శ్రీశైలం ఘాట్ రోడ్‌లో ఎలివేటర్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా సమ్మతి తెలిపింది. రిజర్వు ఫారెస్టు ఏరియాలో రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం వెళ్లే రహదారికి ప్రత్యాన్మయంగా దాదాపు పది కిలోమీటర్ల మేరకు ఎలివేటర్ కారిడార్ నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలకు కేంద్రం అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనలతో పాటు రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన ఇతర అంశాలపై ఈనెల 22వ తేదీన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరుగనున్నది. ఈ సమావేశానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారులు, నేషనల్ హైవే అథారిటీ(ఎన్‌హెచ్‌ఎ) ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర ఆర్ అండ్ బి అధికారులు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్(హెచ్‌ఎండిఏ) అధికారులు, హైదరాబాద్ మెట్రో రైల్(హెచ్‌ఎంఆర్‌ఎల్) అధికారులు సమావేశానికి హాజరు అయ్యేందుకు సిద్ధం అవుతున్నారు.
రాష్ట్రం ప్రతిపాదనలకు ముందుకు వచ్చిన కేంద్రం
రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నేషనల్ హైవేల ఆధునీకరణ, ఫ్రీ ఆక్సిడెంట్స్ పోటెన్షియాలిటీ అంశాలపై రోడ్ నెట్ వర్క్ కనెక్టివిటీ అంశాలపై ఇటీవల ఢిల్లీలో రోడ్లు భవనాల శాఖ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలుసుకుని చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్రం దృష్టికి తీసుకువచ్చారు. దానిపై కేంద్ర, రాష్ట్ర అధికారులతో పాటు నేషనల్ హైవే అధికారులతో త్వరలో సమావేశం ఏర్పాటుకు కేంద్ర మంత్రి గడ్కరీ హామీ ఇచ్చారు.
ప్రభుత్వ ప్రతిపాదనలు
అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రానికి పోరుగురాష్ట్రాలతో రోడ్ నెట్ వర్క్ కనెక్టివిటీని పెంచాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. హైదరాబాద్ జంటనగరాలు, శివారు ప్రాంతాల విస్తరణ నేపధ్యంలో ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్) నుంచి రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) మధ్య రేడియల్ రోడ్స్ నిర్మాణ ప్రాధాన్యతను కేంద్ర మంత్రి గడ్కరీకి వివరించారు. దక్షిణ కాశిగా పేరొందిన శ్రీశైలం శైవదేవాలయానికి రోడ్డు మార్గంలో రిజర్వు ఫారెస్టు కారణంగా తలెత్తుతున్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి పర్యావరణ పరిరక్షణకు వీలుగా రిజర్వు ఫారెస్టు మీదు కనీసం పది కిలోమీటర్ల మేరకు ఎలివేటర్ కారిడార్ నిర్మించాలని కోరారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు పది లైన్లతో కూడిన గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం, ఆక్సిడెంట్స్ ఫ్రీ రోడ్స్‌లో భాగంగా కొన్ని ప్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టాల్సిన అవశ్యకతను కేంద్రానికి ఇచ్చిన వినతిపత్రంలో మంత్రి కోమటిరెడ్డి సూచించారు.
Also Read: అతి తెలివితో హరీష్ రావు ప్రకటన:ఉత్తమ్ కుమార్ రెడ్డి