టాలీవుడ్ అందాల నటి హన్సిక (Hansika Motwani) తన భర్త సోహైల్‌తో విడాకులు తీసుకుంటుందంటూ కొద్ది రోజులుగా రూమర్స్ వస్తున్నాయి. తన భర్తతో ఆమెకు పడటం లేదని అందుకే వేరుగా ఉంటోందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం హన్సిక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి తమ పెళ్లి ఫోటోలను డిలీట్ చేసింది. తాజాగా ఆమె విడాకుల రూమర్స్ వస్తున్న వేళ సోషల్‌మీడియా ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
హన్సిక (Hansika Motwani) ఆగస్టు 9న పుట్టినరోజు జరుపుకుంది. ఈ నేపథ్యంలో ఆమెకు సోషల్‌మీడియాలో కుటుంబసభ్యులు, సన్నిహితులు, అభిమానులు పెద్దఎత్తున విషెస్ తెలిపారు. వాటికి హన్సిక స్పందిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టింది. ‘‘ఈ సంవత్సరం నాకు అడగకుండానే ఎన్నో పాఠాలు నేర్పించింది. నాలో నాకే తెలియనంత బలం ఉందని తెలియజేసింది. ఈ పుట్టినరోజున మీ అందరి శుభాకాంక్షలతో నా హృదయం ఉప్పొంగింది. చాలా ప్రశాంతంగా ఉంది. ఒక్కోసారి చిన్న విషయాలు కూడా ఆనందాన్నిస్తాయి. ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు’’ అని పోస్ట్ చేసింది. దీంతో మరోసారి హన్సిక విడాకుల గురించి సోషల్‌మీడియాలో చర్చ ప్రారంభమైంది.
2022లో హన్సిన తన చిన్ననాటి స్నేహితుడైన సోహైల్‌ను వివాహం చేసుకుంది. కాగా, సోహైల్‌కి ఇది రెండో పెళ్లి. మొదటి పెళ్లికి హన్సిక హాజరైంది కూడా. అయినా కూడా సోహైల్ మొదటి భార్యతో విడాకులు తీసుకోవడంతో హన్సిక అతడికి మరింత చేరువైంది. ఆ తర్వాత వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ‘లవ్ షాదీ డ్రామా’ పేరుతో వీళ్ల పెళ్లిని డాక్యుమెంటరీగా విడుదల చేశారు. అయితే పెళ్లైన రెండు సంవత్సరాల్లోనే హన్సికకు, తన భర్తతో మనస్పర్థలు వచ్చాయని, అందుకే అతనికి దూరంగా తన తల్లితో ఉంటోందని.. త్వరలోనే వీళ్లు విడాకులు తీసుకుంటారని కొంతకాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి.