Friday, September 26, 2025

హైదరాబాద్ మెట్రో విస్తరణను కేంద్రం అడ్డుకోవడం లేదు: కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ మెట్రో విస్తరణను కేంద్ర ప్రభుత్వం ఆపడం లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కిషన్‌రెడ్డి కలిశారు. తెలంగాణలో జాతీయ రహదారుల ప్రాజెక్టుల అభివృద్ధి గురించి చర్చించారు. రాష్ట్రంలో రోడ్డు మార్గాల కనెక్టివిటీని మెరుగుపరచడం, ప్రాజెక్టుల విస్తరణపై కూడా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులు అత్యంత వేగవంతంగా సమర్ధవంతంగా పురోగతి సాధిస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2015 వరకు రాష్ట్రంలో 2500 కిలో మీటర్ల జాతీయ రహదారులు ఉండేవని, ఈ పదేళ్లలో తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం డబుల్ అయిందని చెప్పారు. సుమారు 5 వేల కిలోమీటర్లకు పైగా ఇప్పటికే పూర్తి అయిందని అన్నారు. హైదరాబాద్- శ్రీశైలం మార్గంలో నాలుగు లేన్ల ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. పర్యావరణానికి, వన్యప్రాణులకు ఎలాంటి నష్టం లేకుండా హైవేల నిర్మాణం చేపడతామన్నారు. శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం ముందుకొచ్చిందని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి గడ్కరీ చెప్పారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

హైదరాబాద్ మెట్రో నష్టాలు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం
హైదరాబాద్ మెట్రో రైలు ఇప్పటికే నష్టాల్లో నడుస్తోందని, అయితే మెట్రో నష్టాలు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారమైనందున వారే తేల్చుకోవాలని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మెట్రోకు అన్ని రకాలుగా కేంద్ర సహకారం ఉంటుందని అన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టు, హైదరాబాద్ మెట్రో విస్తరణ విషయంలో ప్రోయాక్టివ్ వ్యవహరించామని చెప్పారు. మెట్రో విస్తరణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవహారశైలి సమంజసంగా లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. భూసేకరణ త్వరగా పూర్తిచేస్తే, ప్రాజెక్టుల నిర్మాణం త్వరగా అవుతుందని తెలిపారు. రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు రావాలని కోరుకునే వ్యక్తుల్లో ముందుంటామని చెప్పారు. కాళేశ్వరంపై సీబీఐ ప్రతిపాదనలు అందాయని, ఆ అంశం పరిశీలనలో ఉందని స్పష్టం చేశారు.. భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్), కాంగ్రెస్ పార్టీలకు బిజెపి భయం పట్టుకుందని అన్నారు. బిఆర్‌ఎస్, కాంగ్రెస్‌తోనో బిజెపి కలిసే ప్రసక్తే లేదని కిషన్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై జరిగిన చర్చలో అసెంబ్లీలో బిజెపి మద్దతుఇచ్చిందని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తెలంగాణలో అన్ని జాతీయ రహదారులకు అనుసంధానం పెరుగుతోంది
తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో జాతీయ రహదారులకు అనుసందానం జరుగుతోందని కిషన్‌రెడ్డి చెప్పారు. దీంతో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా హైవేలపై రోడ్డు భద్రత కూడా పెరిగిందన్నారు. నూతన జాతీయ రహదారుల నిర్మాణానికి సుమారు రూ.30 వేల కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అన్నారు. దీనిలో భాగంగా కరీంనగర్‌లో మహదేవ్ పూర్ నుంచి సిరోచ వరకు 17 కిలోమీటర్ల రోడ్డు రూ.163 కోట్లతో చేపట్టనున్నట్లు చెప్పారు. నల్గొండ జిల్లాలో గౌరెల్లి నుంచి వలిగొండ వరకు 42 కిలోమీటర్ల రోడ్డు రూ.690 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు వివరించారు. అలాగే నకిరేకల్ నుంచి నాగార్జున సాగర్ వరకు 14 కిలోమీటర్ల రోడ్డు రూ.516 కోట్లతో నిర్మాణం, తెలంగాణ ఏపీకి అనుసందానం చేసే కృష్ణా నదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి సుమారు రూ.1082 కోట్లతో రానున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. ఈ బ్రిడ్జికి కనెక్టివిటీ కోసం రూ.430 కోట్లతో 13 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం మంజూరు అయిందని పేర్కొన్నారు. వరంగల్ తొర్రూర్ నుంచి నెహ్రూ నగర్ వరకు రూ.674 కోట్లతో 69 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఆధారాలు లేకుండా అర్థం లేని వ్యాఖ్యలు చేయవద్దని కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సూచించారు.

Also Read: ఆర్‌టిసి బస్సెక్కితే బహుమతులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News