Monday, September 22, 2025

మెరుపు

- Advertisement -
- Advertisement -

బుభుక్షితై ర్వ్యాకరణం న భుజ్యతే
పిపాసితై కావ్య రసో న పీయతే

ఆకలితో ఉన్నవాడు వ్యాకరణాన్ని తినలేడు
దప్పికతో ఉన్నప్పుడు కావ్య రసాన్ని తాగలేడు.
అన్నాడు మాఘుడు.
అదెంత సత్యమే ఐనా జీవించే క్షణాల్ని కవిత్వం తో ముంచి పంచుతారు కవులు. ఎలాంటి వేళనై నా కవిత్వంతో ముడిపెట్టి బతకటం, వచ్చి పడే మాటల్ని ఒడిసిపట్టి రాయటం యోగం అంటారు మన కాలం కవులు. ఏ తరుణాన్నైనా పద్యం చేసుకొని పరవశించటం, రమ్మంటే రాని వ్యాపకం. అందులో రాటు తేలితే గడ్డిపూలు కూడా ప్రబంధాలౌతాయి. నీటి చలమలు నదీ నదాలౌతాయి. అరికాళ్ళకు పసరు తగిలి పద్యాలౌతాయి. ఒక్కోసారి మాటకారిని కూడా మూగవాడిని చేస్తాయి.
‘నేను కవిత్వం రాసేప్పుడు నా నెమలి పింఛపు కలంపై ఎక్కడి నుంచో వచ్చి వాలుతుందొక సీతాకోక చిలుక’ అని రాసుకున్నారు విమల గారు తన ‘మృగన’లో. ఇక్కడ ‘నెమలి పింఛపు కలం’ అనే ఒక్క మాట వల్ల ఆ వాక్యం కవిత్వమైంది. తాంబూలానికి కర్పూరం ముక్క అద్దినట్టైంది. పరవశించి రాసుకున్నప్పుడు మనం కావ్య భాష అని పిలుచుకొనే పరిమళమేదో వచనంలోకి వచ్చి వాలుతుంది.
మత్తకోకిల సన్నాదైః నర్తయన్నివ పాదపాన్
శైలకంధర నిష్క్రాన్తః ప్రగీత ఇవ చానిలః
– వాల్మీ

Also Read : భారత్ చేతిలో చిత్తుగా ఓడిన పాక్

కోయిలలు మత్తెక్కేలా పాడుతుంటే వాటి స్వరాల్ని మోసుకొచ్చే కొండ గాలి, నాట్యం చేసేవాడి వెనక పాటగాడిలా ఉంది.
అతి సరళంగా తోచే గొప్ప పోలిక ఇది. కొండ గాలిలో పాటగాడిని చూడటం ప్రణాళికతో చేసిన ఊహ కాదు. ఆ మాటకొస్తే చీటీలు వేసి ఊహలు తేలేరు ఎవ్వరూ. అకస్మాత్తుగా వచ్చే పోలికలు, దొప్పల్లోని ప్రమిదలు ఒకేలా కాంతినిస్తాయి. వాటికి కాలాలతో నిమిత్తం లేదు. వస్తువులోకి పరకాయ ప్రవేశం చేసినట్టున్న ఈ వాక్యాలు చూడండి- “వాన నెమలి నీ ఇంటిచుట్టూ పురివిప్పి తిరుగుతున్నపుడు నీ ఇల్లు అరణ్యంలో ఉన్నట్టూ సరిహద్దుల్లేని మరో లోకంలోకి నువ్వు ప్రవాసం వెళ్ళినట్టు ఉంటుంది” (వాన లోకం బివివి ప్రసాద్)
ఎన్నోసార్లు మనం పట్టించుకోని వస్తువులు కూడా కల్పనలో మునిగినప్పుడు తెప్పల్లా తేలుతాయి. కవిలో ఆ నిమిషం వస్తువును సంచి చేసుకున్న అన్వేషి ఉంటాడు. శిల్పంలో బిగి ఉంటే అంతంత మాత్రం కల్పనలు కూడా అనుప్రాసలై వెలుగుతాయి.

  • రఘు
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News