రంప్ చేయవలసింది, అట్లా విస్తరించబోమని నాటోతో అధికారికంగా ప్రకటింపచేయటం.

అది చేయకుండా కపట నీతి సాగిస్తూ, యుద్ధం ఆగిపోవాలనటం ఏమిటి? రష్యాకు ఆదేశాలేమిటి? ఆయన ఇతరత్రా కూడా అదే కపట నీతి సాగిస్తూ, గాజాలో ఇజ్రాయెల్ దారుణ కాండపై నోరుమెదపటం లేదు. శాంతియుత ఉపయోగం కోసం అణు శుద్ధిని చేస్తున్న ఇరాన్‌పై, స్వయంగా అణ్వస్త్రాలు గల ఇజ్రాయెల్ పక్షానదాడులు జరిపారు. ఇపుడు రష్యాకు గడువుల ఆదేశాలు జారీ చేస్తూ, ఆ ప్రాంతానికి రెండు అణ్వస్త్ర జలాంతర్గాములను సైతం పంపారు. అదే విధమైన జలాంతర్గాములు, అమెరికాను మించిన సంఖ్యలో అణ్వస్త్రాలు రష్యా వద్ద ఉన్నాయి. ట్రంప్ చర్యకు ప్రతిగా రష్యా సహజంగానే తన హెచ్చరికలు తాను చేసింది. ఈ విధమైన ధోరణి ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపలేదు సరికదా కొత్త యుద్ధాలకు దారితీస్తుంది. మరి ట్రంప్ ప్రకటించిన లక్షాలేమిటి? వాటి సాధనకు ఆయన అనుసరిస్తున్న పద్ధతులేమిటి? ఇండియాను పక్కన ఉంచి చూసినా టారిఫ్‌ల విషయమై అమెరికా అధ్యక్షుడు దాదాపు ప్రతి రోజూ చేస్తున్న ప్రకటనలు ఎంత చిత్రవిచిత్రంగా, అరాచకంగా ఉంటున్నాయో ప్రపంచమంతా చూస్తున్నది. ఒక అగ్రదేశం తీరు ఇట్లా ఉండగలదా అని ఆశ్చర్యపోవటం కూడా ఈ సరికి మానివేసి ఉంటుంది.

ఈ రెండవ తేదీనే ఆయన చేసిన ఒక ప్రకటన ఈ విడ్డూరాలకు తార్కాణంగా నిలుస్తుంది. ఆయన ఇండియా తదితర దేశాల నుంచి ఔషధాల దిగుమతిపై తక్కువ సుంకాలు విధించవచ్చునన్నది మొదటి ఉండిన అంచనా. కాని, అదేమీ లేకుండా ఆ సుంకాలను అన్ని సరుకులపై వలెనే పెంచారు. దానితో అక్కడి ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం కాగా, మందుల ధరల 500 శాతం నుంచి 1500 శాతం తగ్గేట్లు చూడగలనంటూ ప్రకటించారు. ఔషధ ఉత్పత్తిదారులకు వెంటనే లేఖ కూడా రాసారు. దీనిని బట్టి వారి లాభాలు ఆ స్థాయికి కూడా మించి ఉన్నాయని, ఇపుడు ఆ మేర తగ్గించగలరని అనుకోవాలా? ఇతరత్రా సుంకాల తీరును విశ్లేషించదలచినా, ఏ దేశంపై ఎంత, ఎందుకు విధిస్తున్నట్లో, మళ్ళీ ఏ మార్పులు ఎందుకు చేస్తున్నట్లో, ఎవరితో ఏ చర్చలో, ఏ రాజీలో, చర్చలు వాయిదాలు ఎవరితో ఎందుకో ఏమీ బోధపడకుండా సాగుతున్నది.

బ్రిక్స్ దేశాలపై అయితే కేవలం అందులో చేరినందుకే 10 శాతం అదనమట. ఆమేరకు సంతోషించాలి.ఒక దశలో 100 శాతమన్నారు. ట్రంప్‌కు తోడుగా నాటో బాస్, రష్యాతో వ్యాపారం చేస్తే మరొక 100 శాతమన్నారు. బ్రెజిల్ పై 50 శాతమైతే మరొక విచిత్రం. అక్కడ ఎన్నికల్లో ఓడిన బోల్సొనారో వ్యక్తి గతంగా ట్రంప్ మిత్రుడు. ఆయన లూలా ప్రభుత్వంపై సైనిక తిరుగుబాటు జరిపించేందుకు విఫల ప్రయత్నం చేసాడు. ప్రస్తుతం కోర్టు విచారణను ఎదుర్కొంటున్నాడు. కాని, అది నచ్చని ట్రంప్ కేవలం ఆ రాజకీయ కారణాన్ని తన ఉత్తర్వులలో నేరుగా పేర్కొంటూ 50 శాతం సుంకం విధించారు. ఇది నమ్మగలమా? సమస్య ఏమంటే, ఇటువంటివి ఎన్నెన్ని చేసినా, అమెరికాలో అంతర్గత పరిస్థితులు మాత్రం నెలలు గడుస్తున్నా మెరుగుపడటం లేదు. ఉదాహరణకు జులై చివరన వెలువడిన అధికారిక నివేదికను బట్టి, ఉద్యోగ ఉపాధులు మామూలు కన్న ఇంకా తగ్గాయి.

కేవలం ఆ నివేదకను వెల్లడించినందుకు ఆ విభాగపు అధికారికి ట్రంప్ వెంటనే ఉద్వాసన చెప్పారు. అదిగాక, ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సుంకాల హెచ్చింపు వల్ల పెరిగే ధరల భారం అమెరికన్ ప్రజలపైనే పడుతున్నది. వలస కార్మికులను తిప్పి పంపుతుండటంతో పలు రంగాలలో పనులు దెబ్బతింటున్నాయి. అదనపు సుంకాల రూపంలో పెరిగే ఆదాయమెంతో, తీరే వాణిజ్య లోటు వగైరాలు ఏ మేరకో, బయటినుంచి రాగల కొత్త పెట్టుబడులు ఎంతో, వీటన్నింటి వల్ల కలిగే నికర ప్రయోజనమెంతో తేలేందుకు చాలా నెలలు అవసరం. ఆ ప్రయోజనాలను తగ్గించే నష్టాలు కూడా కొన్ని ఉండగలవని అంచనా. ఉదాహరణకు, ట్రంప్ ధోరణికి బెదిరిపోతున్న పలు దేశాలు తమ వాణిజ్యాన్ని వీలైనంత మేర ఇతర దేశాలకు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అంతిమంగా కనిపిస్తున్నది, ట్రంప్‌కు తన లక్షాల సాధనకు తగిన ఆలోచనలు, పరిణతిలేవన్నది.

  • టంకశాల అశోక్ (దూరదృష్టి)
  • రచయిత సీనియర్ సంపాదకులు
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News