Sunday, April 28, 2024

జీవ ఇంధనం పర్యావరణ హితం

- Advertisement -
- Advertisement -

జీవ ఇంధనాలను అధికంగా ఉత్పత్తి చేస్తూ వినియోగంలో కూడా ముందంజలో ఉన్న భారత్, బ్రెజిల్, అమెరికాలు ఇతర ఆసక్తి గల దేశాలతో (అర్జెంటీనా, కెనడా, ఇటలీ, దక్షిణ ఆఫ్రికా లాంటివి) కలిసి రాబోయే రోజుల్లో ‘ప్రపంచ జీవ ఇంధన కూటమి (గ్లోబల్ బయోఫ్యూయల్ అలియాన్స్)’ గా ఏర్పడాలని తీర్మానించుకోవడం హర్షదాయకం. భారత్ చొరవతో ఈ కూటమి ద్వారా దేశాలు సమన్యయంతో సుస్థిర జీవ ఇంధనాల రూపకల్పన, వాణిజ్య ఉత్పత్తి, సాంకేతిక నైపుణ్య వితరణ విధానాలు, మార్కెటింగ్/ రవాణా వ్యవస్థలను ఏర్పరుచుకోవడానికి ఇటీవల ఇండియా అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగిన జి -20 శిఖరాగ్ర సమావేశాల్లో నిర్ణయించడానికి భారత్ చొరవ తీసుకోవడం తెలిసిందే. ఈ కూటమిలోని మూడు ప్రధాన దేశాలు 85% జీవ ఇంధనాలను ఉత్పత్తి చేయడం, 81 శాతం జీవ ఇంధనాలను వినియోగించుకోవడం గమనించారు. జీవశక్తి (బయో ఎనర్జీ), జీవఆర్థికం (బయో-ఎకానమీ), శక్తి పరివర్తన క్షేత్రాలు (ఎనర్జీ ట్రాన్సిషన్ ఫీల్డ్) హరిత శక్తి వినియోగం, పర్యావరణ పరిరక్షణకు శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించడం లాంటి అంశాల్లో కూటమి దేశాలు సమన్యయంతో జీవ ఇంధనాల వినియోగానికి మార్గాలను సుగమం చేసుకోనున్నాయని తెలుస్తున్నది.

ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ నిర్వచనం ప్రకారం రవాణా వాహనాల్లో సాధారణంగా వినియోగించే గ్యాసోలీన్, డీజిల్, పెట్రోల్, వైమానిక సాంప్రదాయ శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా వాడే బయోమాస్ లేదా జీవ పదార్థం నుంచి ఉత్పన్నమైన ద్రవ ఇంధనాలను బయోఫ్యూయల్స్ లేదా జీవ ఇంధనాలు అంటారు. చెరకు, మొక్కజొన్నలు, సోయాబీన్స్, పంట వ్యర్థ వ్యవసాయ ఉత్పత్తుల నుంచి జీవ ఇంధనాలను తయారు చేస్తారు. భారత్ తన ముడి చమురు అవసరాల్లో 87% దిగుమతుల మీదనే ఆధారపడుతూ, విలువైన విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చించాల్సిన అగత్యం ఏర్పడుతున్నది. పర్యావరణ కాలుష్యానికి 25% శిలాజ ఇంధన రవాణా వ్యవస్థలు కారణం అవుతున్నాయి. అదే క్రమంలో ముడి చమురు సరఫరాలో అవాంతరాలు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం లాంటి ఒడుదుడుకులు మధ్య శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా విద్యుత్, జీవ ఇంధనాలు లాంటి ఇతర శక్తి వనరులను అన్వేషించడంతో జీరో కార్బన్ ఉద్గార దిశగా పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతున్నది.

విద్యుత్తు, బయో ఇంధన వాహనాల వినియోగం
ఆధునిక డిజిటల్ యుగంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఇవి) ఉత్పత్తితో పాటు వినియోగం కూడా ప్రోత్సహించడం విధిగా జరుగుతోంది. నేడు వాడబడుతున్న డీజిల్, పెట్రోల్, గ్యాస్ ఆధారిత వాహనాల్లో వినియోగిస్తున్న ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసిఇ) లను తొలగించి ఇవి వాహనాలకు నవ్య విద్యుత్ వాహనాల ఇంజిన్లను రూపొందించడానికి, క్రియాశీలత పెంచడానికి అధిక వ్యయం అవుతున్నది.దీని వల్ల ఇవి వాహనాల ధరలు అధికంగా, తయారీ మందకొడిగా జరుగుతోంది. ఇవి వాహనాల్లో వాడే బ్యాటరీలు, ముఖ్య ఖనిజాల కొరత కూడా తయారీ పరిశ్రమను వెంటాడుతున్నది. ప్రస్తుతం వినియోగిస్తున్న శిలాజ ఇంధన వాహనాల్లో ఉపయోగిస్తున్న ఐసిఇ ఇంజన్లు జీవ ఇంధనాలతో కూడా పని చేయడంతో సమస్య తీవ్రతను పూర్తిగా తగ్గనున్నది.

1జి, 2జి ఇథనాల్ జీవ ఇంధన వినియోగం
జీవ- ఇంధనాలకు పర్యాయపదంగా భారత్ నిలుస్తున్నది. భారత్ ఉత్పత్తి చేస్తున్న చెరకు పంటతో పాటు ఇతర ఆహార ధాన్యాల నుండి తయారు చేసే ఇథనాల్‌ను తొలి-తరం (ఫస్ట్ జనరేషన్, 1జీ ఇథనాల్) ఇథనాల్‌గా పిలుస్తున్నాం. 2025- 26 నాటికి భారత్‌లో వాడుతున్న సాంప్రదాయ డీజిల్ లేదా పెట్రోల్ తో 20% ఇథనాల్ కలిపి వాడడానికి పథకాలు /ప్రణాళికలు అమలు చేస్తున్నారు. నేడు పంట కోత తర్వాత ఉత్పన్నమైన వ్యర్థాల (ఎండు గడ్డి, ఇతర పంట వ్యర్థాలు) నుంచి రెండవ తరం (సెకండ్ జనరేషన్, 2జి) ఇథనాల్‌ను తయారు చేయడానికి భారత్ వడివడిగా అడుగులు వేస్తున్నది. చెరకు పంట, ఇతర ఆహార ధాన్యాల నుంచి జీవ ఇంధనం 1జి ఇథనాల్ తయారీ మూలంగా దేశంలో ఆహార అభద్రత,

భూగర్భ జలాల కొరత కూడా పెరిగే అవకాశం ఉందని గమనించాలి. భారత్ లాంటి పేదరికం కోరల్లో చిక్కిన అధిక జనాభా కలిగిన దేశంలో ఆహార ధాన్యాల నుంచి ఇథనాల్ తయారు చేయడం సముచితంగా కనిపించుట లేదు. ఆహార ధాన్యాలను అవసరం కన్న మిన్నగా ఉత్పత్తి చేయగలిగినపుడు జీవ ఇంధన 1జి ఇథనాల్ తయారీకి ఆహార ధాన్యాలను వినియోగించవచ్చు. భారత్‌లో ఆహార ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరడం, ధాన్యాల అధిక ఉత్పత్తికి అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. రాబోయే సమీప భవిష్యత్తులో జనాభా పెరగడంతో పాటు భూతాపంతో ఆహార ఉత్పత్తులు క్రమంగా తగ్గనున్నాయని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. 2040- 81 మధ్య భూగర్భ జలాలు మూడు రెట్లు తగ్గవచ్చని కూడా సూచనలు చేస్తున్న విషయాలను వింటున్నాం. భూగర్భ జలాలు తగ్గితే వాతావరణ ఉష్ణోగ్రతలు పెరగడం జరిగి పంటలకు నీటి అవసరాలు పెరుగుతాయి. అందువల్ల ఆహార ధాన్యాల నుంచి 1జి ఇథనాల్‌ను తయారు చేయడం సముచితం కాదని అర్థం అవుతున్నది.

జీవ ఇంధన ప్రయోజనాలు
ప్రస్తుతం పరిస్థితుల్లో భారత్‌లో చెరకు పంట మిగులు స్థాయిలో ఉండడంతో 1జి ఇథనాల్ ఉత్పత్తి సులభంగానే జరుగుతున్నప్పటికి రైతులకు సబ్సిడీలు ప్రకటించి అధిక ఆదాయం ఇస్తున్న మిగులు చెరకు పంట ఉత్పత్తిని తగ్గించడం ద్వారా నీటి కొరతను కూడా తగ్గించవచ్చని సలహా ఇస్తున్నారు. పంట వ్యర్థాల నుంచి 2జి ఇథనాల్ తయారు చేయడం ఉత్తమమని, దీని ద్వారా నీటి వినియోగం తగ్గడం, పంట వ్యర్థాలను మండించడం ద్వారా వెలువడే కాలుష్యాన్ని తగ్గించడం ఆహ్వానించదగిన పరిణామంగా గుర్తించాలి. జి -20 సదస్సు వేదికగా ఏర్పడిన గ్లోబల్ బయోఫ్యూయల్ కూటమి ద్వారా ఆసక్తి కలిగిన దేశాల్లో జీవ ఇంధనాల వినియోగం పెంచడం, ఉత్పత్తులు పెంచడం, మార్కెటింగ్/ రవాణా వ్యవస్థలు ఏర్పరచుకోవడం త్వరత్వరగా జరగాలి. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపి వినియోగించడంతో శిలాజ ఇంధన వాడకంతో పాటు కాలుష్యం కూడా తగ్గుతుందని తెలుసుకోవాలి. 2030 నాటికి జీవ ఇంధనాలను మూడు రెట్లు పెంచితేనే 2050 నాటికి మనం ఎంచుకున్న జీరో -ఉద్గార పరిస్థితులు వస్తాయని, కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ఇవి, జీవ ఇంధన వాహనాలను మాత్రమే వాడుకునే మంచి రోజులు త్వరలో రావాలని కోరుకుంటూ, ఆరోగ్యకర భారతాన్ని/ ప్రపంచాన్ని నిర్మించడంలో మన వంతు కర్తవ్యాన్ని నిర్వహిద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News