Thursday, September 25, 2025

పచ్చదనం.. ప్రకృతికి ఇంధనం

- Advertisement -
- Advertisement -

గాలి, నీరు, పరిసరాలు కాలుష్య రహితంగా ఉన్నప్పుడే ఆరోగ్యం కూడా సక్రమంగా ఉంటుంది. వాతావరణం అవాంఛనీయ వాయువుల చేరికతో విషతుల్యం కావడం వలన అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. శిలాజ ఇంధనాలను విచ్చలవిడిగా వినియోగించడం, వాతావరణంలో హరిత వాయువులు పెరగడం, ప్లాస్టిక్ వినియోగం తదితర కారణాల వలన పర్యావరణ సమస్యలు పెరుగుతున్నాయి. పర్యావరణ సంబంధిత సమస్యల వల్ల ఏటా 12 మిలియన్ల మంది ప్రజలు పలు అనారోగ్య సమస్యలకు గురై మరణిస్తున్నారు. ప్రపంచంలో తలెత్తే పలురకాల అనారోగ్య సమస్యలకు పర్యావరణ విధ్వంసమే మూలకారణం. పర్యావరణానికి, ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించకపోతే మానవాళి పలు రోగాలతో అంతరించే ప్రమాదముంది. ప్రజల ఆరోగ్యం మన చుట్టూ ఉన్న కాలుష్యం లేని పరిసరాల మీద ఆధారపడి ఉంది.

కాలుష్య కారకాల వల్ల, వాతావరణంలో పెరుగుతున్న గ్రీన్‌హౌస్ వాయువుల వల్ల, ప్రస్తుతం మనం వినియోగిస్తున్న ఇంధనాల వల్ల పర్యావరణం తీవ్ర ప్రభావానికి గురవుతున్నది. ఇలాంటి పరిస్థితులు ఏర్పడకుండా ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చేయాలి. సకల జీవరాశుల మనుగడ కోసం ప్రకృతిలోనే సహజ సిద్ధమైన ఏర్పాటు చేయబడింది. ఇలాంటి సహజమైన, ఆరోగ్యవంతమైన వ్యవస్థను విధ్వంసం చేయడం వల్ల మానవాళి అస్థిత్వానికి ముప్పు ఏర్పడక తప్పదు. మానవ ఆరోగ్యానికి, పర్యావరణానికి మధ్య గల అవినాభావ సంబంధాన్ని గుర్తెరిగి ప్రవర్తించాలి. మానవ దుష్కృత్యాల వలన పర్యావరణం అవాంఛనీయ పరిణామాలకు లోనైతే, విధ్వంసమైతే, అది అంతిమంగా మానవ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

పర్యావరణం ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ఇదే భావనతో ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం జరుగుతున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రపంచంలో 3.2 బిలియన్ల మంది ప్రజలు పర్యావరణ సమస్యల వలన ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రపంచ జనాభాలో 23% మంది ప్రజలు పర్యావరణ సంబంధిత కారణాల వలన చనిపోతున్నారు. గాలి, నీరు, నేల, ఆహారం ఇలా అన్నింటిలోను హానికరమైన రసాయనిక పదార్థాలు, ఇతర భౌతిక, జీవ సంబంధిత హాని కారకాలు చేరడం వలన అనేక అనర్ధాలు సంభవిస్తున్నాయి. పర్యావరణం బాగుండాలంటే కాలుష్య రహితమైన వాతావరణం నెలకొల్పాలి. అభివృద్ధి పేరిట జరిగే కార్యకలాపాలు ప్రజారోగ్యాన్ని చెడగొట్టకూడదు. ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు ఆహారం కావాలి.పర్యావరణం దెబ్బతినడం అనేక అవాంఛనీయ పరిణామాలు ఏర్పడుతున్నాయి.

ప్రజలు అనారోగ్యవంతులై ఆసుపత్రులకు అంకితమవుతున్నాయి. ఆర్థిక స్థోమతలేని వారు ఆసుపత్రులకు వెళ్ళలేక, వైద్యఖర్చులను భరించలేక తనువు చాలిస్తున్న సంఘటనలెన్నో మన కళ్ళ ముందు సాక్ష్యాత్కరిస్తున్నాయి. ప్రజల ఆరోగ్యవంతంగా ఉంటేనే ఆర్థిక ప్రగతి సాధ్యపడుతుంది. మానవ ప్రేరిత చర్యల వలన పర్యావరణం దెబ్బతింటున్నది. పర్యావరణాన్ని వివిధ రకాల కాలుష్యాల నుండి కాపాడి, ప్రజల ఆరోగ్యం మెరుగుపరచడానికి 1986 సంవత్సరంలో లండన్ ప్రధాన కార్యాలయంగా ‘ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ కౌన్సిల్’ ఏర్పడింది.

బాలి రాజధాని డెన్ పసర్‌లో 2011 సంవత్సరంలో జరిగిన ఈ కౌన్సిల్ సమావేశం ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 26 వ తేదీన ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం జరపాలని నిర్ణయించింది. పర్యావరణానికి ఇబ్బందికరంగా మారిన గ్రీన్ హౌస్ వాయువుల గురించి, వాతావరణ మార్పుల గురించి ప్రజల్లో అవగాహన కలిగించడం, కాలుష్య కారకాలను తగ్గించడానికి చర్యలు తీసుకోవడం, మొక్కలను పెంచడం వంటివి అంతర్జాతీయ పర్యావరణ ఆరోగ్య మండలి ప్రణాళికలో ప్రధానాంశాలు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించే కాలం కాలగర్భంలో కలసిపోయింది.

పచ్చని పంట పొలాలతో, పసందైన ప్రకృతి ఒడిలో స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ, అంటువ్యాధులను సైతం అవలీలగా జయించి, రసాయనిక పదార్ధాలు లేని, సహజ సిద్ధమైన బలవర్ధకమైన ఆహారాన్ని భుజించి, ఆరోగ్యవంతంగా నిండు నూరేళ్ళు జీవించిన నాటితరం నాటి జీవన విధానం నేడు కనుమరుగైనది. కృత్రిమ వాతావరణంలో, కాలుష్య కారకాల మధ్య నిరంతరం అష్టకష్టాలు పడుతూ, ఆరోగ్యాలు చెడి, అంటువ్యాధుల బారినపడి అలమటిస్తున్న జనవాహిని ఆవేదనలు, ఆక్రందనలు అత్యంత బాధాకరంగా ఉన్నాయి. నిరక్షరాస్యత ప్రబలంగా ఉన్న నాటి కాలంలో కూడా ప్రజలు ఎంతో విజ్ఞత ప్రదర్శించి, ప్రకృతిని దైవంగా ఆరాధించే వారు. విజ్ఞానం పెరిగిన కొద్దీ నేటి ప్రపంచం అజ్ఞానంలో అలమటిస్తూ, మితిమీరిన స్వార్థంతో ప్రకృతిపై విధ్వంస కాండను కొనసాగిస్తున్నది. పెరిగిన జనాభా ఇతర జీవరాశుల అంతానికి నాందిపలికింది.

పెరిగిన జనాభాకు సరిపడా ఆహారం సమకూర్చడం కోసం ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచవలసిన అవసరం ఏర్పడింది. ఆహారోత్పత్తుల పెంపుదలకు పంటల్లో విరివిగా రసాయనిక ఎరువుల వాడకం పెరిగింది. క్రిమికీటకాదుల నుండి పంటలను సంరక్షించడానికి మోతాదుకు మించి, క్రిమి సంహారక మందులను వినియోగించడం వలన పంటలకు సహజమితృలైన పలు జీవరాశులు నశించిపోయాయి. వాతావరణంలో కాలుష్యం పెరిగింది. ఊహించని వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రజల నివాసాలకోసం పచ్చని పొలాలు, అడవులు విధ్వంసమైనాయి. అవసరాలకు మించి ఆకాశహర్మ్యాలు పెరిగిపో యాయి. పట్టణాల సంస్కృతిని పల్లెలు సంతరించుకున్నాయి. నగరీకరణ వల్ల సహజసిద్ధమైన వాతావరణం అంతరించింది. కలుషితాలవల్ల అంటువ్యాధులు ప్రబలిపోతున్నాయి.

ప్రకృతిలో పలు అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పచ్చదనం హరించుకుపోయింది. ఐరాసతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడుతున్నాయి. ప్రజల్లో చైతన్యం కోసం పలు కార్యక్రమాలను రూపొందిస్తున్నాయి. ప్రపంచదేశాలన్నీ పర్యావరణం గురించి, పచ్చదనం ఆవశ్యకత గురించి పదేపదే చెబుతూనే ఉన్నా, అవన్నీ కేవలం మాటల వరకే పరిమితమవుతున్నాయి. సందర్భానుసారంగా మొక్కుబడిగా మొక్కలను నాటి, వాటి సంరక్షణను గాలికొదిలేయడం వల్ల మొక్కలు నాటే కార్యక్రమాలు నగుబాటు పాలవుతున్నాయి. పర్యావరణ సంరక్షణ సమష్టి బాధ్యత. సహజ సిద్ధమైన ప్రకృతిని పదిలంగా కాపాడుకుని, పర్యావరణాన్ని పరిరక్షించుకుంటే అనారోగ్యం దరిచేరదు.

Also Read : రైలు పైనుంచి బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగం అద్భుతం

  • సుంకవల్లి సత్తిరాజు
    9704903463
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News